*ఉత్తమ తెలుగు జర్నలిస్టు లు -2024 జాబితా విడుదల*
*40 విభాగాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 41 మంది ఎంపిక*
*అవార్డుతో పాటు రూ.5వేల నగదు పురస్కారం కూడా..*
*సంయుక్తంగా ప్రకటించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం*
*త్వరలోనే హైదరాబాద్ లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం*
*హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్* :
ప్రజాగళాన్ని తన కలంగా మార్చుకుని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన జర్నలిస్టులకు 'తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం', 'తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో 'ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాలు' అందజేస్తుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉత్తమ జర్నలిస్టు -2024 పురస్కార గ్రహీతల వివరాలను తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఎంతగానో సేవ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వాలు అండగా ఉంటే మరింత మేలు జరుగుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులకు ఇటువంటి పురస్కారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయని, బాధ్యతను పెంచుతాయన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అనం చిన్ని వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ప్రతిభ కలిగిన జర్నలిస్టులు ఉన్నారన్నారు. సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన జర్నలిస్టులకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా గొంతుక ప్రజాప్రతినిధుల గొంతుకగా మారితే సమాజం నష్టపోతుంది. అందుకే సామాజిక దృక్పథం కలిగిన నిఖార్సయిన జర్నలిస్టులను ఎంపిక చేసి సమాజానికి ఆదర్శవంతమైన జర్నలిజాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా వచ్చిన ధరఖాస్తులలో నుండి 40 విభాగాలలో 41 మంది జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. త్వరలోనే ప్రముఖుల చేత ఈ పురస్కారంతో పాటు రూ.5వేల నగదు పురస్కారం కూడా అందజేయబోతున్నాం అని వివరించారు. రెండు రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. తెలుగు జర్నలిస్టుల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవాలను కూడా ప్రతీ ఏటా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ర్ట అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గిలకత్తుల శ్రీనివాస్, బోడపాటి సుబ్బారావు, *తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సోషల్ మీడియా ఇన్చార్జి బాపట్ల కృష్ణ మోహన్*, సుపర్ టీవీ న్యూస్ ఎండీ చుండూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment