Friday, November 22, 2024

*_విశాఖ భూముల అసలు కహానీ.!_*

_రూ.300 కోట్లు విలువజేసే భూమి రూ.15 లక్షలకే.._
*_విశాఖ భూముల అసలు కహానీ.!_*
-----
_పీఠం భూ పీకులాట -2_
-----
_# కేటాయింపు తర్వాత అసలు 'స్వామి' రూపం_
_# ఆ లేఖలో అసలు 'మర్మం'_
_# ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 'అయితే ఓకే'_
_# మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉండగా..._
_# కేబినెట్‌పైకి తోసేస్తే పోలా!_
_# నిబంధనలకు ఎలా విరుద్ధమో రెవెన్యూ 'నోట్‌'_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/view/740/22-11-2024*

*_విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్‌ సర్కార్ అప్పనంగా కట్టబెట్టిన రూ.300కోట్ల విలువైన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూకేటాయింపు రద్దు ప్రతిపాదనకు కేబినెట్ సమావేశం ఆమోదముద్ర పడినట్లే .! ఈ భూ కేటాయింపు నాటకీయ ఫక్కీలో జరగ్గా... ఆ తర్వాత వాణిజ్య అవసరాలంటూ.. జీఓలోనే పొరపాటు జరిగిందంటూ కొత్త నాటకానికి ఈ స్వామీజీ తెర లేపాడు. జగన్నాయకుడు 'డూ..డూ బసవన్న'లాగా తలూపాడు. ఇప్పుడు తప్పించుకోవడానికి దారులు వెతుక్కోవడం గమనార్హం._*

*_అసలేం జరిగిందంటే..?:_*
భీమిలిని ఆనుకుని ఉన్న కొండపై 102/2 సర్వే నంబరులో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాల్ని జగన్‌ సర్కార్ స్వరూపానందేంద్రకు కేటాయించింది. రూ.300 కోట్లు విలువ చేసే ఆ భూముల్ని శారదా పీఠానికి ఎకరం రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు కట్టబెడుతూ 2021 నవంబర్​లో జీఓ ఇచ్చేసింది.

*_ఆ తర్వాత అసలు 'స్వామి' రూపం_*
భూ కేటాయింపు అనంతరం స్వామీజీ అసలు స్వరూపం బయటపెట్టారు. పీఠానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఆ భూముల్ని వాడుకోవాలన్నది తమ ఉద్దేశమని, దానికి వీలు కల్పిస్తూ జీఓను సవరించాలని తన వారసుడు, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రతో 2023 నవంబర్ 20న ముఖ్యమంత్రికి లేఖ రాయించారు.

*_ఆ లేఖలోనే అసలు 'మర్మం':_*
‘పీఠం కార్యకలాపాలకు అవసరమైన ఆదాయ సముపార్జన కోసమే విశాఖపట్నంలోని సాగర తీరంలో, అది కూడా వాణిజ్య, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోని భూములు కేటాయించాల్సిందిగా కోరాం. కానీ జీఓలో మాత్రం 'వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు' అని రాశారు. ఆ కార్యకలాపాల్ని పీఠం ఇప్పటికే ఏపీ, తెలంగాణలతో పాటు వారణాసి, రుషికేశ్‌లలోని 60 కేంద్రాల్లో చేస్తోంది. ఆ భూముల్ని జీఓలో ప్రస్తావించిన అవసరాల కోసం వాడుకోవాల్సిన పనిలేదు. వేదపాఠశాల, సంస్కృత విద్య వ్యాప్తికి ఆ స్థలం కోరినట్టు జీఓలో పొరపాటున రాసినట్టున్నారు. జీఓలో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

*_ఎన్నికలకు కొన్ని రోజుల ముందు..:_*
స్వామీజీ కోరిక మేరకు అడ్డగోలుగా అనేక వెసులుబాట్లు కల్పిస్తూ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2024 ఫిబ్రవరిలో జగన్‌ సర్కార్ సవరించిన జీఓ విడుదల చేసింది.

*_మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉండగా...:_*
శారదాపీఠానికి గత ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉండగా పాటించలేదని తెలిపారు. ఎకరా రూ.1.5 కోట్లు విలువ ఉండగా కేవలం రూ.1 లక్షకే శారదా పీఠానికి భూములను కేటాయించింది. భూముల కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం పొందలేదు. ఎన్వోసీ కూడా తీసుకోలేదు. వేద పాఠశాల కోసం భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం అనుమతి కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శారదా పీఠానికి అక్రమంగా ఇచ్చిన భూములు రద్దు చేశారు.

*_కేబినెట్‌పైకి తోసేస్తే పోలా!_*
శారదాపీఠానికి భూకేటాయింపులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, నాటి నాయకులు ఇప్పుడు ఆ వ్యవహారం తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఉద్దేశంతో, మొత్తం నెపాన్ని అప్పటి మంత్రివర్గంపైకి నెట్టేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తమ ప్రమేయమేమీ లేదని, అంతా అప్పటి కేబినెట్‌ నిర్ణయమేనన్నట్టు చెప్పాలని చూస్తున్నట్టు తెలిసింది. శారదాపీఠానికి భూ కేటాయింపులు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధమో వివరిస్తూ రెవెన్యూశాఖ 'నోట్‌' తయారు చేసింది. అప్పట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారుల దృష్టికి ఆ విషయం వెళ్లడంతో ‘అబ్బబ్బే అవన్నీ ఇప్పుడెందుకు? కేటాయింపుల్ని రద్దు చేయాలని సింపుల్‌గా రాస్తే సరిపోతుంది కదా’ అని ఒత్తిడి తెస్తున్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బాక్స్:
__________
రేపు:
_'అబ్బ సొత్తు'లా అప్పనంగా.._
*_తెలంగాణ 'దొర'తనం_*
----------------

No comments:

Post a Comment