Monday, May 1, 2023

పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.1,000 వేతనం పెంపు

*కార్మికులకు... మే, లు*

*పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.1,000 వేతనం పెంపు*
*త్వరలో ఆర్టీసీ* *జీతాలూ పెంచుతామని వెల్లడి*
హైదరాబాద్‌: కార్మిక దినోత్సవం 'మే డే' కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య /బహుళవిధ (మల్టీపర్పస్‌) కార్మికుల వేతనాలను రూ.1,000 చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌ వర్క్స్‌తోపాటు రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ.. ఇది వర్తిస్తుందని సీఎం తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. మే డే సందర్భంగా కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కష్టించి పనిచేసే ప్రతి ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ''ప్రమాదం కారణంగా కార్మికుల మరణం సంభవిస్తే రూ.6 లక్షలను సంబంధిత కుటుంబానికి చెల్లిస్తున్నాం..2014 నుంచి 2023 వరకూ ఇలా మరణించిన కార్మికులకు సంబంధించిన బాధిత కుటుంబాలకు రూ.223 కోట్లు అందజేశాం. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైతే రూ.5 లక్షల చొప్పున.. రూ.8.9 కోట్లను చెల్లించాం. కార్మిక కుటుంబాలకు 2014 నుంచి 2023 వరకూ 'వివాహ బహుమతి'గా రూ.130 కోట్లు చెల్లించాం. ప్రసూతి ప్రయోజనాల కింద రూ.280 కోట్లు అందజేశాం. సహజ మరణానికి రూ.లక్ష మొత్తాన్ని కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్నాం. ఇలా 2014 నుంచి ఇప్పటి వరకు రూ.288 కోట్లను అందజేశాం. మరణానంతరం నిర్వహించే అంతిమయాత్ర కార్యక్రమాల కోసం 39,797 మందికి రూ.98 కోట్లను చెల్లించాం'' అని సీఎం తెలిపారు. వేతన పెంపుపై సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు(జీవో నం. 39, 40)లను జారీ చేసింది. పెరిగిన వేతనాల కోసం అయ్యే అదనపు వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర నగర,పురపాలికలు, గ్రామ పంచాయతీలు తమ బడ్జెట్‌ల నుంచి భరించాలని ఆదేశించింది. పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపుపై ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment