Friday, May 12, 2023

ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో?

*ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో?* 
_◆ ఇంతకీ ఎవరీమె?_
_◆ మరో ఆరు వారాల్లో అదే నిజం.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కొత్త సీఈఓ రావడం ఖాయమైంది. ఈ బాధ్యతల్ని ఓ మహిళ తీసుకోనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. అయితే, ఆమె ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు తీసుకోవటం ఖాయం. అయితే, అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు సుపరిచితమైన 'లిండా యాకరినో  కొత్త సీఈఓ' అని ఈ రచయిత తన అనుభవపూర్వకంగా చెపుతున్నారు. 

*_ఎవరీ లిండా?_*
లిండా ప్రస్తుతం ఎన్‌బీసీయూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ట్విటర్‌ను ముందుకు నడిపే బాధ్యతలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆమెతో మస్క్‌ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దాదాపు ఆమె పేరే సీఈఓగా ఖరారు కావొచ్చని ట్విటర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

*_ఇంటర్వ్యూ కూడా.._*
యాకరినో గత నెల ఓ కార్యక్రమంలో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరివురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది.

*_ఇదీ జీవితం.._*
ఎన్‌బీసీయూనివర్సల్‌లో లిండా  దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఆమె పనిచేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో ఆమెది కీలక పాత్ర. 
    అంతకు ముందు టర్నర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో కీలకంగా వ్యవహరించారు.
    పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో లిండా లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివారు. ట్విటర్‌లో మస్క్‌ చేస్తున్న మార్పులకు ఆమె ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ట్విటర్‌ మస్క్‌ చేతికి వచ్చినప్పటి నుంచే ఆమె సీఈఓగా ఉండడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. అయితే, కంపెనీలో కీలక మార్పులు పూర్తయ్యే వరకు ఎలాన్‌ మస్క్‌కు సమయం ఇవ్వాలని ఆమె భావించారట!

☛ మరోవైపు యాకరినోతో పాటు ట్విటర్‌లో ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగానికి ఇంఛార్జిగా ఉన్న ఎల్లా ఇర్విన్‌ కూడా సీఈఓ రేసులో ఉన్నట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పేర్కొంది. ఇటీవల పదోన్నతి పొందిన ఆమె ఎలాన్‌ మస్క్‌తో కలిసి చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్విటర్‌కు కొత్త సీఈఓను నియమిస్తామనని ఎలాన్‌ మస్క్‌ గతంలోనే సంకేతాలిచ్చారు. ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌, టెస్లా సహా మరికొన్ని కంపెనీలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. విశ్రాంతి లేకుండా పని ఉంటోందని గతంలో ఓసారి ఆయనే స్వయంగా చెప్పారు. మరోవైపు ట్విటర్‌ సీఈఓగా తాను వైదొలగాలా అని గత డిసెంబర్‌లో పోల్‌ నిర్వహించారు. 57.5 శాతం మంది ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మరోవైపు ట్విటర్‌ సీఈఓ పదవిపై మస్క్‌ గతంలో కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. సీఈఓ కుర్చీలో శునకాన్ని కూర్చోబెట్టిన ఫొటో ట్వీట్‌ చేశారు. మరోవైపు ట్విటర్‌ను ముందుకు నడిపించే ‘‘తెలివి తక్కువ’’ వ్యక్తి దొరికే వరకు తానే సీఈఓగా కొనసాగుతానని కూడా వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment