Sunday, August 16, 2026

సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను సన్మానించిన సీపీ సజ్జనర్‌

*హైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు సేవా పతకాలు*

*సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను సన్మానించిన సీపీ సజ్జనర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికైన అధికారులను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్‌ జోన్‌ అదనపు డీసీపీ జే.నర్సయ్య, విశిష్ట సేవా పతకం వరించిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను శుక్రవారం సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత ప్రదర్శించినందుకే అధికారులకు ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్‌ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని, వీరి సేవలు ఇతర పోలీసు అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
అధికారుల విశేష సేవల నేపథ్యం
*(1)* : అదనపు డీసీపీ జే.నర్సయ్య:1991లో ఎస్సైగా చేరి 35 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందిస్తున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ (ఐపీఎం) సహా పలు పతకాలు అందుకున్నారు.
*(2)*:  సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి:1995లో ఎస్సైగా చేరి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. రూ.127 కోట్ల పాన్‌-ఇండియా సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ద్వారా ఛేదించి గుర్తింపు పొందారు. దర్యాప్తులో ప్రతిభకు గాను 2022లో ‘కేంద్ర హోంమంత్రి పతకం’ సాధించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ యం.శ్రీనివాస్‌, ఐపిఎస్, జాయింట్‌ సీపీ (ఎస్‌బీ), నార్త్‌ రేంజ్‌ శాంతిభద్రతల జాయింట్‌ సీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌, ఐపీఎస్, డీసీపీలు కిరణ్ ఖారే ఐపిఎస్ (చార్మినార్ జోన్), ఎస్. శ్రీనివాస ఐపిఎస్ (రాజేంద్రనగర్ జోన్), ఎమ్. చైతన్య కుమార్ ఐపిఎస్ (డీడీ), శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ (వుమెన్ సేఫ్టీ వింగ్), డి. రాజేష్ (శంషాబాద్ జోన్), జె. రాఘవేందర్ రెడ్డి (గోల్కొండ జోన్), ఎ. రమణా రెడ్డి (జూబ్లీహిల్స్)  తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పతక గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.

వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి పౌరుడు తప్పక తోడ్పడాలి: గౌరవనీయ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా_

*తెలంగాణ లోక్ భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి పౌరుడు తప్పక తోడ్పడాలి: గౌరవనీయ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15:

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ధైర్యం, దేశభక్తి నుండి స్ఫూర్తి పొంది, అభివృద్ధి చెందిన, ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధిగల, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడాలని పౌరులకు పిలుపునిచ్చారు.లోక్ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేసి, లాంఛనప్రాయ వందనం స్వీకరించారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి అతిపెద్ద బలమని ఆయన అన్నారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో హైదరాబాద్ గణనీయమైన పురోగతి సాధిస్తుండగా, తెలంగాణ ఒక కీలక వృద్ధి చోదకంగా ఆవిర్భవించిందని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
టీబీ ముక్త్ భారత్, నషా ముక్త్ భారత్‌లను విస్తృత ప్రజా ఉద్యమాలుగా మార్చాల్సిన అవసరాన్ని గవర్నర్ నొక్కిచెప్పారు. క్షయవ్యాధి నిర్మూలనకు, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి పౌరులు, సంస్థలు, యువత కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.
సాయుధ దళాలకు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తూ, వారి అప్రమత్తత, శౌర్యం, త్యాగాల వల్లే దేశం ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తుందని ఆయన అన్నారు.వికసిత్ భారత్ దార్శనికతతో పాటు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధిగల, సుసంపన్నమైన తెలంగాణను నిర్మించడానికి సమిష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు_

*మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో గల టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ వినియోగదారులకు, టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ సేవలే సంస్థకు ప్రతిష్టను తీసుకొస్తాయి.
వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు మరియు సిబ్బంది చేస్తున్న కృషిని సీఎండీ అభినందించారు. విద్యుత్ రంగంలో సంస్థకు మరింత గుర్తింపు, మంచి పేరు తీసుకురావడానికి ఇదే స్ఫూర్తి, అంకితభావం మరియు నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు.
వినియోగదారుల సంతృప్తికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, వారికి ఎలాంటి జాప్యం, అసౌకర్యం లేకుండా విద్యుత్ సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సీఎండీ స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో నాణ్యత, విశ్వసనీయతను మరింత మెరుగుపరచడంతో పాటు, వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గోల్కొండ కోటలో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అనంతరం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) డా. ఎన్. నర్సింహులు, డైరెక్టర్ (ఫైనాన్స్)  చక్రపాణి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. శివాజీ, డైరెక్టర్ (హెచ్‌ఆర్ & ఫైనాన్స్) కృష్ణారెడ్డి, మెద్చల్–మల్కాజిగిరి చీఫ్ ఇంజినీర్, హెచ్‌ఆర్ విభాగం అధిపతి శ్రీ బిక్షపతి, కార్పొరేట్ కార్యాలయ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ_

*గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ*

*రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మహేష్ కుమార్ గౌడ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15

గాంధీ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం దేశంలోనే గొప్ప పండగ అని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండగ అని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు.మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ చరిత్రను యువత సమగ్రంగా అధ్యయనం చేయాలని, ముఖ్యంగా నేటి జెన్‌-జీ తరం చరిత్రపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.కుల, మతాల పేరుతో జరుగుతున్న చిచ్చు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాకారమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.పరిపాలన కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రజాస్వామ్యం పరిఢవిల్లదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేయడం సరైన విధానం కాదని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జోడో యాత్ర స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని, సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాస్తవాలకు దూరంగా సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని అరికట్టాలని, యువత నిజానిజాలను తెలుసుకుని చైతన్యవంతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యులనే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ వంటి నాయకుల పాత్రను గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశం ఆశ్చర్యపోయేలా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు_

*రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15:

రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి వాతావరణంలో నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కాలనీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఒకే కుటుంబంలా కాలనీ ప్రజలందరూ కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, పోలీసు సిబ్బంది, ప్రజాసేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, దేశ సమగ్రతను కాపాడుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం కాలనీ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ సభ్యులు రమేష్ గౌడ్, ఎం. రవికుమార్, గోపాల్ యాదవ్, సర్వ సత్తయ్య యాదవ్, శివ శంకర్, సంజీవ్, కమిటీ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, శ్రీనివాస్ గౌడ్, కే. నవీన్ కుమార్, భూపతి రాములు గౌడ్, డాక్టర్ విద్యాసాగర్, రామకృష్ణ, శివకుమార్, బి. చలపతిరావు, రమేష్ శెట్టి, స్వామి, మాసయ్య, వేణుగోపాల్ రెడ్డి, హరీష్, శేఖర్, సాయికుమార్, ఆంజనేయులు, చంద్రం చారి, సిద్ధు గౌడ్, గణేష్, బాల కొమరయ్య, వెంకట స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Friday, August 14, 2026

పాకిస్తాన్ మరియు బలూచిస్తాన్ రెండు వేర్వేరు దేశాలు.బలూచిస్తాన్‌కు తొమ్మిది వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది_

