*_స్వర్గంలో కలుద్దాం.!_*
*_మన్నించు 'మా' కైకాల..!_*
_★ అవార్డులు నీకు (అ)దాసోహం_
_★ నీ కులం నీకు అడ్డం..?_
_★ నిన్ను తప్పకుండా మరోసారి కలుస్తాం.!_
_★ నికృష్ట అవార్డులు చచ్చిన తర్వాత ఎందుకు.?_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*
*_నిజంగా కైకాల సత్యనారాయణకు రావల్సినంత గుర్తింపు దక్కిందా..? ఎందుకో దక్కలేదనే అనిపిస్తోంది. ఒక ఎస్వీరంగారావులాగే తనూ వివక్షకు గురయ్యాడా..? 62 ఏళ్లపాటు సినిమా సెట్లలో ఉండి, 878 సినిమాలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు. ఎప్పుడో 1959లో మొదలైన కెరీర్ మూడేళ్ల క్రితం నాటి మహర్షి వరకు.. ఈ సంఖ్య అనితరసాధ్యం.! కొందరికి మినహా.. మరి ఆయనకు దక్కిన పురస్కారాలు..? ప్చ్, చెప్పదగినవేమీ లేవు._*
*_మొదట్లో 'డూప్'గా.._*
నిజానికి తను మొదట్లో హీరో.. ఎన్టీయార్, ఏఎన్నార్‌లాగు స్ఫురద్రూపం. డైలాగ్ డెలివరీ గానీ, యాక్షన్ గానీ ఎవరికీ తక్కువ కాదు. అవకాశాల్లేక ఎన్టీయార్‌కు డూప్‌గా చేశాడు. తప్పులేదు. తరువాత విలన్‌గా బ్రేక్ ఈవెన్. ఇక ఏ సినిమా అయినా సరే సత్యనారాయణ అంటే విలన్.. డిష్యూం డిష్యూం కుర్ర హీరోల నుంచి పెద్ద హీరోల దాకా వాళ్లతో తన్నులు తినేవాడు. మరి తెలుగు విలన్ అంటే అంతేగా..!
*_చిల్లరతనం లేకుండా.._*
తరువాత ఇతర పాత్రలవైపు దృష్టి పెట్టాడు తన కామెడీలో టైమింగ్ సూపర్. తను వేసిన సాఫ్ట్ రోల్స్ కూడా తనలోని నటుడిని ఆవిష్కరించాయి. ప్రత్యేకించి ఘటోత్కచుడు గానీ, యమలీల గానీ తన పాత్రలు హైలైట్. అసలు యమధర్మరాజు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా ఫిట్టయ్యాడు తను.. ఆ సీరియస్ యముడి పాత్రలో కూడా కామెడీని, కోపాన్ని, ప్రేమను పండించాడు. ఏమాత్రం చిల్లరతనం లేకుండా..!
*_ఒక్కటంటే ఒకటి మాత్రమే.._*
రాజకీయాల్లో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయాడు తను.. రాజకీయాలు తనకు సూట్ కావు. అందుకని ఆ కెరీర్‌ను పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. విషయానికి వస్తే ఎవరెవరికో నటన బేసిక్స్ కూడా తెలియని వాళ్లకు పద్మ పురస్కారాలు వస్తుంటాయి. ఏవేవో అవార్డులు మెడలో పడుతుంటాయి. కానీ సంపూర్ణ నటుడు సత్యనారాయణకు అలా గుర్తుంచుకోదగిన పురస్కారాలు ఏమీ వచ్చినట్టు గుర్తులేదు. ఒక్కటంటే ఒక్కటి అది కూడా 2017లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య అవార్డు మినహా..!
*_పైరవీలు చేతకాకనే.._*
పురస్కారాలకు పైరవీలు చేతకాక అవి తన దగ్గరకు రాలేదా..? ఇండస్ట్రీలో అవార్డులు, పురస్కారాలు అంటేనే పైరవీల మయం. లేక ఇండస్ట్రీ మొత్తం ఒకే కులం ఆధిపత్యం కింద ఉంది, అన్యకులానికి చెందినందున కైకాల వివక్షకు గురయ్యాడా..? చాలామంది నమ్మేది ఇదే… చిరంజీవి వచ్చాక సీన్ చేంజ్ అయ్యింది గానీ… అంతకుముందు అంతా ఆ కులం ఆధిపత్యమే కదా..! అక్కడక్కడా కొన్ని మినహాయింపులు తప్ప.. స్టూడియోలు వాళ్లవే.. హీరోలు వాళ్లే… నిర్మాతలు వాళ్లే.. వాళ్లు గీసిందే గీత, చెప్పిందే శాసనం. సరే, ఇది చర్చిస్తే ఒడవదు, తెగదు. చివరకు మొన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చాన్నాళ్లు ఉంటే ఒక్క చిరంజీవి మాత్రమే వెళ్లి పరామర్శించి వచ్చాడు… (సత్యనారాయణలాగే పౌరాణిక ప్రతినాయక పాత్రలకు గతంలో ఎస్వీ రంగారావు ఫేమస్.. రావణుడు, దుర్యోధనుడు ఎట్సెట్రా పాత్రలు ఎస్వీఆర్ వేస్తేనే వాటికి ఓ విలువ..)
*_దక్కిన గుర్తింపు ఏమిటి..?_*
ఇప్పటిదాాకా కైకాల 878 సినిమాల్లో నటిస్తే, వాటిల్లో 28 పౌరాణికాలు, 51 జానపదాలు, 9 చారిత్రికాలు… తను 200 మంది దర్శకులతో పనిచేశాడు… ఓపికతోపాటు, తన వృత్తికి తను నిబద్దుడిగా, విధేయంగా ఉంటే తప్ప అందరు దర్శకులతో కలిసి పనిచేయడం కష్టం. మరి ఆ సత్యనారాయణకు దక్కిన గుర్తింపు ఏమిటి..? కనీసం తనను సాగనంపేటప్పుడైనా ఈ దిక్కుమాలిన వివక్షకు తెరవేసి… అత్యంత సీనియర్ నటుడికి గౌరవప్రదమైన వీడ్కోలు చెప్పండర్రా…!!
No comments:
Post a Comment