Tuesday, December 6, 2022

ఖమ్మంలో "సమరయోధుల" ప్లాట్ల కబ్జా బాగోతం

*కలెక్టరేట్, కమీషనర్ సార్లూ...*
*_మీరేం చేస్తారు.?_*
_● సమరయోధుల ప్లాట్ల కబ్జా బాగోతం_
_● అమ్ముకునే హక్కు లేకున్నా..!_
_● కొనుగోళ్ళు చెల్లవు..అయినా.!_
_● గ్రీన్ బెల్ట్ కబ్జా.!_
_● ఖమ్మంలో వెలుగుచూసిన భూ బాగోతం_
_● ఫిర్యాదులపై స్పందన ఏది.?_
_● విచారణ జరిపేది ఎప్పుడు.?_

Courtesy by : ( అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 )_*

*_200 ఏండ్ల బ్రిటిష్‌ దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీరులు ఎందరో.. ఎందరెందరో... స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న యావత్త్ భారతావని ఏం ఇచ్చి ఆ మహానుభావుల రుణం తీర్చుకోగలదు.? ఏం చేసినా..? ఎంత చేసినా తక్కువే.! అయితే రాను రాను ఆర్థిక అవసరాలు మారాయి. సమరయోధుల ఆర్థిక పరిస్థితి గురించి దేశవ్యాప్తంగా పెన్షన్ సౌకర్యంతో పాటు, వ్యవసాయ భూములు, ఇళ్ళస్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఇంత వరకు ఓకే.! ఈ ఇళ్ళ స్థలాలను ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మటం, కొనటం చేయరాదు. ఖమ్మంలో జరిగిన స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలాల విషయంలో కొత్త కోణం వెలుగుచూసింది. కోట్లాది రూపాయల ఈ 'భూ భూ కుంభకోణం'పై ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, శాంతి భద్రతలను పర్యవేక్షించే పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్  చట్టపరంగా చర్యలు చేపడతారా..? లేక మీనమేషాలు లెక్కిస్తూ ఉపేక్షిస్తారా.?_*

*_అసలేం జరుగుతుంది..?:_*
ఈ ఇళ్ళ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. ఒక నిబంధన లేదు.. నియమం లేదు.. పద్ధతి లేదు.. చట్టం లేదు. అసలు రికార్డులు పట్టించుకునే తీరిక లేదు. ఒరిజనల్‌ పట్టాల స్థానంలో ఫోర్జరీ పట్టాలు వచ్చాయి. అవి 'నకిలీ పట్టాలు మొర్రో' అంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు నివేదికలు పంపినా వాటికీ దిక్కు లేదు.

*_అమ్ముకునే హక్కు లేదు:_*
ఈ స్థలాల కేటాయింపు సందర్భంగా ప్రభుత్వం 21 నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఈ భూమి లేదా ఇంటి స్థలం అమ్మకం చేయరాదు. చేసేటట్లయితే అందరి  కుటుంబ సభ్యుల నిరంభ్యంతర అనుమతి తప్పనిసరి. అందులో ఏ ఒక్కరు 'నో' చెప్పినా దానికి కలెక్టర్ అనుమతి నిరాకరిస్తారు. ఒకవేళ ఆ స్థలాలపై ఎవరు ఎలాంటి లావాదేవీలు జరిపినా.. ఆ స్థల యాజమాన్య హక్కులను జిల్లా కలెక్టర్ రద్దు చేసే  అవకాశం ఉంటుంది.

*_ఖమ్మంలో ఏం జరుగుతోంది:_*
స్వాతంత్ర్య సమరయోధులకు దేశవ్యాప్తంగా కేటాయించినట్లుగానే ఖమ్మంలో కూడా  మూడు ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాల కేటాయింపు జరిగింది. ఇందులో వైఎస్సార్ నగర్ సమీపంలో ఒక్కొక్కరికి 146 గజాల చొప్పున 323 మందికి ప్రొసీడింగ్ నెం.10995/06 ద్వారా ఇళ్ళ స్థలాలు కేటాయించారు. 'రియల్ ఎస్టేట్'కు రెక్కలు రావడంతో ఈ ఇళ్ళ స్థలాలపై కబ్జారాయిళ్ళ కన్ను పడింది. రౌడీ షీటర్లు మీసాలు తిప్పటం మొదలెట్టారు. నకిలీ పట్టాలు సృష్టించి... ఆక్రమణలకు 'తెర' దీశారు. 

*_ఫిర్యాదులు వస్తే..:_*
ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే ప్రభుత్వ యంత్రాంగం ఖమ్మంలో ఆ వైపు దృష్టి సారించటం.లేదు. ఇలాంటి ఆగడాలకు హైదరాబాద్ నగరంలో పిడి ఆక్ట్ రుచి చూపిస్తుంటే ఖమ్మం నగరంలో సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

*_సంప్రదింపులు ఎందుకు..?_*
భూ కబ్జాల విషయంలో సమరయోధుల వారసులు పలువురు పోలీస్టేషన్ గుమ్మాలు ఎక్కటం కనిపిస్తోంది. నిబంధనల మేరకు అమ్మకం చేయరాదంటూనే... కబ్జారాయుళ్ళకు 'బయట మాట్లాడుకోగలరు..' అంటూ వెసులుబాటు ఇవ్వటం ఈ కబ్జా 'నాటు' నాయాళ్ళకు వరంగా మారింది.

