*ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్ళనక్కర్లేదు.... ఈసీ, రిమోట్ ఓటింగ్*
దిల్లీ: ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే ప్రాంతాల్లో పనులు చేసుకునేవారు దేశంలో ఎంతో మంది. అలాంటి వారు ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం గగనమే..!ఆసక్తి లేకనో లేదా ప్రయాణ ఖర్చులు భరించలేకనో చాలా మంది ఓటు కోసం ఊరెళ్లరు. అలా దేశంలో మూడోవంతు ఓటర్లు పోలింగ్‌కు దూరంగానే ఉంటుండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. దేశీయంగా వలసలు వెళ్లిన వారు ఉన్న చోటు నుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేలా 'రిమోట్ ఓటింగ్ మిషన్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ EC) ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (RVM) నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎం (RVM)ను అభివృద్ధి చేశారు. జనవరి 16న ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఈసీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమోట్ ఓటింగ్ (Remote Voting)ను అమల్లోకి తెచ్చేముందు.. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈసీ వివరించింది. ఇందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరనున్నట్లు పేర్కొంది.
''2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. అంతర్గత వలసల(దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కారణంగా ఓటువేయలేకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85శాతం మంది ఇలాంటి వారే'' అని ఈసీ (EC) ఆ ప్రకటనలో వివరించింది. వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టిపెట్టామని తెలిపింది. ప్రజాస్వామ్య పండగలో మరింత మంది పాల్గొనేలా ఈ రిమోట్ ఓటింగ్ గొప్ప నాంది కాబోతోందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment