Saturday, July 13, 2024

విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలు కారాదు

విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారడం తమ ప్రభుత్వానికి  ఏమాత్రం సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

▪️హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం 'తెలంగాణలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యాబోధన' అంశంపై ఆయా కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్‌వోడీ తదితరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. నైపుణ్యతను పెంచాలన్న సంకల్పంతోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని అన్నారు.

▪️ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ క్రమంలోనే ఇంజనీరింగ్ విద్యను మరింత పటిష్టం చేసి, ఉన్నత నాణ్యతా ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రాథమిక స్థాయిలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్న విషయాన్ని వివరించారు.

▪️తెలంగాణ ఆకాంక్షకు ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు చిక్కులు, ఇతర గందరగోళాలను పరిష్కరించి ఇప్పటిదాకా 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.

▪️గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియలోనూ నిబంధనల ప్రకారం, కోర్టు చిక్కులు తలెత్తకుండా, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @OffDSB , ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు, విద్యాశాఖ కార్యదర్శి, జెన్‌టీయూ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ శ్రీ బుర్రా వెంకటేశం, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
#Telangana 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1812116198932218366?t=HoVN4BQdt_HX9KteQTIT9Q&s=19

No comments:

Post a Comment