Sunday, April 4, 2021

మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు


హైదరాబాద్ : 04/04/2021

*మీ త్యాగాలను  ఈ దేశం  ఎన్నటికీ మరవదు......!*

*ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్లకు ప్రముఖుల సంతాపం*

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్ల సంఖ్య 24కి చేరింది. ఈ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
'ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు' అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం వ్యక్తం చేశారు

మావోయిస్టులపై జరిగిన ఎదురు కాల్పుల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. వారి ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమన్న ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
మావోయిస్టులతో పోరాడుతూ అమరులైన భద్రతా సిబ్బంది త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అమరుల శౌర్యాన్ని దేశం ఎన్నటికీ మరచిపోదన్నారు. శాంతి విద్రోహ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందన్న ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం ప్రకటించిన ఆయన, గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బీజాపూర్‌ ఘటనలో అమరులైన వారికి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. అమరులైన జవాన్లకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌.. జవాన్ల త్యాగాలు వృథా కావన్నారు. మావోయిస్టుల ఏరివేత చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయని స్పష్టంచేశారు.
శనివారం జవాన్లపై మావోయిస్టులు చేసిన దాడిలో 31 మంది జవాన్లు గాయపడినట్లు బీజాపూర్‌ ఎస్పీ వెల్లడించారు. వీరిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారని.. గాయపడిన బీజాపూర్, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో ప్రస్తుతం మరో ఏడుగురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నక్సల్స్‌ దాడి ఘటనలో గల్లంతైనట్లు భావిస్తోన్న మరికొంత మంది జవాన్ల కోసం బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టామని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

*link Media SVL🖋️* 

No comments:

Post a Comment