*నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి*
లాల్ బహదూర్ శాస్త్రి (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది.
*1964 జూన్ 11 న ప్రధానమంత్రిగా అతను చెప్పిన మొదటి మాటలు ప్రసారమైనాయి.*
" చరిత్ర కూడలిలో నిలబడి ఎటు వెళ్ళాలో తేల్చుకోవాల్సిన సమయం ప్రతి దేశానికీ వస్తుంది. కానీ మనకు ఏ కష్టమూ, సంశయమూ అవసరం లేదు. కుడి, ఎడమలకు చూడనవసరం లేదు. మన మార్గం నేరుగానూ స్పష్టంగానూ ఉంది- అందరికీ స్వాతంత్ర్యం, సంపదా ఇచ్చే సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం, ప్రపంచ శాంతి కోసం పాటుబడడం, అన్ని దేశాల తోటీ మైత్రి నెరపడం"
*నీతి, నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం*
*ప్రస్తుత నాయకుల్లో అణు మాత్రం కనిపించదు*
దేశ ప్రధాని కాకముందు లాల్ బహాదుర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచాడు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యాడు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్త్రి’ గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు, శాస్త్రికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితాశాస్త్రి తో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు "స్వంత ఇల్లు" అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’ అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు.
లాల్ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్త్రిగారు) మీద ఒత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నాడు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించాడు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రి కి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.
లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపాడు. ఒక నిమిషం ఆలోచించి, హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు అన్నారట.
Courtesy / Source by :
*గంతల నాగరాజు రిపోర్టర్*
No comments:
Post a Comment