*అక్షరానికి అభిమానం..జర్నలిజానికి గౌరవాభిషేకం.*
**మీడియా టుడే 15 వసంతాల వేడుకల్లో జర్నలిస్టుల సంక్షేమం,సామాజిక బాధ్యతకు పెద్దపీట.**
- హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ ప్రత్యేక కవితల ఫ్రేమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
- మీడియా టుడే అధినేత కే.కోటేశ్వరరావు విజన్ కు ప్రశంసలు..
- పాశం యాదగిరి సందేశం..బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కవితా ఫ్రేముల ప్రదర్శన వేడుకలకు హైలైట్.
హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ ,మీడియా టుడే నవంబర్ 16:
పదిహేనేళ్ల అక్షర ప్రస్థానం ఎన్నో సామాజిక పరిణామాలకు వేదిక.ప్రజా సమస్యలపై ప్రశ్నించే కలం.జర్నలిజం విలువలను కాపాడాలనే సంకల్పం.ఇలా మీడియా రంగంలో తనదైన గుర్తింపును సంపాదించుకున్న మీడియా టుడే సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ కోఠి ఐ.యం.ఏ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.జర్నలిస్టుల సంక్షేమం,వృత్తిపరమైన నిజాయితీ,సామాజిక బాధ్యత,ప్రజా సమస్యలపై నిబద్ధత,ఆధునిక డిజిటల్ జర్నలిజం వంటి అంశాలపై ప్రముఖులు దిశానిర్దేశం చేశారు.మీడియా టుడే పత్రికా అధినేత కే.కోటేశ్వరరావు నాయకత్వం,జర్నలిస్టుల పట్ల ఆయన చూపుతున్న ప్రోత్సాహం,సంస్థ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఈ వేడుకల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి.
*జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ భరోసా:*
కార్యక్రమంలో పాల్గొన్న పీఐబీ మీడియా కమ్యూనికేషన్ అధికారి గాయత్రి దేవి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్‌పై అవగాహన కల్పించారు.విధి నిర్వహణలో ప్రమాదాలు,అనారోగ్య సమస్యలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే జర్నలిస్టులకు అందించే ఆర్థిక సహాయం,అర్హతలు,దరఖాస్తు విధానం,అవసరమైన ధ్రువపత్రాల గురించి వివరించారు.అర్హతలు,కేసు తీవ్రత ఆధారంగా గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని తెలిపారు.జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
**నిజాయితీకి *పెద్దపీట..బ్లాక్‌మెయిలింగ్‌కు తావులేదు:*
మీడియా టుడే చైర్మన్ కే.కోటేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ 15 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి జర్నలిస్టు,బ్యూరో ప్రతినిధి,స్టాఫ్ రిపోర్టర్,సబ్ ఎడిటర్ కృషి ఎంతో కీలకమన్నారు. ప్రజా సమస్యలు,సామాజిక పరిణామాలు, రాజకీయ అంశాలపై వాస్తవాలను విశ్లేషణాత్మకంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.వార్తా ప్రచురణలో జర్నలిస్టులకు తగిన స్వేచ్ఛ కల్పించడంతోపాటు విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకు సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వృత్తిలో నిజాయితీ,నిబద్ధతే జర్నలిస్టుకు అసలైన గుర్తింపునిస్తాయని,సంస్థ పేరును వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, బెదిరింపులు,బ్లాక్‌మెయిలింగ్ వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సాహం ఉండదని స్పష్టం చేశారు.సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి కృషిని గుర్తిస్తూ,వారి సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
*పేదల కన్నీళ్లు..ప్రకృతి పరిరక్షణ..జర్నలిస్టుల బాధ్యతపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పిలుపు:*
ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్,ఉద్యమ నేత పాశం యాదగిరి తన ప్రసంగంలో జర్నలిజం హుందాతనం,సామాజిక బాధ్యత, ప్రజా సమస్యల ప్రాధాన్యతపై విలువైన అభిప్రాయాలను వెల్లడించారు.
