Tuesday, November 28, 2023

కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్... కింద మంట

కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్... కింద మంట



* కోవర్టు ఆపరేషన్ సక్సెస్
* ఆల్ ఆర్ సేమ్
* రంగంలోకి నమ్మకంగా..
* డౌటనుమానాలు ఎన్నో..
* వ్యూహాలను పసిగడుతూ..

Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

ప్రతికూల పరిస్థితులను అధిగమించి టికెట్ సాధించి గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన అభ్యర్థులను కోవర్టు భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇలాంటి కోవర్టు వ్యవస్థ పటిష్టంగా ఉంది. అనేక నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులను కోవర్టులుగా రంగంలోకి దించారు. ఇతర పార్టీల్లోకి వ్యూహాత్మకంగా పంపారు. అధికార పార్టీలో ఈ విధమైన కోవర్టుల బెడద ఎక్కువగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో 'కోవర్టు'లు జాత కట్టడంతో అభ్యర్థులకు ఏ సమాచారం నిజమో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆల్ ఆర్ సేమ్:
తమ వారిని కావాలని ప్రత్యర్థుల దగ్గరకు పంపిస్తూ, అక్కడ వారు చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ లో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిన అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు అనేక నియోజకవర్గాలలో కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు.

రంగంలోకి నమ్మకంగా..:
కోవర్టులను రంగంలోకి దింపి ప్రత్యర్థులను నిలువరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్ని పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్న క్రమంలో ఎవరు తమకోసం పనిచేసేవారు? ఎవరు కోవర్టులు? అనేది తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగడం ప్రధానంగా కనిపిస్తుంది.

డౌటనుమానాలు ఎన్నో..:
ఈ చేరికలు అన్నీ నిజంగానే కొనసాగుతున్న చేరికలా లేక కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా కొనసాగుతున్న చేరికలా అనేది మాత్రం అంతుబట్టడం లేదు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం అన్ని పార్టీల అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గాల వేదికగా సాగుతున్న కోవర్టు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.

వ్యూహాలను పసిగడుతూ..:
గతంలో పన్నిన వ్యూహాలు మార్చుకుంటున్న అభ్యర్థులు కోవర్టుల సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతం వ్యూహాలు బెడిసికొడితే ఏం చేయాలోననే ఆందోళనల్లోనూ పడుతున్నారు. మరోవైపు తాము కష్టపడి పన్నిన వ్యూహాలు అవతలి పార్టీల వారికి తెలిసి పోతుండటంతో నాయకులు వారి అస్త్రశస్త్రాలను ఆప్పటికప్పుడు మార్చుకోవాల్సి అవసరం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కోవర్టులు అధికమవ్వడం కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది. ఈ పరిణామాలతో పార్టీలో ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో తెలియని సంకట స్థితిలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు.

No comments:

Post a Comment