*_అంతా ఒకటే సిండికేట్_*
స్వాతంత్ర్య సమరయోధులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు వ్యవహారం ప్రభుత్వం బహిరంగ ప్రకటించకపోవడం ఈ కబ్జా రాయుళ్ళకు వరంలా మారింది. వీరంతా ఒకటే సిండికేట్. ఒకరు మరొకరికి అమ్మినట్లు.. వారు మరొకరికి అమ్మనట్లు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు బయటకు వస్తారు. దీంతో సమరయోధులు లేదా వారి వారసులకు ఇదో 'పెద్ద వివాదం' ఉన్నట్లు 'సీన్ క్రియేట్' చేస్తారు. దీంతో ఎంతకో అంతకు ఈ ప్లాటును వదులుకోవడానికి సిద్దపడతారు. అయితే ఈ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవి అయితే ఈ కబ్జా రాయుళ్ళ ఆట ఒక విధంగా ఉంటుంది. ఇవి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు కావడం వల్ల ఏ వారసుడు వచ్చి మళ్ళీ క్లైమ్ చేస్తే ... ఆ స్థలం కొనుగోలుదారులు వదులుకోవల్సిందే..! ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ స్థలాలు కొనటం, అమ్మటం నేరం. ఈ కబ్జా రాయుళ్ళకు ఓ కింద స్థాయి పోలీసు సిబ్బంది ఒకరు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

*_ప్రభుత్వం ఏం చేయాలి.?_*
ఇలాంటి సందర్భాలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 47 జరిగాయి. పంజాబ్ రాష్ట్రంలోని పటియాల జిల్లాలో ఏకంగా కలెక్టర్ రంగంలోకి అసలు వారసులకు భూములు ఇప్పించపం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పలు భూములు కోర్టు గుమ్మాలు ఎక్కాయి. వారసులు 2008 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. 28మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల వేశారు. 7గురిపైన రౌడీషీట్లు ఓపెన్ చేశారు. ఖమ్మంలో కూడా సమరయోధుల కుటుంబాలకు సమగ్ర సమాచారం ఇవ్వాలి. ఒకవేళ సమరయోధులు మరణిస్తే వారి వారసులకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వం వెంటనే చేపట్టాలి.

*_'గ్రీన్ ఫీల్డ్' గాయబ్.!_*
స్వాతంత్ర్య సమరయోధులకు‌ కేటాయించిన స్థలాలలతో పాటు గ్రీన్ ఫీల్డ్ సైతం కబ్జాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ నగర్ లో రోడ్డు పక్కనే ఉన్న గ్రీన్ ఫీల్డ్ కబ్జా చేసి ఏకంగా ఐదుగురికి అమ్మకం చేయటం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు, దిన పత్రికలలో వచ్చిన విషయాలను జోడిస్తూ...
గత నెల 18న కలెక్టర్ గౌతమ్ కు ఈమేరకు ఫిర్యాదు అందింది. కలెక్టర్ స్పందించని పక్షంలో హైకోర్టును ఆశ్రయించాలని ఔత్సాహికులు భావిస్తున్నారు.

బాక్స్:
*_తాజా ఫిర్యాదు_*
స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఖమ్మంలో పలు ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. సోమవారం ఖమ్మం జిల్లా, అర్భన్ పోలీస్టేషన్ లో ఓ ఫిర్యాదు (KMM/KNPH KMM/051222/00691) అందింది. పోలీస్ కమీషనర్ శ్రీ విష్ణు ఎస్ వారియర్ కు సైతం మొత్తం ఆధారాలతో కూడిన ఫిర్యాదు అందింది. బాధితుల కథనం ప్రకారం....స్వాతంత్ర్య సమరయోధుడు రామయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాలనీకి సమీపంలో కేటాయించిన ఇంటి స్థలం ప్లాట్ నెంబర్ 279 ఆక్రమణకు గురైంది. భూక్యా శ్రీను, క్యాప్ శ్రీను అలియాస్ కుర్నవెల్లి శ్రీను, భూక్యా హరి, పరిమళ రాము అలియాస్ రామన్న, పంతంగి నాగరాజు అలియాస్ డాన్ నాగరాజులకు  అండగా నిలుస్తున్న మాజీ సర్పంచ్ బాషా పేరుపై ఏకంగా ఓ అగ్రిమెంట్ పుట్టుకొచ్చింది. ఇక్కడే అసలు దొంగలు దొరికారు. ఈ స్వాతంత్ర్య సమరయోధుడు స్పష్టంగా సంతకం పెడతారు. ఇక్కడ 'వేలిముద్ర'తో నకిలీ సృష్టించారు. ఇక్కడ చూపెడుతున్న పట్టా కూడా నకిలీ దే కావడం గమనార్హం.  అసలు ఈ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ పట్టాతో సహా 2015లోనే ఆయన తన రెండో వారసుడికి ఈ స్థలం అప్పగించటం జరిగింది.

*_వెరైటీగా..కేసు:_*
సమరయోధుల భూములు కబ్జాలకు గురవుతన్నాయంటే రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల చేతివాటం కనిపిస్తోంది. అలాగే పోలీసుశాఖ కూడా ఉపేక్షించాల్సిన పని లేదు. ఒకవేళ చర్యలకు శ్రీకారం చుట్టకపోయినా.. సెక్షన్లు సరిగ్గా పేర్కొనక పోయినా... 'సెక్షన్ల. ఆల్ట్రేషన్' కోసం హైకోర్టును ఆశ్రయించటం ఖాయం. ఇదిలా ఉండగా...ఒకవేళ రెవెన్యూ, పోలీసులు అస్సలు స్పందించకపోతే ఏం చేయాలనే విషయంలో ఓ ఔత్సాహికుడు ఏకంగా 'సంబంధిత అధికారులు సరిగ్గా విధులు నిర్వర్తించటం లేదు' అంటూ హైకోర్టులో ఓ కేసు దాఖలు చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల మెడకు మరో హైకోర్టు కేసు ఉండటం అవసరమా.?

No comments:

Post a Comment