Thursday, July 27, 2023

చెరువుల పరిరక్షణ కమిటీపై హైకోర్టు ఆగ్రహం

15 ఏళ్లయినా బఫర్‌ జోన్‌లు గుర్తించరా?

ప్రస్తుతం ఉన్న నీటి వనరులు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది.

 Courtesy by : ఈనాడు మీడియా (ట్విట్టర్)
Updated : 28 Jul 2023 05:30 IST

చెరువుల పరిరక్షణ కమిటీపై హైకోర్టు ఆగ్రహం

15 ఏళ్లయినా బఫర్‌ జోన్‌లు గుర్తించరా?

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం ఉన్న నీటి వనరులు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. చెరువుల పరిరక్షణ అంశాన్ని తేలికగా తీసుకోరాదని హెచ్చరించింది. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చెరువుల బఫర్‌ జోన్‌ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2008లో ఏర్పాటైన చెరువుల పరిరక్షణ కమిటీ.. 15 ఏళ్లయినా రాష్ట్రంలోని చెరువుల బఫర్‌ జోన్‌లను గుర్తించకపోవడంపై నిలదీసింది. చట్టప్రకారం అది విధులు నిర్వహించని పక్షంలో రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని రామమ్మకుంట బఫర్‌ జోన్‌ పరిధిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) భవన నిర్మాణాన్ని సవాలు చేస్తూ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ట్రస్ట్‌ గతంలో పిల్‌ వేయగా... నిర్మాణాలపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ జూన్‌ 5న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

అనుమతులు తీసుకున్నాం: అడ్వొకేట్‌ జనరల్‌

అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే 3 ఎకరాల్లో మాత్రమే ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.  తరగతి గదుల కోసం చేపట్టిన జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణాలు 80% పూర్తయ్యాయన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... నిర్మాణాల్లో జాప్యం జరిగితే వ్యయం పెరిగి ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలుసని, అయితే బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతించలేమంది. అనంతరం రామమ్మకుంటలో జరుగుతున్న పనుల మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ఇందులో ఎక్కువ భాగం బఫర్‌ జోన్‌ ఆవల నిర్మాణం జరుగుతోందని, బఫర్‌ జోన్‌ బయట పనులను కొనసాగించుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ కమిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రామమ్మకుంట బఫర్‌జోన్‌ను ఈ కమిటీ గుర్తించిందా అని ప్రశ్నించింది. చెరువుల నిర్వహణ స్థానిక సంస్థల పరిధిలో ఉందన్న కారణంతో కమిటీ తమ బాధ్యత నుంచి పారిపోకూడదని పేర్కొంది. ఆగస్టు 11లోగా కనీసం హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల బఫర్‌జోన్‌లను నిర్ధారించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లేకుంటే బాధ్యులైన అధికారులందరూ కోర్టులో హాజరుకు ఆదేశించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.

No comments:

Post a Comment