KTR: ఈసారి పర్యాటకశాఖ అడుగుతా: మంత్రి కేటీఆర్
భారాస అధికారంలోకి వస్తే తనకు పర్యాటకశాఖ ఇవ్వమని ముఖ్యమంత్రిని అడుగుతానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈనాడు, హైదరాబాద్: భారాస అధికారంలోకి వస్తే తనకు పర్యాటకశాఖ ఇవ్వమని ముఖ్యమంత్రిని అడుగుతానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో చేసి చూపించిందని స్పష్టం చేశారు. కరోనా మినహా తమకు దొరికిన ఆరున్నరేళ్ల కాలంలోనూ అనూహ్య వృద్ధి సాధించామన్నారు. బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగిన తర్వాత ఇవి ఇంకా మెరుగయ్యాయన్నారు. వైద్య, ఆధ్యాత్మిక, క్రీడా, అటవీ పర్యాటకాలకు ఇక్కడ మంచి అవకాశాలున్నాయని అన్నారు. క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పౌష్టికాహార రంగాల్లోనూ మౌలిక వసతులు పెంపొందించడమే తమ భవిష్యత్తు ప్రణాళిక అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిసరాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉందని, గండిపేట, హిమాయత్‌సాగర్‌ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యాటకులకు వసతులను పెంపొందించాల్సి ఉందన్నారు. ఖాయిలా పడ్డ సంస్థలను ఒడ్డున పడేసేందుకు ప్రత్యేక పారిశ్రామిక పురోభివృద్ధి విభాగం కూడా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. మూతపడ్డ పరిశ్రమలకు సంబంధించి సాంకేతిక-ఆర్థిక అంశాలను విశ్లేషించి, బ్యాంకులతో మాట్లాడి రుణసదుపాయాన్ని పునర్‌వ్యవస్థీకరించడం ఈ విభాగం విధి అన్నారు. కాంగ్రెస్ హయాంలో తీవ్రమైన విద్యుత్తు కోతలు, నీటి కొరత ఉండేదని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సమస్యలన్నిటినీ అధిగమించడంతోపాటు సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు.
హైదరాబాద్ ఎంతలా అభివృద్ధి చెందిందో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు, భాజపా ఎంపీ సన్నీదేవల్ గుర్తించారు. కానీ ప్రతిపక్ష గజనీల కళ్లకు మాత్రం ఇది కనిపించడంలేదని ఆయన ఆక్షేపించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఫాక్స్‌కాన్ అధినేత యాంగ్ లీ హైదరాబాద్‌ను చూసి ఇది భారతదేశంలా కనిపించడంలేదని అన్నారని, భాగ్యనగరం సాధించిన ప్రగతికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలన, తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనను బేరీజు వేసుకోవాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహవీర్ సౌండ్‌రూం వ్యవస్థాపకులు జీలీల్ సబీర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజానా షా, బీఎన్‌ఐ సభ్యులు పాల్గొన్నారు.
Courtesy / Source by : ఈనాడు మీడియా
No comments:
Post a Comment