*ఆగస్టు 14న బ్లాక్ డే పాటించాలని బలూచిస్తాన్ గణతంత్రం బలూచ్ జాతిని కోరుతోంది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 13:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల మంది బలూచిస్తాన్ ప్రజలకు బలూచిస్తాన్ గణతంత్రం ఒక ప్రత్యేక సందేశాన్ని తెలియజేయాలనుకుంటోంది. పాకిస్తాన్ మరియు బలూచిస్తాన్ రెండు వేర్వేరు దేశాలు. బలూచిస్తాన్‌కు తొమ్మిది వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది మరియు దానికి దాని స్వంత ప్రత్యేక గుర్తింపు, చరిత్ర, భాష, సంస్కృతి, భౌగోళిక స్వరూపం మరియు ఉనికి ఉన్నాయి. దాని గుర్తింపు లేదా చట్టబద్ధత కోసం అది పాకిస్తాన్ యొక్క కల్పిత, అసత్య మరియు అబద్ధపు కథనంపై ఆధారపడదు.పాకిస్తాన్‌కు విముక్తి లభించలేదు,దానికి బదులుగా, భారతదేశ విభజన ద్వారా బ్రిటన్ దానిని ఒక బఫర్ జోన్‌గా సృష్టించింది. పాకిస్తాన్ నిజమైన అర్థంలో ఒక దేశం కాదు, కానీ పాశ్చాత్య శక్తులు సృష్టించిన ఒక ప్రాజెక్ట్. వారు దానిని వివిధ సమయాల్లో తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి మరియు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఒక అద్దె సాధనంగా ఉపయోగించుకున్నారు. పాలస్తీనియన్లను చంపడానికి జోర్డాన్‌కు పాకిస్తానీ సైన్యాన్ని పంపడం, పదవీ విరమణ తర్వాత సౌదీ అరేబియాలో కూలికి సేవలు అందించడానికి పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం, మరియు ఇప్పుడు జీతాల కోసం వేలాది మంది పాకిస్తానీ సైనికులను సౌదీ అరేబియాకు పంపడం వంటివి, ఈ ప్రాంతమంతటా కొనసాగుతున్న సంఘర్షణలు, యుద్ధాలు మరియు అస్థిరతల మధ్య పాకిస్తాన్ శాంతి కోసం కాకుండా, యుద్ధ లాభార్జకురాలిగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, లేదా అన్ని మతాల ప్రజల మధ్య సౌభ్రాతృత్వం మరియు శాంతి నెలకొనాలని పాకిస్తాన్ కోరుకోవడం లేదు. ఈ ప్రాంతంలో అస్థిరతను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ బలూచిస్తాన్ యొక్క భౌగోళిక, సముద్ర మరియు వనరులను ఉపయోగించుకుంది.
ఆగస్టు 14న, బలూచిస్తాన్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలు, అలాగే బలూచిస్తాన్ వెలుపల నివసిస్తున్న బలూచ్ జనాభా బ్లాక్ డే గా పాటిస్తారు. వారు పాకిస్తాన్‌తో తమ విభేదాన్ని వ్యక్తం చేయడానికి తమ ఇళ్ల వద్ద, విద్యా సంస్థల వద్ద నల్ల జెండాలను ఎగురవేసి, నల్ల కంకణాలను ధరిస్తారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ జెండా ఎక్కడ కనిపించినా, దానిని దించి పారవేస్తారు. ఎందుకంటే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశం. మా దేశంలో మరో దేశపు జెండాను ప్రదర్శించడానికి చట్టపరంగా గానీ, నైతికంగా గానీ ఎటువంటి సమర్థన లేదు.పాకిస్తాన్ సైన్యం తుపాకుల నీడలో ఆగస్టు 14వ తేదీని జరుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్‌ను ఒక ఆక్రమణ దేశంగా, దాని సైన్యాన్ని బలూచ్ ప్రజల హంతకులుగా భావిస్తారని దానికి కూడా తెలుసు. కేవలం రెండు రోజుల క్రితం, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సైన్యం మరియు వైమానిక దళం సురబ్ గదర్ గోండన్ ప్రాంతంపై దాడి చేశాయి. ఈ దాడిలో, అధిక సంఖ్యలో మహిళలు మరియు పిల్లలతో సహా దాదాపు ముప్పై మంది అమాయక బలూచ్ ప్రజలు హతమయ్యారు, మరియు డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారు. ఇటువంటి బలూచ్ వ్యతిరేక పాకిస్తాన్ తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం బలూచ్ సంస్కృతి, చరిత్ర మరియు ప్రవర్తనా నియమావళికి కూడా విరుద్ధం.

సైబర్ క్రైమ్ మోసాలు - సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులచే అవగాహన కార్యక్రమం_

*సైబర్ క్రైమ్  మోసాలు - సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులచే అవగాహన కార్యక్రమం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 13:

హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న జాహ్నవి కళాశాలలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇ. తులసి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో, ఓటీపీ మోసాలు, పెట్టుబడి మోసాలు, ఆన్‌లైన్ రుణ మోసాలు, ఏపీకే మాల్వేర్ మోసాలు, కస్టమర్ కేర్ మోసాలు మరియు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల ద్వారా జరిగే మోసాల వంటి ప్రధాన ఆన్‌లైన్ మోసాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ముఖ్యమైన సైబర్ భద్రతా జాగ్రత్తలను కూడా వివరించారు, వాటిలో కొన్ని:
*(1)* :తెలియని ఏపీకే ఫైల్స్ / రిమోట్ యాక్సెస్ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయవద్దు
*(2)* :బ్యాంక్ వివరాలు, పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు లేదా వ్యక్తిగత ఐడీలను ఎప్పుడూ పంచుకోవద్దు
*(3)*:  ఉద్యోగ / రుణ ఆఫర్లు మరియు ప్రకటనలకు స్పందించే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించుకోండి
*(4)*: కస్టమర్ సహాయం కోసం ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌లు మరియు హెల్ప్‌లైన్‌లను ఉపయోగించండి*
*(5)*: డబ్బు కోసం లేదా ఇతర కారణాల కోసం తెలిసిన/తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతాలను ఇవ్వవద్దు.
*(6)*: ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా తెలియని వెబ్‌సైట్‌ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దు.
*(7)*: సైబర్ మోసాలను వెంటనే 1930 మరియు cybercrime.gov.in కు తెలియచేయండి