Thursday, April 22, 2021

అమెరికానూ అధిగమించి..

హైదరాబాద్ : 23/04/2021

అమెరికానూ అధిగమించి..
ఈనాడు మీడియా (Twitter)

దేశంలో ఒకే రోజు 3,14,835 కేసులు
24 గంటల వ్యవధిలో 2,104 మంది మృతి
మన వద్ద అత్యంత వేగంగా వైరస్‌ వ్యాప్తి

అమెరికానూ అధిగమించి..

ఈనాడు, దిల్లీ: కరోనా రోజువారీ కేసుల గరిష్ఠ సంఖ్యలో మన దేశం ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో ఇప్పటివరకు అమెరికా ఈ విషయంలో ముందుంది. 3,14,835 కేసులతో భారత్‌ దీనిని అధిగమించినట్లయింది. మరే దేశంలోనూ ఒక్కరోజులో ఇంత మందికి కొవిడ్‌ సోకలేదు. వైరస్‌ సంక్రమణ వేగం కూడా మన వద్దే అధికంగా ఉంది. లక్ష నుంచి రెండు లక్షల కేసులకు చేరడానికి 33 రోజులు, 2 లక్షల నుంచి 3 లక్షల కేసులకు చేరడానికి 36 రోజుల సమయం అమెరికాకు పట్టింది. మన దేశం పది రోజుల్లోనే లక్ష నుంచి 2 లక్షల కేసుల స్థాయికి, ఏడు రోజుల్లోనే 2లక్షల నుంచి మూడు లక్షల కేసుల స్థాయికి ఎగబాకింది. గడిచిన 22 రోజుల్లోనే 37,78,630 మంది వైరస్‌ బారిన పడ్డారు. 22,099 మంది కన్నుమూశారు. వరుసగా రెండో రోజూ 2వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

అమెరికానూ అధిగమించి..

మరణాలు తక్కువే

రోజువారీ కరోనా బాధితుల సంఖ్య మన దేశంలో అధికంగా ఉన్నప్పటికీ వైరస్‌ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అమెరికాలో ఒక్కరోజు మాత్రమే 3 లక్షల కేసులు నమోదై ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో అక్కడ 65,057 మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం మరణాలపరంగా బ్రెజిల్‌ ముందుంది. అక్కడ రోజూ 3వేల మందికిపైగా కన్నుమూస్తున్నారు. ప్రతి పది లక్షల మందికి అమెరికాలో 98వేలు, బ్రెజిల్‌లో 66వేల కరోనా కేసులు నమోదవుతుంటే భారత్‌లో ఆ సంఖ్య 11,449కే పరిమితమైంది. మరణాలు ప్రతి పది లక్షల జనాభాకు అమెరికాలో 1,754, బ్రెజిల్‌లో 1,785 సంభవిస్తుంటే భారత్‌లో 133కి పరిమితమయ్యాయి. మనదేశంలో కొవిడ్‌ మరణాలను సరిగా లెక్కించడం లేదని, దీని బారినపడి చనిపోయిన వారినీ సాధారణ మరణాల ఖాతాలో వేస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఆసుపత్రి మెట్లపై...భార్య ఒడిలోనే...
రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అటు ఆసుపత్రుల్లో, ఇటు శ్మశానాల దగ్గర రద్దీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఆక్సిజన్‌ అవసరం పెరిగిపోవడంతో బాధితులు రోగం కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలు అందక అల్లాడిపోతున్నారు. మహారాష్ట్రలో సమయానికి ప్రాణవాయువు అందక మరో కరోనా రోగి మరణించాడు. కనీసం పడక లభించక.. ఆస్పత్రి మెట్ల వద్ద భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ హృదయవిదారక ఘటన నాసిక్‌లో జరిగింది. అరుణ్‌ మాలీ అనే వ్యక్తిని అతని భార్య చాంద్వాడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా పడకల కొరతతో చేర్చుకోలేదు. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మాలీకి ఆక్సిజన్‌ అయినా అందించాలని ఆమె వేడుకున్నా సహాయం కరవైంది. చికిత్స కన్నా ముందే మృత్యువు అతడిని కబళించింది.

అమెరికానూ అధిగమించి..

విమానాశ్రయం నుంచి 300 మంది పరారీ
అసోంలోని సిల్చార్‌ విమానాశ్రయం నుంచి దాదాపు 300 మంది ప్రయాణికులు ఒక్కసారిగా పారిపోయారు. దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాల ద్వారా 690 మంది ప్రయాణికులు బుధవారం సిల్చార్‌ విమానాశ్రయానికి చేరుకోగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. వారిలో దాదాపు 300 మంది ప్రయాణికులు రూ.500 చొప్పున పరీక్ష రుసుం చెల్లించడంపై వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి పరారయ్యారు.
పట్నాలో 500 మంది వైద్య సిబ్బందికి కరోనా
బిహార్‌లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికిపైగా వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో 70 మంది డాక్టర్లు కూడా ఉన్నారు. పట్నా ఎయిమ్స్‌లో 384 మంది, పట్నా మెడికల్‌ కళాశాలలో 125 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు.


ఆసుపత్రిలో 1710 కొవిడ్‌ టీకా డోసులు చోరీ

హరియాణాలోని జింద్‌ జిల్లా సివిల్‌ ఆసుపత్రి నుంచి కొందరు దుండగులు 1710 టీకా డోసులు ఎత్తుకెళ్లినట్లు యాజమాన్యం తెలిపింది.

No comments:

Post a Comment