Saturday, May 6, 2023

గోవా టు హైదరాబాద్ డ్రగ్స్

*గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ ను చేదించిన పోలీసులు*

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌కు చెందిన చింతా రాకేష్‌ వృత్తిరీత్యా వ్యాపారి. డ్రైఫ్రూట్స్‌ను విక్రయించేవాడు. ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఒత్తిడికిగురై మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు.గోవా వెళ్లి అక్కడ నైజీరియన్‌ గాబ్రియెల్‌తో పరిచయం పెంచుకున్నాడు. గాబ్రియల్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు చేసి సేవించేవాడు. ఆ తర్వాత చింతా రాకేష్‌ కొకైన్‌ విక్రయించడమే వ్యాపారంగా ఎంచుకున్నాడు. గోవాలో ఒక్కో కొకైన్‌ ప్యాకెట్‌ రూ.7వేలకు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌ తీసుకొచ్చి రూ.18వేల చొప్పున విక్రయించి భారీ లాభాలు చవి చూశాడు.

గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నా పోలీసులకు చిక్కకుండా రాకేష్‌ ఎన్నోజాగ్రత్తలు తీసుకున్నాడు. తనలాగే వ్యాపారంలో నష్టపోయిన బాచుపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మణికొండకు చెందిన సూర్యప్రకాశ్‌లను రాకేష్‌ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఇద్దరినీ గోవా పంపించి గాబ్రియెల్‌ నుంచి కొకైన్‌ తెప్పించాడు. రాకేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌తో పాటు వీళ్లకు కొకైన్‌ విక్రయించిన నైజీరియన్‌ విక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్‌ గాబ్రియెల్‌ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.1.3 కోట్ల విలువ చేసే 303 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

గాబ్రియెల్‌ నెల క్రితం నైజీరియా వెళ్లాడు. తన భార్య గర్భవతి కావడంతో నైజీరియా వెళ్లిన గాబ్రియెల్‌ కొకైన్‌ సరఫరాను విక్టర్‌కు అప్పగించాడు. కొకైన్‌ సరఫరా చేసేందుకు హైదరాబాద్‌ వచ్చిన విక్టర్‌ను ఎస్‌వోటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ బానిసలకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఈ ముఠా.. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి రహస్యంగా కొకైన్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాట్సప్ లో డేటా కనిపించకుండా ఎప్పటికప్పుడు డిలీట్ చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 6 చరవాణిలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. అందులో ఉన్న డేటాను రికవరీ చేసి దర్యాప్తు చేయనున్నట్టు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment