Tuesday, April 6, 2021

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ

హైదరాబాద్ : 06/04/2021

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ.. అందులో ఏముందంటే.. - Newsreel (BBC తెలుగు )


మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో తమ సభ్యులు నలుగురు మరణించారని మావోయిస్టు పార్టీ అంగీకరించింది.

వారి పేర్లు నూపో సురేశ్, ఓడి సన్నీ (మహిళ), కోవాసి బద్రు, పద్దమ్ లఖ్మాగా పేర్కొంది.

ఈ నలుగురి ఫొటోలను విడుదల చేసింది.

కాగా మాడ్వి సుక్కా అనే గ్రామస్థున్ని పోలీసులు పట్టుకొని కాల్చేశారని ఆరోపించింది.

మావోయిస్టుల లేఖ

దాడి చేయడానికి వచ్చారు అందుకే..

సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో వివిధ గ్రామాలపై దాడి జరిపేందుకు బస్తర్‌లోని ఐజీ పి. సుందర్‌రాజ్‌ నేతృత్వంలో ఏప్రిల్ 3న 2000 మంది జవాన్లు ఈ ప్రాంతానికి తరలి వచ్చారని, అందుకే తాము ఎదురుదాడికి దిగామని మావోయిస్టులు ప్రకటించారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మంగళవారం ఓ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.

పోలీసులు దాడి చేయడానికి రావడంతో తమ సభ్యులు వారితో వీరోచితంగా పోరాడారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

ఈ పోరాటంలో తమ దళ సభ్యులు నలుగురు మరణించారని కూడా అందులో వెల్లడించారు.

ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను జన విరోధులుగా, సామ్రాజ్యవాదులుగా పేర్కొంటూ, తమను చంపడానికి భారీ ఎత్తున సైన్యాన్ని పంపారని ఆరోపించారు.

తమ ఎదురుదాడిలో 24మంది పోలీసులు మరణించారని 31మందికి పైగా గాయపడ్డారని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.

పోలీసులు తమ శత్రువులు కాదని ప్రకటించిన మావోయిస్టులు, మరణించిన పోలీసుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు.

చర్చల గురించి

"మేం చర్చలకు ఎప్పుడూ సిద్ధమే. కానీ ప్రభుత్వానికి ఇందులో నిజాయితీ లేదు. చర్చల్లో పాల్గొన్న వారెవరూ గతంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వెళ్లలేదు. కాబట్టి ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు జరుపుతామనే షరతు సరైంది కాదు. పోలీసు క్యాంపులను ఎత్తివేయాలి, దాడులు ఆపాలి, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే చర్చలు సాధ్యం" అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

కనిపించకుండా పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, అతన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లను ప్రకటించాలని, అప్పటి వరకు జనతన సర్కారు దగ్గర ఆ జవాన్‌ క్షేమంగా ఉంటాడని మావోయిస్టులు ఆ లేఖలో తెలిపారు.

No comments:

Post a Comment