Tuesday, November 3, 2026

టామ్కామ్ TOMCOM బాధితులకు న్యాయం జరగాలి - మానవ హక్కుల వేదిక HRF డిమాండ్_

*పత్రికా ప్రకటన*

*టామ్కామ్ TOMCOM బాధితులకు న్యాయం జరగాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 02:

విదేశాలలో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టాల్సిన ప్రభుత్వరంగ సంస్థే అభ్యర్థులను మోసగిస్తున్న వైనంపై 'మానవ హక్కుల వేదిక' HRF ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన TOMCOM,తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా జరుగుతున్న అవకతవకలపై నిజనిర్ధారణ చేపట్టిన వేదిక, అక్టోబర్ 31న బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించింది.మొదట మెకట్రోనిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో జర్మనీలో ఉద్యోగాలు ఉన్నాయని TOMCOM ఒక ఆకర్షణీయమైన కరపత్రాన్ని విడుదల చేసింది. ప్రభుత్వ సంస్థ అనే నమ్మకంతో అభ్యర్థులు సంప్రదించగా, ఉత్తరప్రత్యుర్తరాలన్నీ TOMCOM ద్వారానే జరిగాయి. అంతకుముందు బ్యాచ్ వారు అందరు జర్మనీ లో ఉద్యోగాలు పొందారు అని చెప్పారు . కచ్చితంగా ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకంతో అభ్యర్థులు  జాయిన్ అయ్యారు .  కానీ, తీరా జర్మనీ భాషా కోచింగ్ మొదలయ్యే సమయానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫెయిర్‌స్ట్రీట్ ఇండియా లిమిటెడ్  అనే ప్రైవేట్ సంస్థను రంగంలోకి దించారు. ట్రైనింగ్ మొదలైన రెండు వారాల తర్వాత అభ్యర్థులతో ఫెయిర్‌స్ట్రీట్ అగ్రిమెంట్ ఫారం మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం రూ. 4,10,400 ఫీజును ఫెయిర్‌స్ట్రీట్‌కు ఇవ్వాలని, అడ్మిషన్ లెటర్ కూడా ఆ ప్రైవేట్ సంస్థే జారీ చేసిందని తేలింది.ఇన్ని లక్షలు చెల్లించినా నాణ్యమైన శిక్షణ ఇవ్వకపోవడంతో చాలా మంది విద్యార్థులు పరీక్షలో పాస్ కాలేకపోయారు. ఒకవేళ పాసయిన వారికి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీకి విరుద్ధంగా.. జర్మనీలో చెత్త సేకరణ, జంతు వధశాలల వంటి పనులకు వెళ్లాలని సంస్థ చెప్పడం దారుణం. దీనిపై ప్రశ్నిస్తే TOMCOM నుండి సరైన స్పందన కరువైంది.
ప్రభుత్వ రంగ సంస్థ ఇస్తున్న ప్రకటనలను నమ్మి యువకులు మోసపోతున్నారు. ఒక ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ ఏజెన్సీని భాగస్వామిగా పెట్టుకున్నప్పటికీ, అగ్రిమెంట్లు అన్నీ ప్రభుత్వ సంస్థ TOMCOM పేరు మీదే జరగాలి కానీ, ప్రైవేట్ సంస్థతో కాకూడదు. చైర్మన్‌గా కార్మిక శాఖా మంత్రి ఉన్న ఈ సంస్థపై ప్రజల నమ్మకం వమ్ము కాకూడదు. ఇప్పటికే ఈ మోసం వల్ల కొద్దిమంది యువకులు తమ అమూల్యమైన 2 సంవత్సరాలను కోల్పోయారు.

**మానవ హక్కుల వేదిక డిమాండ్లు:**

*(1)*: TOMCOM బాధితులందరికీ తగిన న్యాయం చేయాలి.

*(2)*: అభ్యర్థులతో చేసుకునే ఒప్పందాలన్నీ నేరుగా TOMCOM పేరు మీదే జరగాలి.

*(3)*: కరపత్రాలలో ప్రకటించిన విధంగానే నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

*(4)*: ఈ మొత్తం వ్యవహారంపై సంస్థ చైర్మన్, కార్మిక శాఖ మంత్రి స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

*(5)*: TOMCOM తన పారదర్శకతను నిరూపించుకుంటూ, ఇతర ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను, అలాగే ఏ బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారు ,  వారిలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అన్న వివరాలు  అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలి.

No comments:

Post a Comment