Saturday, August 22, 2026

సాంకేతి విద్యను పరిరక్షణన చేసేందుకు ABVP ఆధ్వర్యంలో రామంతపూర్ లో నాలుగవ రోజు ఉద్యమం ఉదృతం , రాష్ట్ర ముఖ్య మంత్రి దిష్టి బొమ్మ దహనం_

*సాంకేతి విద్యను పరిరక్షణన చేసేందుకు ABVP ఆధ్వర్యంలో రామంతపూర్ లో నాలుగవ రోజు ఉద్యమం ఉదృతం , రాష్ట్ర ముఖ్య మంత్రి దిష్టి బొమ్మ దహనం* 
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఆధ్వర్యంలో సాంకేతిక విద్యను పరిరక్షణ చేపట్టాలని ,అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన G.O NO.97 లో అనేక విషయాలలో ప్రభుత్వం EECET ద్వారా లాటరల్ ఎంట్రీ పై పూర్తిగా స్పష్టతను ఇవ్వాలని ,అదేవిధంగా పాలిటెక్నిక్ మరియు ITI విద్యలను కేవలం ఒక సర్టిఫికెట్ కోర్సులుగా మార్చే కుట్రను ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేస్తూ నిరసన తెలపడం జరిగింది. తెలంగాణలో అనేక మారుమూల ప్రాంతాలనుండి పేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను అభ్యసించడానికి పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి తొందరగా తమ తల్లితండ్రులకు ఆసరాగా నిలవాలని కోరుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎందరో పేద విద్యార్థులు తొందరగా ఉపాధి పొందే ఈ పాలిటెక్నిక్ విద్యను ఈరోజు ప్రభుత్వం కేవలం ఒక సర్టిఫికెట్ కోర్సుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గాఢ నిద్రలో నుండి మేల్కొని ఈ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించి పేద మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఎబివిపి డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎబివిపి తెలంగాణ రాష్ట సంయుక్త కార్యదర్శి శ్యామ్ కిరణ్, ఎబివిపి ఉప్పల్ జిల్లా కన్వీనర్ బుర్ర అఖిల్,గ్రేటర్ హైదరాబాద్ సిటీ కిరణ్, సంజయ్,భాను, భవిత్,రోషన్,రవి తేజ మరియు నగర కార్యకర్తలు పాల్గొన్నారు...

మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి_

*ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు కఠినం - కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై ఉక్కుపాదం*

*మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి*

*వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి - పోలీస్ కమిషనర్ బి. సుమతి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు పాల్పడే వారిపై చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు. ఆహారం మనిషి జీవనాధారమని, అలాంటి ఆహారంలోనే కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమంగా సంపాదించాలనుకునే వారిపై చట్టం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు.పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై మెరుపుదాడి నిర్వహించాయి.విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలాలను నిర్ణీత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.వంటింట్లో రుచికి, ఆరోగ్యానికి ఆధారంగా ఉపయోగించే మసాలా దినుసులనే కల్తీ వ్యాపారానికి సాధనంగా మార్చిన తీరు తనిఖీల్లో వెలుగుచూసింది. ముఖ్యంగా కారం పొడిలో 30 శాతం రంపపు పొడి (సా డస్ట్) కలిపినట్లు గుర్తించడంతో అధికారులు విస్తుపోయారు.
అంతేకాకుండా అసలు బ్రాండ్‌ను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి వినియోగదారులకు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా నమ్మించే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు.నాసిరకం ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ముసుగు తొడిగి మార్కెట్‌లోకి పంపుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ, వినియోగదారుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలను మార్కెట్‌లోకి పంపడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
ప్యాకెట్ అందంగా ఉందనో, దానిపై ప్రముఖ బ్రాండ్‌ను పోలిన పేరు ఉందనో ప్రజలు సహజంగా నమ్ముతారని, ఆ నమ్మకాన్నే అక్రమార్కులు తమ లాభాల కోసం వాడుకోవడం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలపై సమాచారం సేకరించి, వాటి మూలాలను గుర్తించి, బాధ్యులపై వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దాడిలో భారీ మొత్తంలో మసాలా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలాను సీజ్ చేశారు. మొత్తంగా 10,890 కిలోలు, అంటే 10.89 టన్నుల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకోగా, వాటి అంచనా విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీ, ప్యాకింగ్‌కు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, ప్రాసెస్ చేసిన పొడులు, ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలను కూడా బృందాలు పరిశీలించాయి.ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును మెడిపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఆహార భద్రత, కల్తీ, మిస్‌బ్రాండింగ్‌తో పాటు ఆహార పదార్థాల అక్రమ తయారీ, విక్రయాలకు సంబంధించి వర్తించే చట్ట నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.కల్తీ ఆహారం కంటికి కనిపించని ప్రమాదమని, అందువల్ల వినియోగదారుల అప్రమత్తత కూడా అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ బి. సుమతి పేర్కొన్నారు. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తదితర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ప్యాకెట్ రూపాన్ని లేదా బ్రాండ్ పేరును మాత్రమే చూసి కొనుగోలు చేయవద్దని సూచించారు.
బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు లేదా బెస్ట్ బిఫోర్ తేదీ, బ్యాచ్ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు తదితర తప్పనిసరి సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని కోరారు. ప్యాకింగ్ సరిగా లేకపోయినా, లేబులింగ్‌పై అనుమానం వచ్చినా, నాణ్యత విషయంలో సందేహం కలిగినా అలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, ప్యాకింగ్ లేదా అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని బి. సుమతి కోరారు.ఒక వినియోగదారుడి అప్రమత్తత అనేక కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడగలదని పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై 8712662111 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్, మెడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్, ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ప్రజలకు చేరే ఆహారం స్వచ్ఛంగా, సురక్షితంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ అక్రమ వ్యాపారాన్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని పోలీస్ కమిషనర్ బి. సుమతి మరోసారి హెచ్చరించారు.

సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్_

*సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ ట్రాఫిక్ ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. అగ్రసేన్‌ చౌరస్తా, ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అన్నారు. బుధవారం నుంచి వన్‌వే విధానాన్ని అమలులోకి తెచ్చామని, మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు.
జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Thursday, August 20, 2026

అధికారులు మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?_

అనుమతులు లేకుండా విద్యారణ్య స్కూల్ నిర్వహణపై ఆరోపణలు

మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?

అనుమతులు ఎక్కడ? అధికారుల చర్యలు ఏమిటి?

హైదరాబాద్(ప్రశ్న న్యూస్): 

అంబర్ పేట డివిజన్ పటేల్‌నగర్‌లోని విద్యారణ్య స్కూల్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో జూలై 6న పాఠశాలను మూసివేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.

అయితే రెండు రోజులు మూసివేసి.. మళ్లీ యథావిధిగా తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం పాఠశాలకు ఏ తరగతుల వరకు అనుమతులు ఉన్నాయి? అనుమతులు లేకపోతే తిరిగి పాఠశాల నిర్వహణకు ఎవరు అనుమతించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదే పేరుతో వివేక్‌నగర్–రామంతపూర్‌లో మరో పాఠశాల కొనసాగుతుండటం, పటేల్‌నగర్ పాఠశాల విద్యార్థులను అక్కడి నుంచి 10వ తరగతి పరీక్షలకు పంపుతున్నారనే ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని అనుమతి లేని పాఠశాల విద్యార్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నారు? అనే అంశంపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై హిమాయత్‌నగర్ డిప్యూటీ ఎంఈఓ శ్యామల్ రాజుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీంతో 13-08-2026న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పాఠశాలకు ఉన్న అనుమతులు, ప్రస్తుతం నిర్వహిస్తున్న తరగతులకు ఉన్న గుర్తింపులు, విద్యార్థుల పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనుమతులు అన్నింటినీ విద్యాశాఖ తక్షణమే బహిర్గతం చేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో పాఠశాలను మూసివేసిన తర్వాత తిరిగి నిర్వహణకు దారితీసిన పరిస్థితులపైనా సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

ఇది కేవలం ఒక పాఠశాల వ్యవహారం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులు, భద్రతకు సంబంధించిన ప్రశ్న. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. తప్పైతే వాస్తవాలను విద్యాశాఖ స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి.

