Tuesday, November 10, 2026

విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డ మున్సిపల్ కార్మికులు_

**విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డ మున్సిపల్ కార్మికులు**

*విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడటం అత్యంత ఆందోళనకరం.*

*సీతారాం ధూళిపాళ వ్యవస్థాపక అధ్యక్షులు,ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 08:

వార్డు 128, నెక్నాంపూర్ పరిధిలో ఔట్‌సోర్సింగ్ కార్మికులకు జరిగిన రెండు తీవ్రమైన విద్యుత్ ప్రమాదాలు – బాధ్యత నిర్ధారణ మరియు చట్టబద్ధమైన కార్మిక భద్రతా నిబంధనలు అమలు చేయాలని సీతారాం ధూళిపాళ వ్యవస్థాపక అధ్యక్షులు,ది సిటిజన్స్ కౌన్సిల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వార్డు 128 పరిధిలో గత 48 గంటల్లో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడటం అత్యంత ఆందోళన కలిగించిందని సీతారాం ధూళిపాళ అన్నారు.ఈ ఘటనకు సంబందించి డిప్యూటీ కమిషనర్ ,నార్సింగి సర్కిల్ 45,
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జోనల్ కమిషనర్, శేరిలింగంపల్లి జోన్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ AMOH, నార్సింగి సర్కిల్ 45, అధికారులకు అవసరమైన చర్యల నిమిత్తం తక్షణ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

**విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డ మున్సిపల్ కార్మికులు**

*(1)*: శ్రీ ప్రవీణ్, పారిశుద్ధ్య కార్మికుడు, ఫ్రెండ్స్ కాలనీలోని మెడ్‌ప్లస్ సమీపంలో.

*(2)*: శ్రీ రాజు, విద్యుత్ నిర్వహణ కార్మికుడు,మణికొండ బస్‌స్టాప్ వద్ద.

ఇద్దరూ విధి నిర్వహణలో తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు PPE లేకుండానే పనిచేసినట్లు సమాచారం. వారి ESI మరియు ప్రమాద బీమా సదుపాయాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనలపై వృత్తిపరమైన భద్రత,ఆరోగ్యం మరియు పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ 2020 సెక్షన్లు 6, 10, 23, 53, సాంఘిక భద్రతా కోడ్ 2020, విద్యుత్ చట్టం
2003 సెక్షన్ 53, CEA భద్రతా నిబంధనలు 2023 రెగ్యులేషన్ 21 - 2మరియు3, అలాగే వర్తించే మున్సిపల్ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

**తక్షణమే క్రింది చర్యలు చేపట్టాలని కోరుతున్నాము**

*(1)*: భద్రతా లోపాలు మరియు పర్యవేక్షణ వైఫల్యాలకు సంబంధిత వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలి.
*(2)*: డిప్యూటీ కమిషనర్, AMOH మరియు సంబంధిత విద్యుత్ భద్రతా అధికారులతో తక్షణ సంయుక్త విచారణ జరిపించి వ్యక్తిగత, సంస్థాగత బాధ్యతలను నిర్ధారించాలి.
*(3)*: నార్సింగి సర్కిల్-45 పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులందరి EPF, ESI, ప్రమాద బీమా మరియు PPE నిబంధనల అమలు రికార్డులను తనిఖీ చేయాలి.
*(4)*: బాధితులిద్దరికీ తక్షణ వైద్య సహాయం అందించి, వర్తించే బీమా ప్రయోజనాలు మరియు చట్టబద్ధమైన పరిహారం మంజూరు చేయాలి.
*(5)*: ఉల్లంఘనలు నిర్ధారణ అయితే, నిబంధనల ప్రకారం కాంట్రాక్టు సంస్థపై జరిమానాలు, బిల్లుల నిలిపివేత మరియు బ్లాక్‌లిస్టింగ్ చర్యలు చేపట్టాలి.
*(6)*: అన్ని మున్సిపల్ పని ప్రదేశాల్లో “PPE లేకపోతే పని లేదు” అనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి.

ఔట్‌సోర్సింగ్ విధానం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ లేదా బాధ్యతాయుత అధికారుల చట్టబద్ధమైన పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. కార్మికుల ప్రాణ భద్రత, గౌరవం మరియు సామాజిక భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదు.ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకొని, తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కోరుతున్నాము అని సీతారాం ధూళిపాళ అన్నారు.

No comments:

Post a Comment