Thursday, November 21, 2024

*_'మీడియా టుడే' సంచలన పరిశోధన కథనం_*

*_స్వరూపానందపై విచారణ_*
_______________
*_'పీఠం' భూ పీకులాట-1_*
----------------
*_'మీడియా టుడే' సంచలన పరిశోధన కథనం_*
_# 2007 నుంచే మొదలు_
_# 20వేల చదరపు అడుగుల్లో అక్రమ నిర్మాణాలు_
_# జరిమానాతో ఓ డ్రామా..!_
_# సమగ్ర నివేదికతో బట్టబయలు_
_# కూల్చాలని ఆదేశాలు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/clip/1939*

*_అతనో సర్వసంగ పరిత్యాగిగా చెప్పుకునే స్వామీజీ. ఓ పీఠానికి పీఠాధిపతి. ఆయనకు హఠాత్తుగా ధనం, భూ, స్థిరాస్తులపై ప్రేమ పుట్టుకొచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ సాష్టాంగ నమస్కారాలు చేసిన వారే.! ఇద్దరూ వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నామ మాత్రపు ధరలకే తమ 'అబ్బ సొత్తు'లా ఈ 'స్వామి'కి కేటాయించారు. ఆయన కనుసైగలే 'దేవ ఆజ్ఞ'గా భావించే వారు ఇప్పుడు 'తాజా మాజీలు'గా మారారు. ఆ స్వామీజీ కూడా నాలుక మడత పెట్టబోయారు. కానీ 'వర్కవుట్' కాలేదు. ఆయన అత్యాశతో చేసిన పనికి 'విధి' ఆయనను 'వీధు'ల్లోకి ఈడ్చింది. ఆయన 2007 నుంచి 'ఆక్రమించి' నిర్మించుకున్న అక్రమ కట్టడాలన్నీ ఆయన కళ్ళు ముందే నేల కూలనున్నాయి. ఆయనే శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. తెలుగు రాష్ట్రాల్లో విచారణ ఎదుర్కోబోతున్న తొలి పీఠాధిపతి ఆయనే.! 'మీడియా టుడే' అందిస్తున్న సంచలన పరిశోధన కథనం._*

*_అసలేం జరిగిందంటే..?_*
దేశంలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను నిష్ఠతో పాటించేవి వందలాది పీఠాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పీఠంగా చెడ్డపేరు మూట గట్టుకున్న తొలి పీఠం శారదా పీఠం. ఈ పీఠం ఆక్రమించి, నిర్మించిన భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అక్రమ నిర్మా ణాలు తొలగించాలని శారదా పీఠానికి టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. తదనంతరం అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను టీటీడీ కూల్చివేయనుంది. టీటీడీ భూముల్లో నిబంధనలను అతిక్రమించి శారదాపీఠం పెద్దలు నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ పాలక మండలి సమావేశంలో అక్రమ నిర్మా ణాలను కూల్చివేయాలని నిర్ణయించారు. అదే సమయంలో శారదా పీఠాధిపతి స్వరూపానందపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్థానిక జనసేన నేతలు శారదాపీఠం అక్రమ నిర్మాణాలపై పలుసార్లు టీటీడీకి ఫిర్యాదు చేశారు.

*_2007 నుంచే... 20వేల చదరపు అడుగుల్లో అక్రమ నిర్మాణాలు:_*
గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలను చేపట్టింది. దాదాపు 20వేల చదరపు అడుగుల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. 2007లో మొదటిసారి అక్రమ నిర్మాణాలను శారదాపీఠం చేపట్టింది. తర్వాత 2019 నుంచి కూడా ఆ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉంది. తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. చెరువులను ఆక్రమించేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

*_జరిమానాతో ఓ 'డ్రామా..!'_*
గత ఏడాది డిసెంబర్ లో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న పాలకమండలి ఈ అక్రమ నిర్మాణాలకు జరిమానాను విధిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది.

*_సమగ్ర నివేదికతో బట్టబయలు..:_*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శారదా పీఠం అక్రమ నిర్మాణాలపై ఈవో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గత పాల కమండలి ఇచ్చిన ధృవీకరణను రద్దు చేసింది. 

*_కూల్చాలని ఆదేశాలు:_*
శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని టీటీడీ ఈవోను దేవాదాయ శాఖ ఆదేశించింది. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండగా ఇటీవల కోర్టు కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో భవనాలను కూల్చేందుకేటీటీడీ నిర్ణయించింది.. ఈమేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు పీఠాధిపతి స్వరూపనందపై విచారణ జరపాలని అసెంబ్లీలో పలువురు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బాక్స్ 
__________________
రేపు:
*_విశాఖ భూముల అసలు కహానీ.!_*
-------------------

No comments:

Post a Comment