Sunday, November 1, 2026

ఎల్ నినో, నీటి సంక్షోభం నేపథ్యంలో భారీ ఏ.ఐ డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలి_

*పత్రిక ప్రకటన*

*ఎల్ నినో, నీటి సంక్షోభం నేపథ్యంలో భారీ ఏ.ఐ డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలి*

*మానవ హక్కుల వేదిక HRF*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 28:

భారీ స్థాయి ఏఐ కృత్రిమ మేధ డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ వనరుల వినియోగం తాగునీటి అవసరాలకు, వ్యవసాయానికి, పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించదని ప్రజలకు అందుబాటులో ఉండే అధ్యయనాలు నిర్ధారించే వరకు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే  డేటా సెంటర్ ల ఏర్పాటు అమలు కు  హామీల ను నిలిపివేయాలని, కొత్తగా ఎలాంటి హామీలూ ఇవ్వకూడదని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. 
ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత డేటా సెంటర్లన్నింటినీ కలిపి సమగ్రంగా అంచనా వేయాలి. 
ఈ ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో
పాటు, వనరుల వినియోగంపై అమలు చేయదగిన పరిమితులను విధించాలి.
ఎల్ నినో ప్రభావం, ముంచుకొస్తున్న నీటి సంక్షోభం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఆయన ప్రభుత్వం భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును  ప్రోత్సహించడం తీవ్ర వైరుధ్యంతో కూడుకున్నది. రాష్ట్రం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ఇప్పటికే సమస్య గా ఉన్న నీరు, విద్యుత్ వనరులపై మరింత భారాన్ని  పెంచే భారీ కంప్యూటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఏమాత్రం ముందుచూపు లేని నిర్ణయం.
రానున్న నెలల్లో వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించారు. తాగునీటిని కాపాడుకోవడానికి రైతులు ఒక పంట కాలాన్ని వాయిదా వేసుకోవాలని కూడా కోరారు. అంతేకాకుండా, ప్రజలకు తాగునీరు అందించడాన్ని సైతం హామీ ఇవ్వడం కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు.  హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు HMWSSB నీటి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి.వ్యవసాయానికి నీరు అందించలేని, కనీసం ప్రజలకు తగినంత తాగునీటిని కూడా హామీ ఇవ్వలేని ప్రభుత్వం, అపారంగా నీటిని వినియోగించే భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లను రాష్ట్రానికి ఆహ్వానించడం తగదు. తెలంగాణలో రైతులకు నీరు లేదు, ప్రజల అవసరాలకు సరిపడా నీరు లేదు, కానీ బడా సాంకేతిక సంస్థలకు మాత్రం సమృద్ధిగా నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది
 ప్రాధాన్యతలను తలకిందులు చేసే ఈ చర్య ,
ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.

**భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లు సాధారణ పారిశ్రామిక సంస్థలు కావు**

వీటిలో అపారమైన కంప్యూటింగ్ కార్యకలాపాలకు భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. వీటిని చల్లబరిచేందుకు అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థలు అవసరమవుతాయి. 
ఈ వ్యవస్థలు గణనీయమైన పరిమాణంలో నీటిని వినియోగించవచ్చు. అంతేకాకుండా, ఈ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే నీటిని కూడా వాటి మొత్తం నీటి వినియోగంలో భాగంగా పరిగణించాలి. వాస్తవ ప్రభావం శీతలీకరణ సాంకేతికత, నిర్వహణ పరిస్థితులు, నీరు మరియు విద్యుత్ వనరులపై ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే హామీల మాటున ఈ ప్రభావాలను మరుగునపరచకుండా, స్వతంత్రంగా అంచనా వేయాలని HRF అభిప్రాయపడుతోంది.ఈ ప్రాజెక్టులను సమర్థించుకోవడానికి ప్రభుత్వం నీటి పునర్వినియోగం, శుద్ధి చేసిన మురుగునీటి వినియోగం, నీటి వినియోగంలో నికర ప్రభావం లేని రూపకల్పన వంటి అంశాలను ప్రస్తావించవచ్చు. అయితే, వాస్తవ నీటి వినియోగం, వివిధ రుతువుల్లో నీటి లభ్యత, నీటి కోసం పోటీ పడుతున్న ఇతర అవసరాలపై పారదర్శకమైన అధ్యయనాలకు ఇవి ప్రత్యామ్నాయం కాలేవు. పెట్టుబడులు, సాంకేతిక రంగంలో ప్రతిష్ఠ వంటి అంశాలకు ప్రజల ప్రాథమిక అవసరాలు, స్థానిక పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు.
ఈ భారీ ఏఐ డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ మిగులు రాష్ట్రం కాని తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ఇప్పటికే ఒత్తిడి పెరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్రాలకు భారీ మొత్తంలో విద్యుత్‌ను కేటాయించడం వల్ల ప్రస్తుత సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. గృహాలు, వ్యవసాయం, ఇతర ఉత్పాదక రంగాల అవసరాలతో విద్యుత్ కోసం పోటీ పెరుగుతుంది. ఇప్పటికే పంట కోత సమయంలో రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, 2029 నాటికి 5 గిగావాట్ల GW సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కేంద్రాలు నిరంతరం, 24 గంటలూ పనిచేస్తాయి. వీటికి రెండు విద్యుత్ గ్రిడ్ల నుంచి సరఫరా ఉంటుందని హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర రంగాల ఇంధన అవసరాలకు విఘాతం కలగకుండా ఈ అదనపు విద్యుత్ డిమాండ్‌ను ఎలా తీర్చగలదో ప్రభుత్వం వివరించాలి.దేశీయ, అంతర్జాతీయ భారీ సాంకేతిక సంస్థల కంప్యూటింగ్ అవసరాలను ప్రధానంగా తీర్చే మౌలిక సదుపాయాల కోసం విలువైన భూమి, నీరు, విద్యుత్ వనరులను కేటాయించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈ భారీ పెట్టుబడుల వల్ల ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చేస్తున్న గొప్ప ప్రకటనలను, ఇటువంటి అధిక మూలధనంతో ఏర్పాటయ్యే కేంద్రాలు శాశ్వతంగా కల్పించే ఉద్యోగాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుoది. అంతేకాకుండా, ఈ విధ్వంసకర భారీ ప్రాజెక్టుల పర్యావరణ వ్యయాన్ని చివరకు భరించాల్సి వచ్చేది స్థానిక ప్రజలే.అరుదుగా లభించే నీటి వనరులను సమానత్వ ప్రాతిపదికన పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. రైతులు రానున్న కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తాగునీటి సరఫరాపై కూడా అనిశ్చితిని అంగీకరిస్తున్న ప్రభుత్వం, అత్యధిక వనరులను వినియోగించే పరిశ్రమలకు మాత్రం సాదర స్వాగతం పలకడం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోంది? ఎవరి మూల్యంగా ఆ ప్రయోజనాలను నెరవేర్చాలనుకుంటోంది? అనే తీవ్రమైన ప్రశ్నలను ఈ విధానం లేవనెత్తుతోంది.బడా సాంకేతిక సంస్థల విస్తరణ ఆకాంక్షల కంటే ప్రజల ప్రాథమిక అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. నీటి కొరతతో సతమతమవుతున్న రాష్ట్రంలో, భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లను పర్యావరణానికి అనుకూలంగా ఎలా ఏర్పాటు చేయాలన్నది మాత్రమే ప్రశ్న కాదు.అసలు వాటిని ఏర్పాటు చేయడం సమంజసం కాదు.

**వి.ఎస్. కృష్ణ**
**ఎస్. జీవన్ కుమార్**
మానవ హక్కుల వేదిక (HRF)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు

No comments:

Post a Comment