పత్రికలు గోరంత విషయాన్ని కొండంతగా చూపించడం కంటే, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే అసలైన జర్నలిజమని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలు, పేద కుటుంబాలు, సామాన్య ప్రజల కష్టాలు, రైతుల సమస్యలు, జీవన పోరాటాలు వార్తల్లో తగిన ప్రాధాన్యత పొందాలని సూచించారు.ప్రజల కన్నీళ్లను అక్షరాలుగా మార్చి, పాలకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లే బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.రానున్న కాలంలో ప్రకృతి వైపరీత్యాలు,పర్యావరణ కాలుష్యం,వాతావరణ మార్పులు, ప్రకృతి సమతుల్యతకు ఎదురవుతున్న ముప్పులపై మీడియా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం భవిష్యత్ తరాల మనుగడకు ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించే కథనాలు రావాలని సూచించారు.జర్నలిజం అంటే కేవలం వార్తలను సేకరించి ప్రచురించడం మాత్రమే కాదని,సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు.ప్రతి జర్నలిస్టు తన వృత్తిలో హుందాతనం,నైతిక విలువలు, నిజాయితీని పాటించాలని,వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.డిజిటల్ యుగంలో మారుతున్న మీడియా విధానాలకు అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
*అధినేత కోటేశ్వరరావు దూరదృష్టి..15 ఏళ్ల సంస్థాగత ప్రస్థానానికి పునాది:*
మీడియా టుడే అధినేత కే.కోటేశ్వరరావు గురించి పలువురు అతిథులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక మీడియా సంస్థను పదిహేనేళ్లపాటు కొనసాగించడం వెనుక పట్టుదల,కార్యదక్షత,సంస్థ పట్ల నిబద్ధత ఉన్నాయని కొనియాడారు.సంస్థ అభివృద్ధి అంటే కేవలం పత్రిక విస్తరణ మాత్రమే కాకుండా, అందులో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు గుర్తింపు,ప్రోత్సాహం,వృత్తిపరమైన గౌరవం కల్పించడం కూడా ముఖ్యమనే దృక్పథం మీడియా టుడే ప్రస్థానంలో కనిపిస్తోందని పేర్కొన్నారు.సంస్థలోని ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసినప్పుడే పాఠకులకు నాణ్యమైన వార్తలు అందుతాయని,ఈ దిశగా అధినేత చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
*హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ చొరవ కవితా ఫ్రేముతో వేడుకలకు ప్రత్యేక కళ:*
మీడియా టుడే 15వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం హైదరాబాద్ బ్యూరో చీఫ్ బాపట్ల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో రూపొందించిన వినూత్న కవితా ఫ్రేము ప్రధాన ఆకర్షణ గా నిలిచిందని సీనియర్ పాత్రికేయులు ప్రశంసలతో అభినందించారు.మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో చీఫ్‌గా,జర్నలిస్ట్ ఫైటర్‌గా తాజా కథనాలతో రోజు రోజుకు పరిణతి చెందుతూ,సంస్థ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న బాపట్ల కృష్ణమోహన్,సంస్థ 15 ఏళ్ల ప్రస్థానాన్ని మరింత ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేయాలనే ఆలోచనతో సృజనాత్మక కార్యక్రమానికి కొత్తగా శ్రీకారం చుట్టారు.ఆయన ప్రత్యేక చొరవతో సీనియర్ ఫ్రీలాన్స్ పొయట్ జర్నలిస్ట్,జర్నలిస్ట్ జాతీయ అవార్డు గ్రహీత విజయసంకల్పం ప్రసాద్, ఫ్రీలాన్స్ పొయట్ జర్నలిస్ట్, ఫ్యామిలీ మోటివేటర్, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ వింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాజ్యోతి,ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, సైకాలజిస్ట్, జీవిత సాఫల్య అవార్డు గ్రహీత, సోషల్ వర్కర్ టి. రాధికా రాణి,తిరుపతి సంయుక్త పర్యవేక్షణలో ఈ ప్రత్యేక రూపకల్పనలు సిద్ధమయ్యాయి.
మీడియా టుడే సంస్థ ఆశయాలు,విజయాలు, 15 సంవత్సరాల ప్రయాణం,అధినేత కే.కోటేశ్వరరావు వ్యక్తిత్వం,నాయకత్వ లక్షణాలు, భవిష్యత్ మీడియా దిశగా ఆయనకున్న విజన్‌ను ప్రతిబింబించేలా ప్రత్యేక కవితాత్మక అక్షరాలను ఫ్రేముల రూపంలో రూపొందించారు.అంతేకాకుండా సంస్థ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి జర్నలిస్టు,బ్యూరో చీఫ్,స్టాఫ్ రిపోర్టర్,సబ్ ఎడిటర్,మండల ప్రతినిధి ప్రాముఖ్యతను గుర్తుచేసేలా ఈ ప్రత్యేక రూపకల్పనలను తీర్చిదిద్దడం విశేషం.వార్త వెనుక ఉన్న క్షేత్రస్థాయి కృషి,అక్షరాల వెనుక ఉన్న ఆలోచన,సంస్థ విజయాల వెనుక ఉన్న సమష్టి శ్రమను కవిత్వం ద్వారా హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ సరికొత్తగా అక్షర రూపంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ ప్రత్యేక కవితా ఫ్రేములను వేడుకలకు హాజరైన విశిష్ట అతిథుల చేతుల మీదుగా అందించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
*సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ప్రత్యేక కవితా ఫ్రేముపై హర్షం - ప్రశంసలు:*
బాపట్ల కృష్ణమోహన్ ప్రత్యేక చొరవతో విజయసంకల్పం ప్రసాద్,నీలా జ్యోతి సంయుక్త పర్యవేక్షణలో రూపొందించిన ఈ కవితా ఫ్రేము వార్షికోత్సవ వేడుకలకు సూపర్ హైలైట్‌గా నిలిచాయి.సంస్థ ప్రస్థానాన్ని,అధినేత విశిష్టతను,జర్నలిస్టుల సేవలను కవితాత్మకంగా ఆవిష్కరించిన ఈ ప్రయత్నాన్ని సీనియర్ జర్నలిస్ట్,ఉద్యమ నేత,ముఖ్య అతిథి పాశం యాదగిరి ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.
