*త్వరలో ఆర్ఆర్ఆర్ రెండో భాగానికి జాతీయ హోదా...!*
హైదరాబాద్: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్.ఆర్.ఆర్) వ్యవహారంలో మరో కదలిక వచ్చింది. దక్షిణ భాగం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.ఉత్తర భాగం భూ సేకరణ వ్యయాన్ని దశల వారీగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సుమారు రూ.1,200 కోట్లకుగాను తొలివిడతగా రూ.100 కోట్లు డిపాజిట్ చేయటంతో ఒకటొకటిగా అడుగులు పడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని *చౌటుప్పల్*, *ఇబ్రహీంపట్నం*,*ఆమనగల్*, *షాద్‌నగర్* *చేవెళ్ల*, *శంకరపల్లి*, *కంది* మీదుగా 189 కిలోమీటర్ల దూరం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. మార్గానికి సంబంధించిన సవివర నివేదికను రూపొందించి గడిచిన ఏడాదిలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కన్సల్టెంట్ సంస్థ పంపింది.జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం కూడా తెలిపింది. ఉత్తర భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో దక్షిణ భాగానికి జాతీయ రహదారి సంఖ్యను కేటాయించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు జమచేయడంతో దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించి సంఖ్యను కేటాయించే అవకాశాలున్నాయని ఉన్నతాధికారి ఒకరు 'ఈనాడు'తో చెప్పారు. ఆ తరవాత సమగ్ర సర్వే నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ఉత్తర భాగం రహదారి నిర్మాణ ప్రక్రియ మొదలయ్యాకే సర్వే వ్యవహారాలు ప్రారంభమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఉత్తర భాగంలో 60 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మే మొదటి వారంలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల సంస్థ మధ్య త్రిపక్ష ఒప్పందం జరగనుంది. జూన్ నెలాఖరులోగా శంకుస్థాపనకు అవకాశాలున్నాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment