హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
మానవహక్కుల వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తొమ్మిదవ సంయుక్త మహాసభలు శనివారం (17 డిసెంబర్ 2022న) నిజామాబాద్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే మహాసభలలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవడం అనే అంశాల మీద చర్చ జరుగుతుంది.
మహాసభల ప్రారంభ సదస్సులో ప్రజాస్వామ్యం మీద హిందుత్వ దాడి అనే అంశం మీద రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత శాఖ మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ ప్రసంగించారు. సామాజిక ఐక్యత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే దిశగా దేశం అడుగులు వేయడం 2014 లో మొదలయ్యిందని ఆయన అన్నారు.
“ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కంటే తలసరి స్థూల ఆర్థిక అభివృద్ధి విషయంలో మన దేశం తొలిసారి వెనుకబడింది. 2018 నుంచీ ఆరు శాతం పైనే నిరుద్యోగం తచ్చట్లాడుతూ ఉంది. శ్రామికులకు పని లభ్యత విషయానికి వచ్చేసరికి దక్షిణాసియాలోనే హీనమైన స్థితిలో ఉన్నాము” అని ఆకార్ పటేల్ అన్నారు.
దేశంలో గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్న ముస్లింలను రాజకీయాలలోకి రానీయకుండా తొక్కిపట్టడాన్ని ఆకార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్నీ, అలాగే ఆ పార్టీ పార్లమెంటు సభ్యుల్లో, శాసనసభ్యుల్లో కూడా ఒక్క ముస్లిం కూడా లేకపోవడాన్నీ ఆయన ఎత్తిచూపారు. ట్రిపుల్ తలాక్, గొడ్డు మాంసం వంటి సాంస్కృతిక, ఆచార, జీవన వ్యవహారాలలో వారిని నేరస్తులను చేసే ప్రయత్నాలను ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ విలువలను పక్కకు నెట్టి హిందుత్వ రాజకీయాలు ప్రమాదకర మార్గాన్ని పట్టాయని అన్నారు.
ఆర్థిక, సామాజిక వ్యవస్థల గమనంలో వస్తున్నఈ మార్పులను గనుక పౌర సమాజం ప్రతిఘటించకపోతే అవి కొనసాగుతూనే ఉంటాయని ఆకార్ పటేల్ అభిప్రాయపడ్డారు.
ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అధ్యాపకుడు ఆకాష్ పోయెం ‘విధ్వంసం అవుతున్న ఆదివాసీ సంస్కృతి’ అనే అంశం మీద ప్రసంగించారు. “ ఆదివాసీ ప్రాంతాలలో ఆర్ ఎస్ ఎస్ అడుగుపెట్టక ముందే హిందూ సంస్కరణ ఉద్యమాలు అక్కడ హైందవీకరణను మొదలుపెట్టాయని అన్నారు. కేంద్రంలో బీజీపీ అధికారంలోకి వచ్చాక వనవాసి కళ్యాణ్ ఆశ్రం వంటి సంఘాలు ఈ ప్రాంతాల్లో బలపడ్డాయని అన్నారు. ఆదివాసులను సహజ వనరులకు దూరం చేసే ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. పారిశ్రామికీకరణ, గనుల తవ్వకం వంటి వినాశక యత్నాలకు వ్యతిరేకంగా ఆదివాసులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఆదివాసుల సంస్కృతినీ, ఆచారాలనూ అర్థం చేసుకోకుండా ఆ ప్రాతాలలో బ్రాహ్మణీయ భావజాల వ్యాప్తిని, పెట్టుబడిదారుల వనరుల ఆక్రమణనూ అడ్డుకోలేమని అభిప్రాయపడ్డారు.
సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు ఉషా శ్రీలక్ష్మి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత తలెత్తుతున్న భూసమస్యలను గురించి మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా భూయాజమాన్యానికి సంబంధించి విభజనకు ముందు ఉన్న అసమానతలు మరింత పెరిగాయని ఉషా సీతాలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు, రైతుబీమా, భూమి రికార్డుల డిజిటీకరణ, హరితహారం వంటి పథకాల/ విధానాల పర్యవసానాలను ఆమె వివరించారు.
మానవహక్కుల వేదిక బాధ్యులు ఎస్. జీవన్ కుమార్, గొర్రె పాటి. మాధవరావు, ఎ. చంద్రశేఖర్, ఎస్. తిరుపతయ్య, జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు, కార్యదర్శి పి .సరిత తదితరులు పాల్గొన్నారు.
ఫోటో కాప్షన్ : మానవహక్కుల వేదిక తొమ్మిదవ మహాసభల సందర్భంగా ప్రసంగిస్తున్న రచయిత, రాజకీయ విశ్లేషకుడు ఆకార్ పటేల్.
Courtesy by : మానవ హక్కుల వేదిక (HRF)
No comments:
Post a Comment