Monday, December 19, 2022

ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!

*ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!*

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తగళం వినిపించారు. పదవులన్నింటినీ సొంత నియోజకవర్గం మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దూలపల్లిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద్‌ తదితరులు పాల్గొన్నారు.అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశానికి ప్రత్యేక కారణం లేదంటూనే మంత్రి మల్లారెడ్డి వైఖరిని తప్పుబట్టారు. నామినేటెడ్‌ పదవులన్నీ మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారని.. తమ నియోజకవర్గాల కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ పదేపదే చెప్పినా మంత్రి ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. వచ్చిన వాళ్లకే పదవులు వస్తున్నాయని.. ప్రొటోకాల్‌ కూడా పాటించడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తి మూడు నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పదవులు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. '' పార్టీ కార్యకర్తలకు పదవులు రావాలనే మేం అడుగుతున్నాం. కొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే మేం మాట్లాడుతున్నాం. కొందరు మంత్రులు వాళ్ల వ్యక్తులకే నాలుగు పదవులు ఇప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.'' అని అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి.. మళ్లీ ఆయన్ను ఎలా పిలుస్తామని అన్నారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే అభినందిస్తామన్నారు. సమావేశం అంతర్గత విషయాలు బయటకు వెళ్లాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. మాపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎవరో కుట్ర చేశారని ఆయన తెలిపారు. జిల్లా నాయకత్వం వైఫల్యాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment