BBC తెలుగు సౌజన్యంతో (ట్విట్టర్)
మట్టి సత్యాగ్రహం'లో తెలుగు రైతులు.. ఏపీ, తెలంగాణ నుంచి దిల్లీకి చేరిన మట్టి కుండలు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది.
ఘాజీపూర్, సింఘూ సరిహద్దుల దగ్గర కొన్ని నెలలుగా రైతులు నిరసనలు చేపడుతున్నారు.
రైతు ఉద్యమంలో మట్టి సత్యాగ్రహం ఒక కీలక ఘట్టంగా భావిస్తున్నారు.
ఈ మట్టి సత్యాగ్రహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 150 గ్రామాలకు చెందిన రైతులు మట్టికుండలను పంపించారు.
విస్సా కిరణ్ కుమార్ నేతృత్వంలో రైతు స్వరాజ్య వేదిక బృందం వీటిని దిల్లీకి తీసుకుని వచ్చి రైతు ఉద్యమ నాయకులకు అందించారు.
ఉప్పు సత్యాగ్రహం ముగిసిన ఏప్రిల్ ఆరునే ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు సమావేశాలు నిర్వహించారని రైతు స్వరాజ్య వేదిక పేర్కొంది.
నేరుగా రాలేక మట్టిని పంపించడం ద్వారా ఈ ఉద్యమానికి రైతులు తమ సంఘీభావం తెలిపారని విస్సా కిరణ్ కుమార్ అన్నారు.కనీస ధర రాకపోతే, మరింత మంది రైతులు అప్పుల్లో కూరుకుపోతారని కె. సాగరిక చెప్పారు.
ఆమె భర్త కొన్నేళ్ల క్రితం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మట్టి సత్యాగ్రహ ప్రచారాన్ని అంబేద్కర్ జయంతి వరకు కొనసాగిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment