Sunday, May 7, 2023

ఓకే ఇంట్లో.... 146ఓట్లు

*ఓకే ఇంట్లో.... 146ఓట్లు*

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో ఇంటినెంబరు 10-4-55/బి చిరునామాలో ఐదు కాదు..పది కాదు ఏకంగా వంద ఓట్లున్నాయి. మీ దగ్గర వందేనా మేమింకా ఎక్కువే అన్నట్లు అదే నియోజకవర్గం మైలార్‌గడ్డలో 11-1-748గా ఉన్న ఇంటి నెంబరుతో 146 ఓట్లున్నాయి.ఓటరు జాబితాలో ఒకే ఇంట్లో ఉన్న ఈ ఓటర్ల సంఖ్యను చూసి హతాశులైన అధికారులు నిజానిజాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

● ఇలా ఒకే చిరునామాలో 50 నుంచి 100, అంతకంటే ఎక్కువే ఓటర్లున్న ప్రాంతాలు ఒక్క సికింద్రాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. హైదరాబాద్‌ జిల్లాలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లోనూ ఇలా ఒకే ఇంటి చిరునామాలో భారీసంఖ్యలో ఓటర్లున్నట్లు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు వాటి పరిశీలనను చేపడుతున్నారు. బోగస్‌లుంటే సరిదిద్దే చర్యలు చేపట్టనున్నారు.

*మొదలైన ఎన్నికల కసరత్తు...*
రాష్ట్రంలో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. జిల్లా, అసెంబ్లీ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు, తదితరమైన వాటితో చేపట్టాల్సిన చర్యలపై అప్రమత్తం చేస్తోంది. జాబితా నుంచి ఓటర్లను తొలగించే పక్షంలో ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు నిబంధనల కనుగుణంగా తొలగించాలని సూచించింది. అంతేకాదు..ఇప్పటికే తొలగించిన ఓటర్లను మరోమారు పునఃపరిశీలించాలని కూడా ఆదేశించడంతో అందుకనుగుణంగా సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలగించిన ఓటర్లతోపాటు ఒకే ఇంట్లో ఎక్కువ ఓటర్లున్న వారివిసైతం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడమే కాకుండా అలాంటి ఇళ్లకు ఫిజికల్‌ ఫైళ్లను కూడా నిర్వహించాలని సూచించడంతో ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

*ఒకే ఇంట్లో ఆరుగురికి మించితే..*
ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఒకే ఇంట్లో ఆరు కంటే ఎక్కువ ఓట్లున్నా కూడా పరిశీలిస్తూ ఫిజికల్‌ ఫైళ్లను నిర్వహించే చర్యలు చేపట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment