*జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు... రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం....*
హైదరాబాద్ : తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జరిగిన ప్రెస్ అకాడమీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి అందజేయనున్నామని వివరించారు. చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు రూ. 3వేలు పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని అన్నారు.
పెన్షన్ తో పాటు వారి పిల్లలకు ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు చదువుల కోసం నెలకు రూ. వెయ్యి అందజేస్తామన్నారు. ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ గురు ప్రసాద్, ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బండి నారాయణకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వీరితోపాటు మరో ఇద్దరూ జర్నలిస్టులకు రూ. 50 వేలు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
Courtesy / Source by :
*V.S. జీవన్*
No comments:
Post a Comment