Wednesday, August 19, 2026

గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ్గురు MDMA విక్రేతలను (peddlers)అరెస్ట్ చేశారు_

*భారీ మొత్తంలో ఎండీఎంఏ (MDMA) మత్తుమందు పలువురు పెడ్లర్లను అరెస్ట్*

*గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ్గురు MDMA విక్రేతలను (peddlers)అరెస్ట్ చేశారు*

*అదుపులోకి తీసుకుని, రూ. 16.4 లక్షల విలువైన 95.41 గ్రాముల MDMA డ్రగ్ మరియు 50 గ్రాముల OG కుష్ (OG Kush) ను స్వాధీనం చేసుకున్నారు.*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 19:

ఖచ్చితమైన సమాచారం మేరకు, గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి, ముగ్గురు డ్రగ్ విక్రేతలు మరియు 16 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నాయి. వీరి వద్ద నుండి రూ. 16.49 లక్షల విలువైన 95.41 గ్రాముల MDMA డ్రగ్ మరియు 50 గ్రాముల OG కుష్‌ను స్వాధీనం చేసుకున్నాయి.*కేసు వివరాలు:* గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS చట్టంలోని సెక్షన్లు 27(B), 8C, 22(C) కింద కేసు (నం. 1431/2026) నమోదు చేయబడింది.
**స్వాధీనం చేసుకున్న వస్తువులు:**
*(1)*: MDMA – 95.41 గ్రాములు (విలువ రూ. 11,40,920/-)
*(2)*: OG కుష్ – 50 గ్రాములు (విలువ రూ. 5,00,000/-)
స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ: రూ. 16,40,920/-
*(3)*: రెండు సెల్ ఫోన్లు
**నిందితుల వివరాలు:**

*(1)*: Md రజల్ అబ్దుల్ గఫూర్, వయసు 26 ఏళ్లు, వృత్తి: వ్యాపారం, నివాసం: బెగూర్, బెంగళూరు (కర్ణాటక), స్వస్థలం: త్రిసూర్ (కేరళ).
*(2)*: నవీన KD, వయసు 22 ఏళ్లు, వృత్తి: వ్యాపారం, నివాసం: బెగూర్, బెంగళూరు (కర్ణాటక), స్వస్థలం: త్రిసూర్ (కేరళ). 3)కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్, వయస్సు: 26 సంవత్సరాలు, Occ: నిరుద్యోగ R/o మూసాపేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్. N/o తూర్పు గోదావరి, A.P రాష్ట్రం.
**కేసు వాస్తవాలు:** 
11.08.2026న, వట్టినాగులపల్లిలోని కిండోమ్ పబ్ రోడ్డు సమీపంలో MDMA పెడ్లర్ కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్‌తో పాటు 16 మంది వినియోగదారులను అరెస్టు చేశారు, విచారణలో యశ్వంత్ ఎండీ రజల్ అబ్దుల్ గఫూర్ R/o కేరళ మరియు నవీన KD R/o బెంగుళూరుకు చెందిన నిందితుల వ్యక్తి నుండి MDMA కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.18.08.2026న, కేరళలోని త్రిసూర్‌లో Md Razal Abdul Gafoorను అరెస్టు చేశారు. విచారణలో, తాను Sam (నైజీరియన్) నుండి సేకరించిన 44.41 గ్రాముల MDMAని Koripella Yashwanth Sai Shanmukhకు ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. అదే రోజున కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, బేగూర్ వద్ద Navina KDని అరెస్టు చేశారు; బేగూర్‌లోని ఆమె నివాసంలో జరిపిన సోదాలో 51 గ్రాముల MDMA మరియు 50 గ్రాముల OG Kush లభించాయి. విచారణలో, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను కేరళకు చెందిన తన స్నేహితుడు Aneshwar నుండి సేకరించినట్లు Navina KD తెలిపింది.ఈ అరెస్టులు CH. శ్రీనివాస్ (DCP, శేరిలింగంపల్లి జోన్), శోభన్ కుమార్ (DCP, SOT సైబరాబాద్), T. గోవర్ధన్ (Addl. DCP-I, SOT సైబరాబాద్), ఉదయ్ రెడ్డి (Addl. Dy. Commissioner of Police, శేరిలింగంపల్లి జోన్),  G. వెంకట రమణ గౌడ్ (ACP, నార్సింగి డివిజన్), SOT సైబరాబాద్ బృందాలు, అలాగే గచ్చిబౌలి PS SHO, DI మరియు గచ్చిబౌలి పోలీస్ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి.
**సూచన**
డ్రగ్స్ లేదా గంజాయి సరఫరాదారులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే, 'Dial 100' ద్వారా లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 8712663061 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పౌరులను కోరుతున్నాము. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, డ్రగ్స్ లేదా గంజాయికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాము. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు_

*22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం*

*ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి*

*ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి*

*అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం*

*మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

 22/ఎ  నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి 22/ఎ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్‌ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు.అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాల‌ని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
*“నా భూమి నాకు దక్కింది.. -ప్రభుత్వానికి కృతజ్ఞతలు”*
 22/ఎ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్న ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్షంగా లబ్ధి పొందిన పోచారం గ్రామానికి చెందిన రాకేష్ తన అనుభవాన్ని వెల్లడించారు.“నేను 2022లో పోచారం గ్రామంలో వంద గజాల స్థలం కొనుగోలు చేశాను. ఇటీవల ఆ స్థలాన్ని విక్రయించేందుకు నార్లపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. మొదట డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించగా, మీ భూమి22/ఎ లో ఉందని చెప్పారు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యాను. అయితే మూడు, నాలుగు రోజుల క్రితం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ భూమికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఈ రోజు నేను ఆ స్థలాన్ని కొనుగోలుదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేశాను. నా భూమి నాకు దక్కేలా సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.“ క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం”.నార‌ప‌ల్లి సబ్‌ రిజిస్ట్రార్ సునీల్ మాట్లాడుతూ.. పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 50ను ఏపీ హౌసింగ్ బోర్డు భూమిగా పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌లో22/ఎ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం” అని సబ్‌ రిజిస్ట్రార్ సునీల్ తెలిపారు.మా సొసైటీలోని 300 ప్లాట్ల‌కు పూర్తి విముక్తి క‌లిగింది- చ‌క్ర‌పాణి (కొనుగోలుదారు).కూక‌ట్‌పల్లి అడ్డ‌గుట్ట సొసైటీలోని నెంబ‌ర్ 80సిలోగ‌ల 250 గ‌జాల స్ద‌లాన్ని నెల‌రోజుల క్రితం కొనుగోలు చేశాను. అయితే రిజిస్ట్రేషన్ కోసం కూక‌ట్‌ప‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆభూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంద‌ని రిజిస్ట్రేష‌న్ చేయ‌లేదు. తాజాగా ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా నిన్న‌నే నాకు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నుంచి ఫోన్ వ‌చ్చింది. ఈ రోజు వెళ్ల‌గా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్ల‌ను నిషేధిత జాబితా నుంచి తొల‌గించిన‌ట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు- అని చ‌క్ర‌పాణి అనే కొనుగోలుదారు తెలిపారు. ప్ర‌భుత్వ స‌కాల చ‌ర్య‌ల వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింది- రాజేంద్ర‌ప్ర‌సాద్‌.బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలోని మూసాపేట్‌లో గ‌ల రెయిన్‌బో విస్టాలో ఉన్న‌ప్లాట్ నెంబ‌ర్ 804 ను విక్ర‌యించేందుకు కొద్దికాలం క్రితం య‌జ‌మాని వెంక‌ట విజ‌య్‌కుమార్ ప్ర‌య‌త్నించారు. అయితే 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌లేదు. వెంక‌ట విజ‌య్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ త‌న మామ రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈనెల 12న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నుంచి స‌మాచారం రావ‌డంతో ఈరోజు రాజేంద్ర‌ప్ర‌సాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజేంద్ర ప్ర‌సాద్ ఏమ‌న్నారంటే...
మా అల్లుడు సేల్ చేద్దామనుకున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే... 22ఎ కింద గవర్నమెంట్ నిషేధం విధించింద‌ని  చెప్పినందున  ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ త‌ర్వాత నా అల్లుడు నా పేరు మీద స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అది ఇంకా చాలా కాలమే పడుతుందేమో అనుకున్నాం గానీ... అదృష్టవశాత్తూ ప్ర‌భుత్వం స‌కాలంలో చ‌ర్య‌లు తీసుకున్నందున  వెంట‌నే  ఒక  వారం రోజుల్లోనే ఇది క్లియర్ అయ్యి... అనుకూలంగా తేలింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా మాకు సంతృప్తి కరంగా పూర్తిగా  అవుతుంది. ప్ర‌భుత్వానికి చాలా కృతజ్ఞతలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేష‌న్ పూర్తి - శ్రీ‌నివాస్.బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలోని మూసాపేట్‌లో గ‌ల వైష్ణ‌వి ఎస్టేట్ ప్ర‌తినిధి శ్రీ‌నివాస్ మూసాపేట స‌ర్వే నెంబ‌ర్ 108లోగ‌ల భూమిని విక్రయించేందుకు రాగా 22ఎ నిషేధిత జాబితాలో ఉంద‌ని రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారులు తిర‌స్క‌రించారు. తాజాగా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు కార‌ణంగా ఈరోజు శ్రీ‌నివాస్ త‌న భూమికి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ మాట్లాడుతూ..
మాకు 2005 లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. మేము రిజిస్ట్రేషన్ కి అప్పటినుంచి  ప్ర‌య‌త్నం  చేస్తున్నాము. . తాజాగా రెండు వారాల క్రితం   మూసాపేట్ బాలానగర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కి వెళ్తే 22ఎ లో పెట్టామని చెప్పారు. మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. దాంతో ఈ రోజు  ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము. ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. థాంక్యూ వెరీ మచ్.ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో నిషేధం తొల‌గింపు - ఎస్‌.ఆర్‌.వో
బాలాన‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలో గ‌ల స‌ర్వే నెంబ‌ర్లు 101/1, 101/2, 102, 108, 109, 112, 81 లో ఉన్న సుమారు 3000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల  స్ద‌లంపై ఉన్న 22ఎ నిషేధం తొలగిపోయింది. ఈ స‌ర్వే నెంబ‌ర్ల‌లో ఉన్న భూమికి సంబంధించి రిజిస్ట్రేష‌న్లు జ‌రుపుకోవ‌చ్చున‌ని బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ స్ప‌ష్టం చేశారు. 
అధికారుల ఆదేశాల‌తో వెంట‌నే రిజిస్ట్రేష‌న్.మేము ఏజీ కాలనీ, గుండ్ల పొచంప‌ల్లిలోని .గౌరీశంకర్ వద్ద మేము ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది.మేము జూలై ఆరు నాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కి రాగా 22ఎ నిషేధిత జాబితా పేరిట‌ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
అప్పటినుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కి, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే... ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి, క్లియర్ చేయమని సబ్-రిజిస్ట్రార్ గారికి చెప్పారు. ఆ వెంట‌నే స‌బ్ రిజిస్ట్రార్ మేడమ్ గారు మాకు ఫోన్ చేసి, రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసి  మాకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది అని ఒక ద‌ర‌ఖాస్తుదారు తెలిపారు.

కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ_

పత్రికా ప్రకటన
*గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి*

*కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ.. ప్రజల్లో దేశభక్తిని, గోసంరక్షణపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోసమేత తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.​నగరంలోని చారిత్రక తెలంగాణ చౌక్ వేదికగా సాగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీని అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ బస్టాండ్ వరకు సాగి, తిరిగి తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది. సుమారు 600 మంది విద్యార్థులు, యువతీ యువకులు, గోమాత ట్రస్ట్ సభ్యులు, నాయకులు ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యులయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, గోమాత జాతీయ మాతగా గుర్తింపు పొందాలని నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది.​ఈ కార్యక్రమంలో నమో మిషన్ వందే గోమాత వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మద్విరాజ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కో-ఫౌండర్ లు జూపెల్లి ధీరజ్, వేణు, దీపక్, అదిశేషు, నవీన్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గోమాత ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..