Wednesday, May 10, 2023

స్కామ్ ల కోసమే సోమేశ్ కుమార్

*స్కామ్ ల కోసమే సోమేశ్ కుమార్ ను మళ్ళీ తీసుకొచ్చారు.... భట్టి*

మామిడిపల్లి: రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇంకా పదవుల కోసం పాకులాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. రిటైర్‌ అయ్యాక కూడా పదవులు పట్టుకు వేలాడటం సరికాదని ఆయన హితవు పలికారు.రిటైర్డ్‌ అధికారులు వైదొలగి యువతకు అవకాశాలు ఇవ్వాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్‌రోడ్‌లో భట్టి మీడియాతో మాట్లాడారు. 30ఏళ్ల కోసం టోల్‌ వసూలు చేసే అధికారం ఎవరైనా ఇస్తారా? వచ్చే 30 సంవత్సరాల ఆదాయం ఇప్పుడు తీసుకుంటే.. రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. స్కామ్‌ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను మళ్లీ తీసుకొచ్చారని ఆరోపించారు. సోమేశ్‌ తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని భట్టి డిమాండ్‌ చేశారు.

''సోమేశ్‌ కనుసన్నల్లోనే హైదరాబాద్‌ చుట్టూ ₹లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు ఎందుకు? గజ్వేల్‌, సిరిసిల్లలో ప్రభుత్వ భూములు లేవా? కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌ గుంజుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తాం. కాంగ్రెస్‌ సంక్షేమంలో కోత పెట్టడం తప్ప భారాస చేసిందేమీ లేదు. అసైన్డ్‌దారులూ.. మీ భూములు మీరు కాపాడుకోండి. కేసీఆర్‌ ప్రభుత్వం అసైన్డ్‌ భూములు కూడా లాగేసుకుంటోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసైన్డ్‌దారులకు అండగా నిలిచి భూములను హక్కుదారులకే ఇస్తాం. ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి లేదు. కేటీఆర్‌.. ప్రజల కోసం పనిచేస్తారా? కంపెనీల కోసం చేస్తారా? ఇబ్రహీంపట్నంలోని పేదల వద్దకు, ఉస్మానియా వర్సిటీకి కేటీఆర్‌, తలసాని సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లగలరా? ఆ దమ్ము ఉందా?'' అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment