Friday, May 12, 2023

శ్రీవారి ఆనందనిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్టు

*శ్రీవారి ఆనందనిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్టు*

Courtesy by : అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

*_శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయాన్ని మొబైల్‌ద్వారా వీడియో తీసిన నిందితుడిని అరెస్టు చేశామని తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రెడ్డిని(19)ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏఎస్పీ వెల్లడించారు._*

*_'స్టేటస్' కోసం.._*
నిందితుడు రాహుల్‌రెడ్డి కరీంనగర్‌లో సీఏ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు చెప్పారు. ఇతను ఆలయాలను సందర్శించిన సమయంలో తన సెల్‌ఫోన్‌లో ఆలయాన్ని వీడియోతీసి స్టేటస్‌లో పెట్టుకునేవాడని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీ సాయంత్రం రాహుల్‌రెడ్డి తన సెల్‌ఫోన్‌ తీసుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు ఉద్దేశపూర్వకంగానే సెల్‌ఫోన్‌ను భద్రతా సిబ్బంది తనిఖీలకు దొరక్కుండా దాచుకుని వెళ్లాడు. ఆలయంలోకి వెళ్లిన ఇతను స్వామివారిని మరుసటి రోజు అర్ధరాత్రి 12.15 నుంచి 12.20 గంటల సమయంలో దర్శించుకుని 8వ తేదీన ఆలయం వెలుపలకు వచ్చాడు. అనంతరం ఆలయం వెలుపల బంగారు బావి వద్ద నుంచి వీడియోను చిత్రీకరించినట్లు తెలిపారు.

*_ఇలా బయటకు వచ్చాయి..._*
గర్భాలయంలో చిత్రీకరణ చేయలేదని ఏఎస్పీ వెల్లడించారు. చిత్రీకరించిన వీడియోను తన స్టేటస్‌లో పెట్టుకోవడంతోపాటూ తన చెల్లెలికి పంపాడు. అనంతరం 3 గంటలకు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయానికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలులో స్వస్థలానికి చేరుకున్నాడు. ఇంతలో సదరు వీడియో మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తన సెల్‌ఫోన్‌లోని వీడియోను తొలగించి ఆఫ్‌చేశాడు. కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు రాహుల్‌ చేసిన పని తప్పుగా భావించి వారి ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ఆలయంలో వీడియో చిత్రీకరణపై తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*_వన్‌టౌన్‌ సీఐ ఆధ్వర్యంలో.._*
ఎస్‌ఐలు సాయినాథ్‌ చౌదరి, సుధాకర్‌లతో రెండు ప్రత్యేక బృందాలను, ఒక టెక్నికల్‌ టీమ్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి క్లూస్‌లేని ఈ వీడియో చిత్రీకరణ కేసును సాంకేతికంగా, సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు ఆకతాయితనంతోనే ఈ నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. అతని సెల్‌ఫోన్‌లోని ఇతర ఆలయాలకు సంబంధించి తీసుకున్న వీడియోలను పరిశీలించామని తెలిపారు. చిన్నవయస్సులోనే భక్తిభావం కలిగిన ఇతను అత్యుత్సాహంతో, ఆకతాయిగా చేసిన తప్పునకు చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పారు.

No comments:

Post a Comment