ఒక సంస్థ వార్షికోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా,దాని ఆశయాలు,విజయాలు,నాయకత్వం,జర్నలిస్టుల సమష్టి కృషిని అక్షర రూపంలో గుర్తుచేసేలా రూపొందించడం అభినందనీయమని ఆయన ప్రశంసించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మీడియా టుడే 15వ వార్షికోత్సవానికి మరింత హుందాతనాన్ని, సృజనాత్మక గుర్తింపును తీసుకొచ్చింది.
*డిజిటల్ జర్నలిజం దిశగా అడుగులు:*
మీడియా టుడే బ్యూరో చీఫ్ ఎ.ఎం. రాజురెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సంస్థ ముందుకు సాగుతోందన్నారు.డిజిటల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జర్నలిస్టు కొత్త సాంకేతికతను నేర్చుకోవాలని సూచించారు.వార్తల సేకరణలో స్వతంత్రత,వాస్తవ నిర్ధారణ,విశ్లేషణాత్మక దృక్పథం అవసరమన్నారు.
*అనం చిన్ని,సోమయ్య,సిపిఐ నారాయణ,రాములు ప్రత్యేక సూచనలు- సలహాలు:*
తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు పరిశోధనాత్మక కథనాల ప్రాధాన్యతను వివరించారు.సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ జర్నలిజంలో ఎదురవుతున్న సవాళ్లు, బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు కృషిని అభినందించారు. మామిడి సోమయ్య జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
*జర్నలిస్టులకు ఘన సన్మానం..ఆత్మీయ సమ్మేళనంగా వేడుకలు:*
కార్యక్రమంలో చైర్మన్ కోటేశ్వరరావు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బ్యూరో ప్రతినిధులు,స్టాఫ్ రిపోర్టర్లు,మండల విలేకరులను పేరుపేరునా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు.సంస్థ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్రను గుర్తుచేస్తూ అభినందించారు.అనంతరం వివిధ జిల్లాల నుంచి హాజరైన పాత్రికేయులకు ప్రత్యేక సన్మానాలు నిర్వహించారు.మీడియా టుడే బ్యూరో చీఫ్ ఎ.ఎం. రాజురెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా,వివిధ జిల్లాల ప్రతినిధులు,బ్యూరో సభ్యులు,స్టాఫ్ రిపోర్టర్లు,పాత్రికేయులు పాల్గొన్నారు.
**పదిహేనేళ్ల ప్రస్థానం ఒక సంస్థ విజయం మాత్రమే కాదు..దాని వెనుక పనిచేసిన ప్రతి కలానికి దక్కిన గౌరవం.**
అధినేత దూరదృష్టి, జర్నలిస్టుల సమష్టి కృషి, ప్రజా సమస్యలపై ప్రశ్నించే నిబద్ధత, సృజనాత్మక ఆలోచనల సమ్మేళనంగా మీడియా టుడే 15వ వార్షికోత్సవం నిలిచింది.ముఖ్యంగా బాపట్ల కృష్ణమోహన్ చొరవతో విజయసంకల్పం ప్రసాద్,ఫ్రీలాన్స్ పొయట్ నీలాజ్యోతి పర్యవేక్షణలో రూపొందిన ప్రత్యేక కవితా ఫ్రేములు ఈ వేడుకలకు మరపురాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అక్షరానికి గౌరవం. జర్నలిస్టుకు గుర్తింపు.సమాజానికి బాధ్యత అనే సందేశంతో మీడియా టుడే మరిన్ని విజయవంతమైన వసంతాల వైపు అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా టుడే మీడియా ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment