*పత్రికా ప్రకటన*
*అబ్దుల్ కలాం ఆజాద్ పేరు పలికే అర్హత కోల్పోయిన కాంగ్రెస్!*
*అబ్దుల్ కలాం పేరుతో ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు...?*
*ఎండీ షబ్బీర్ - అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర సంచారా ముస్లిం తెగల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 10:
మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును ప్రస్తావిస్తూ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పూలమాలలు వేసి నివాళులర్పించడం మాత్రమే నిజమైన గౌరవం కాదు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు అండగా నిలబడినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. తెలంగాణలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తన మైనారిటీ డిక్లరేషన్లో *అబ్దుల్ కలాం తౌఫా-ఏ-తాలీమ్ పథకాన్ని* ప్రకటించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ 10,000, ఇంటర్మీడియట్కు రూ 15,000, డిగ్రీకి రూ 25,000, పీజీకి రూ 1 లక్ష, ఎం.ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన వారికి రూ 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.కానీ నేటికీ ఈ పథకం అమలుపై స్పష్టమైన కార్యాచరణ, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియ, నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. పేద ముస్లిం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ హామీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు.
*ప్రభుత్వానికి మా సూటి ప్రశ్నలు:*
*(1)*: అబ్దుల్ కలాం తౌఫా - ఏ - తాలీమ్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు?
*(2)*: ఈ పథకానికి ప్రత్యేకంగా ఎంత బడ్జెట్ కేటాయిస్తారు?
*(3)*: అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి అందిస్తారు?
*(4)*: పథకం అమలుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారు?
ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయి, జయంతి–వర్ధంతి కార్యక్రమాల్లో పూలమాలలు వేసి నివాళులర్పించడానికే పరిమితం కావడం సరిపోదు. *ఉత్తుత్తి జయంతి, వర్ధంతి ఆర్భాటాలను పక్కనపెట్టి, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇచ్చిన హామీని అమలు చేయాలి.*
మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు చెప్పే ప్రతి సందర్భంలో ఆయన ఆశయమైన విద్యాభివృద్ధిని గుర్తు పెట్టుకోవాలి. ఆయన పేరుతో ప్రకటించిన పథకాన్ని అమలు చేయకుండా ఇంకా ఎంతకాలం విద్యార్థులను నిరీక్షింపజేస్తారు?
*అబ్దుల్ కలాం ఆజాద్ పేరు పలికే అర్హతను నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.*
తక్షణమే తౌఫా - ఏ - తాలీమ్ పథకం అమలు తేదీని ప్రకటించి, నిధులు కేటాయించి, పేద ముస్లిం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
*ఎండీ షబ్బీర్*
ఫౌండర్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,
తెలంగాణ రాష్ట్ర సంచారా ముస్లిం తెగల సంఘం (బీసీ ఈ 1-14)
No comments:
Post a Comment