కరోనా సెకండ్ వేవ్- ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు.
మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో రద్దీపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఎందుకు కరోనా పరీక్షలు చేయటం లేదని కోర్టు ప్రశ్నించింది.
నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు.. ప్రభుత్వ, ప్రైవేట్, కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెప్పాలని సూచించింది.
రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 70 శాతానికి టెస్టులు పెంచాలని సూచించింది. సీరో సర్వైలెన్స్ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. లాక్‌డౌన్ లేకపోయినా.. కంటైన్‌మెంట్ జోన్లు కచ్చితంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 16వేల మందికి జరిమానా విధించినట్లు కోర్టుకు తెలపగా… ఒక్కసారి పాతబస్తీకి వెళ్లి చూస్తే లక్షల మంది దొరుకుతారని కామెంట్ చేసింది. కరోనా ఆంక్షలు అమలయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై 22 వేల కేసులు, భౌతిక దూరం పాటించని వారిపై 2,416, రోడ్లపై ఉమ్మిన వారిపై ఆరు కేసులు నమోదు చేశారు.
No comments:
Post a Comment