Wednesday, April 14, 2021

నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దర్ని చంపేందుకు సస్పెండ్ అయిన ముంబై పోలీస్ అధికారి వాజ్ కుట్ర

హైదరాబాద్ : 14/04/2021
నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దర్ని చంపేందుకు వాజ్ కుట్రప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద ఫిబ్రవరి 25న కలకలం రేపిన పేలుడుపదార్థాలతో కూడిన వాహనం కేసులో మరో ట్విస్ట్‌ బయటపడింది. ఈ కేసుతోపాటు ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ రెండు కేసులతో ప్రమేయం ఉన్న సస్పెండైన ముంబై పోలీస్‌ అధికారి సచిన్‌ వాజ్‌, తొలుత నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరిని చంపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. తద్వారా పేలుడుపదార్థాలతో కూడిన వాహనం కేసును నకిలీ ఎన్‌కౌంటర్‌తో ముగించాలని సచిన్‌ వాజ్‌ భావించాడు. అయితే దానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తప్పును హిరేన్‌పై నెట్టేందుకు ఆయనను హత్య చేయించాడు.

మార్చి 17న సచిన్‌ వాజ్‌ ఇంట్లో లభించిన ఒక పాస్‌పోర్ట్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులకు ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌ కుట్ర విషయం తెలిసింది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయిన వాజ్‌, పాస్‌పోర్ట్‌ కలిగిన వ్యక్తితోపాటు మరొకరిని ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో చంపి పేలుడు పదార్థాలతో ఉన్న కారు కేసును వారిపై మోపాలని భావించాడు. దీని కోసం గత ఏడాది నవంబర్‌లో ఔరంగాబాద్‌లో చోరీకి గురైన మారుతీ ఎకో కారును వినియోగించాలని ప్లాన్‌ వేశాడు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉంచి అందులో వారిద్దరు ఉండేలా ప్లాన్‌ చేసి ఎన్‌కౌంటర్‌లో చంపాలని అనుకున్నాడు.

దీని కోసం ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద నిలిపిన పేలుడు పదార్థులున్న స్కార్పియో కారు నంబర్‌ పేట్లను వాజ్ మార్చాడు. వాహనం ఛాసిస్‌ నంబర్‌ను గీకి కనబడకుండా చేశాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఏటీఎస్‌, బీమా స్టికర్‌ ఆధారంగా ఆ వాహనం హిరేన్‌కు చెందినదిగా గుర్తించారు. దీంతో ప్లాన్‌ మార్చిన సచిన్‌ వాజ్‌, ఆ తప్పును అతడిపైకి నెట్టేందుకు ప్రయత్నించి ఒత్తిడి తెచ్చాడు. అయితే తప్పును మీద వేసుకునేందుకు హిరేన్‌ అంగీకరించకపోవడంతో తన అనుచరులతో హత్య చేయించి ప్లాన్‌ బి అమలు చేశాడు.

సీపీయూ, రెండు డీవీఆర్‌లతోపాటు కారు నంబర్‌ పేట్లు నదిలో లభించడంతో వాజ్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కుట్ర ప్లాన్‌పై ఎన్‌ఐఏకు స్పష్టత వచ్చింది. డీవీఆర్‌లు, కమిషనర్‌ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఆయన ధ్వంసం చేయడంతో కీలక ఆధారాలు లభించడం ఎన్‌ఐఏకు సవాల్‌గా మారింది. మరోవైపు అరెస్ట్‌కు ముందు వరకు వాజ్ వినియోగించని మొబైల్‌ ఫోన్‌ కనిపించకుండా పోయింది. ఇది లభిస్తే ఈ కేసు చిక్కుముడి అంతా వీడుతుందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

పెద్ద మొత్తంలో డబ్బు కోసమే సచిన్ వాజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. కాగా ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసింది. సచిన్‌ వాజ్‌, సస్పెండైన కానిస్టేబుల్‌ వినాయక్‌ షిండే, క్రికెట్‌ బుకి నరేశ్‌ గౌర్‌, వాజ్‌ సహోద్యోగి రియాజ్‌ కాజీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది.

@నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో 

No comments:

Post a Comment