Saturday, November 21, 2026

సంగారెడ్డిలో ఘనంగా డీజేయఫ్ DJF 11వ రాష్ట్ర మహాసభలు_

*అంబేడ్కర్ ఆశయాలే అజెండా.. జర్నలిస్టుల హక్కులే లక్ష్యం.*

*సంగారెడ్డిలో ఘనంగా డీజేయఫ్  DJF 11వ రాష్ట్ర మహాసభలు*
 
• ఐక్యత,చైతన్యం,పోరాటానికి పిలుపు.

• బోధించు | సమీకరించు |పోరాడు.

హైదరాబాద్ /సంగారెడ్డి (మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ ),నవంబర్ 19:

దళిత జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం,రాజ్యాంగ హక్కుల సాధన, పాత్రికేయ రంగంలో కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమ నిర్మాణమే లక్ష్యంగా దళిత జర్నలిస్టుల ఫోరమ్ డీజేయఫ్ 11వ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్‌లో నిర్వహించారు. ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాసపోగు జాన్ నాయకత్వంలో జరిగిన ఈ మహాసభలకు వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు,సంఘ నాయకులు, ప్రముఖులు,దాతలు,సహాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు.మహాసభకు హాజరైన పాత్రికేయుల సంఖ్య పరిమితంగానే ఉన్నప్పటికీ,ఫోరమ్ వ్యవస్థాపక నాయకత్వం,జాతీయ స్థాయి ప్రతినిధులు,రాష్ట్ర నాయకులు, దాతలు,సహకరించిన వ్యక్తుల కృషి సభలో ప్రత్యేక చైతన్యాన్ని నింపింది.అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడంతో పాటు జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలనే సందేశాన్ని నాయకులు బలంగా వినిపించారు.సభ ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి డీజేయఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాసపోగు జాన్,జాతీయ ప్రధాన కార్యదర్శి, 10 టీవీ స్టాఫర్ ఎ.డేవిడ్,సీనియర్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్,మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్,దళిత ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లేష్,సంగారెడ్డి దళిత జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు రామని అశోక్,జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నవీన్ కుమార్,వైబ్ న్యూస్ బ్యూరో శ్రీధర్ యాలాల తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా  వ్యవస్థాపక అధ్యక్షులు కాసపోగు జాన్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఫోరమ్ ఆవిర్భవించిందని,సంఘటిత శక్తితోనే సామాజిక వివక్షను ఎదుర్కొని న్యాయమైన హక్కులను సాధించగలమని స్పష్టం చేశారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.డేవిడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు వ్యక్తిగత సమస్యలుగా కాకుండా వృత్తిపరమైన హక్కుల అంశాలుగా చూడాలని,దళిత జర్నలిస్టులపై జరుగుతున్న వివక్ష, దాడులకు వ్యతిరేకంగా సమష్టి కార్యాచరణ అవసరమని పిలుపునిచ్చారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్కాకుల రత్నకుమార్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన విద్య,సంఘటితం,పోరాటం అనే మార్గంలో జర్నలిస్టులు ముందుకు సాగాలని,ఐకమత్యమే మహాబలమనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు.డీజేయఫ్ ఉపాధ్యక్షులు మీసాల ఎల్లేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో ఐక్యత కీలకమని,కుల,ప్రాంత,సంస్థాగత భేదాలకు అతీతంగా పాత్రికేయులంతా ఒకే గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులపై దాడులు,వివక్ష,వృత్తిపరమైన ఇబ్బందులపై సంఘటితంగా స్పందించాలని సూచించారు.
సీనియర్ ఫ్రీలాన్స్ పొయెట్ జర్నలిస్ట్, సెంట్రల్ మీడియా భవన్ కార్యసాధకుడు,ఎడిటర్,జర్నలిస్ట్ జాతీయ అవార్డు గ్రహీత,ఉత్తమ కలం యోధ అవార్డు గ్రహీత,సోషల్ ఫైటర్ విజయసంకల్పం ప్రసాద్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి జర్నలిస్టు ఆలోచనలో,ఆచరణలో ప్రతిబింబించాలని అన్నారు. జర్నలిజం అనేది కేవలం వార్తల సేకరణ, ప్రచురణ మాత్రమే కాదని,సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యత అని పేర్కొన్నారు.దళిత జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు మహిళా పాత్రికేయులు కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయుల సేవలను గుర్తించి తగిన గుర్తింపుతో పాటు నామినేటెడ్ పదవుల్లో సముచిత అవకాశాలు కల్పించాలని కోరారు.మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో,జర్నలిస్ట్ జాతీయ అవార్డు గ్రహీత, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత బాపట్ల కృష్ణమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టుల మధ్య పరస్పర గౌరవం,సహకారం,ఐక్యత పెంపొందినప్పుడే వృత్తిపరమైన సమస్యలపై సమర్థవంతంగా పోరాడగలమని అన్నారు.మహిళా పాత్రికేయులును ప్రోత్సహించాలన్నారు.అంబెడ్కర్ ఆశయాలను చెప్పుకొని కొందరు పెద్దలు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సమస్య మీదా పరిష్కారం నాది అనేలా ప్రతి యొక్కరికి అందుబాటులో ఉంటానని ఈ మహాసభలో సూచించారు.ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని,ఆ పాత్రను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు జర్నలిస్టులకు భద్రత,గౌరవం,ప్రభుత్వ గుర్తింపు అవసరమని పేర్కొన్నారు.వైబ్ న్యూస్ బ్యూరో శ్రీధర్ యాలాల మాట్లాడుతూ అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో దళిత జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారి వృత్తిపరమైన భద్రత, సామాజిక గౌరవం కోసం ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని అన్నారు.నమస్తే తెలంగాణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీనియర్ రిపోర్టర్ శ్రీకాంత్,మేకర్తి దినపత్రిక ప్రతినిధి కె.అన్నమ్మ,ఆర్.యన్.యన్ 24 న్యూస్ సీఈఓ కె.నవజీవన్,టీఐ 20 న్యూస్ సీఈఓ కె.అరుణ తదితరులు కూడా జర్నలిస్టుల ఐక్యత, మహిళా పాత్రికేయుల భాగస్వామ్యం,వృత్తిపరమైన గౌరవం,హక్కుల పరిరక్షణ ఆవశ్యకతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ మహాసభలు కేవలం ఒక సంఘ సమావేశంగా కాకుండా దళిత జర్నలిస్టుల సమస్యలను చర్చించే,భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచాయి.జర్నలిస్టులందరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, మహిళా పాత్రికేయులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని,అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సభలో పిలుపునిచ్చారు.మహాసభకు విచ్చేసిన ప్రముఖులు,జర్నలిస్టులు, అతిథులను నిర్వాహకులు శాలువాలు,మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.సభ విజయవంతానికి కృషి చేసిన దాతలు, సహాయకులు, ఫోరమ్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
==========
*మహాసభ నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు:*

- కాసపోగు జాన్ – దళిత జర్నలిస్టుల ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు
- ఎ.డేవిడ్ – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- అక్కారపు రత్నకుమార్ – తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్
- యాదగిరి – తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
- యం.డి.రాజ్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
- మీసాల ఎల్లేష్ – DJF ఉపాధ్యక్షులు
- రామని అశోక్ – సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
- కె.నవీన్ కుమార్ – సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి.
==========
*మహాసభ ఇచ్చిన సందేశం ఒక్కటే:*
జర్నలిస్టుల మధ్య కుల, ప్రాంత, సంస్థాగత భేదాలు ఉండకూడదు. హక్కుల విషయంలో అందరూ ఒక్కటిగా నిలవాలి. దళిత జర్నలిస్టులపై వివక్షను ప్రశ్నించాలి.మహిళా పాత్రికేయులను ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. ప్రభుత్వాలు జర్నలిస్టుల సేవలను గుర్తించి తగిన గౌరవం, భద్రత,అవకాశాలు కల్పించాలి.
కలం బలహీనుల పక్షాన నిలవాలి.ఐక్యత హక్కుల సాధనకు ఆయుధం కావాలి.అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి రావాలి పిలుపునిచ్చారు.చివరిలో వ్యవస్థాపకులు కాసపోగు జాన్,ప్రధాన కార్యదర్శి ఎ.డేవిడ్,దళిత జర్నలిస్ట్ ఫోరమ్ సభ్యులతో,ముఖ్య అతిథులతో కేక్ ను కట్ చేసి సంబరాలతో వేదిక సూపర్ సక్సెస్ ను చేయడం లో జాన్,డేవిడ్,ఎల్లేష్,సంగారెడ్డి కమిటీ విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ సభ్యులు,సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment