*15 మందిని పోటీకి దించినా.. తానొక్కరే గెలిచిన గాలి జనార్దన్ రెడ్డి*
మైనింగ్ కింగ్ గాలి జనర్దన్ రెడ్డి.. కల్యాణ రాజ్య సమితి పక్ష పేరుతో పార్టీ పెట్టి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు ఆయనకు ఏ మాత్రం అనుకూలంగా రాలేదు. మొత్తం 15 మంది అభ్యర్థులను బరిలో నిలిపితే.. ఆయన మాత్రమే గెలిచారు.
గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి.. కేవలం 2,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు 46,031 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీకి 43,315 ఓట్లు పడ్డాయి.
బళ్లారి సిటీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ బరిలో నిలిచారు. ఇక్కడ జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయడం గమనార్హం. వీరిద్దరి నడుమ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి లబ్ధి పొందారు. అరుణకు 27,348 ఓట్లు, సోమశేఖర రెడ్డికి 23,335 ఓట్లు రాగా, భరత్ రెడ్డికి 37,578 ఓట్లు పడ్డాయి.
గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ కు భారీగా ఓట్లు పడటం గమనార్హం. జనార్దన్ రెడ్డి బొటాబొటి మెజారిటీతో గెలవగా.. బళ్లారిలో ఆయన భార్య గట్టి పోటీ ఇచ్చారు. జనార్దన్ రెడ్డి పోటీ వల్ల అధికార బీజేపీకి దెబ్బపడగా.. ఓట్ల చీలికతో కాంగ్రెస్ లబ్ధిపొందింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment