*డీఎస్పీలు, అదనపు ఎస్పీల దీర్ఘకాలిక పదోన్నతుల సమస్య పరిష్కారం అయింది*
*ప్రమోషన్ల ప్రక్రియకు డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో మార్గం సుగమమైంది.*
బాపట్ల కృష్ణమోహన్ హైదరాబాద్ బ్యూరో, మీడియా టుడే, నవంబర్ 17:
1991,95, 96 బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీలు, అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులకు వివిధ కారణాల వలన చాలా కాలంగా ప్రమోషన్స్ రాలేదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పదోన్నతుల సమస్య ఎట్టకేలకు పరిష్కారమయ్యింది.
సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఏళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్ల ప్రక్రియకు డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో మార్గం సుగమమైంది.
ఇది సంబంధిత అధికారులకు ఎంతో ఊరటనిచ్చే పరిణామం.
గతంలో ఈ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పదోన్నతులకు సంబంధించి ఉన్న సంక్లిష్టతలను వారికి వివరించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు నమ్మకంతో, సహకరించాలని కోరాను అని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
అందుకు స్పందించిన అధికారులందరూ న్యాయస్థానాల్లోని తమ కేసులను ఉపసంహరించుకున్నారు. డీజీపీ నిర్ణయాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోయినా న్యాయపరమైన చర్యలకు వెళ్లబోమని అఫిడవిట్లు సమర్పించారు. ఈ విధంగా 100 శాతం మంది అధికారులు అంగీకారం తెలిపిన నేపథ్యంలో, తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు మరోసారి వారితో డీజీపీ సీవీ ఆనంద్ సమావేశమయ్యారు.
గత కొన్ని నెలలుగా డీజీపీ కార్యాలయం, ఐజీ పర్సనల్ తో కూడిన కమిటీ సీనియారిటీ జాబితాలు, సీనియారిటీకి సంబంధించిన వ్యత్యాసాలు, ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ లు పెండింగ్‌లో ఉన్న కోర్ట్ కేసులను సమగ్రంగా పరిశీలించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం విస్తృత కసరత్తు చేసింది. ఈరోజు కమిటీ చేసిన సిఫార్సులను అధికారులకు వివరించాను. అందుబాటులో ఉన్న ఖాళీలతో పాటు, తొలిసారిగా ప్రతి అధికారి వారీగా ప్రతిపాదించిన పదోన్నతి, పదోన్నతి తేదీ వివరాలను వారి ముందుంచాను అని డీజీపీ అన్నారు.కమిటీ సిఫార్సులకు అధికారులందరూ ఏకగ్రీవంగా అంగీకరించడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ కసరత్తు చేపట్టి ఉండకపోతే, ఈ అధికారుల్లో చాలామంది తమకు రావాల్సిన పదోన్నతులు పొందకుండానే ప్రస్తుత హోదాల్లో పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. ప్రభుత్వానికి ఈ వివరాలను తెలియజేసిన అనంతరం, దశలవారీగా పదోన్నతుల ప్రక్రియ చేపడతాం. తొలుత 1991 బ్యాచ్‌తో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ ప్రక్రియలో సహకరించిన అధికారులను అభినందిస్తున్నాను అని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
No comments:
Post a Comment