Tuesday, May 30, 2023

జిల్లాల పర్యటనకు సిద్దమైన.... సీయం కేసీఆర్....!

*జిల్లాల పర్యటనకు సిద్దమైన.... సీయం కేసీఆర్....!*

ఓ వైపు తెలంగాణ దశాబ్ది వేడుకలు... మరోవైపు సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలతో బీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి పదును పెట్టింది.ఇప్పటికే ఆత్మీయసమ్మేళనలతో ప్రజల మధ్యలో ఉన్నా గులాబీ లీడర్లకు ఇప్పుడు కేసీఆర్ జిల్లా పర్యటనలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పదేళ్ల పండుగ మరింత కళకళ లాడనుంది.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, విపక్షాలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే... హ్యాట్రిక్ కోసం సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.ఇప్పటికే నియోజవకర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ యాక్టివ్ చేశారు. మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల మధ్య ఉన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కేసీఆర్ కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు. అందుకు అనుగుణంగా 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను డిజైన్ చేశారు.

తొలిరోజు అమర వీరులకు నివాళులర్పించి పదేళ్ళ పండుగను మొదలు పెట్టి...జూన్ 22న ప్రతిష్టాత్మంగా నిర్మించిన అమరవీరుల స్మారకస్థూపం ప్రారంభోత్స వేడుకలతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే పదేళ్ల పండుగలోనే సీఎంకేసీఆర్ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్ది వేడుకలు ముగిసిన తర్వాత జిల్లా పర్యటనలను మొదలుపెట్టాలని భావించిన సీఎం కేసీఆర్ దాని కంటే ముందే జిల్లా టూర్స్‌కు సిద్దం అయ్యారు.

ఇందులో భాగంగా జూన్ 4న నిర్మల్ జిల్లా, 6న నాగర్‌కర్నూల్, 9న మంచిర్యాల, 12న గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌లను , ఎస్పీ కార్యాలయాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను చేయనున్నారు. ప్రతీ చోట బహిరంగ సభలు ఏర్పాటు చేసి... తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించనున్నారు.

తెలంగాణలో షెడ్యూల్ పరంగా డిసెంబర్‌లోపు అసెంబ్లీఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నాయి. దీంతో 45 రోజుల ముందే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు పదేళ్ళ పండుగలో ప్రతి రోజు సంబురాలు జరుపుకుంటూనే ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సీఎం జిల్లాల పర్యటన సాగనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment