*తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు!*
*కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం*
దిల్లీ: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.న్యాయవాదుల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కలసికంలను అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 12న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం రాత్రి నియామక ఉత్తర్వులు జారీచేసింది. అలాగే హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాంబే, కోల్‌కతా, గువాహటి, కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులకు చెందిన మొత్తం 15 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి పచ్చజెండా ఊపారు.ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టులో ఖాళీల సంఖ్య 12కి తగ్గింది. ఈ హైకోర్టుకి మంజూరుచేసిన న్యాయమూర్తుల సంఖ్య 42. అందులో శాశ్వత న్యాయమూర్తులు 32, అదనపు న్యాయమూర్తి పోస్టులు 10 ఉన్నాయి. ప్రస్తుతం 25 మంది శాశ్వత, ఇద్దరు అదనపు న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. శాశ్వత న్యాయమూర్తుల్లో 7, అదనపు న్యాయమూర్తుల్లో 8 పోస్టులు కలిపి మొత్తం 15 ఖాళీగా ఉండగా.. ఇప్పుడు ఈ ముగ్గురి నియామకంతో ఖాళీల సంఖ్య 12కి తగ్గింది. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ఆదివారం లేదా సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment