_వీడిన సందిగ్ధత.._
*_ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్_*
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_టీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మతించారు. దీంతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది._*
బిల్లుపై తొలుత గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. దీంతో సభలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో తమిళిసై సమావేశమయ్యారు. లేవనెత్తిన సందేహాలపై రవాణశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదివారం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. వారితో సమావేశం అనంతరం బిల్లుకు తమిళిసై ఓకే చెప్పారు.
ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో శనివారం పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిల్లుపై రాజ్‌భవన్ వివరణ కోరడం.. ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, మళ్లీ రాజ్‌భవన్ శనివారం మధ్యాహ్నం కొత్త సందేహాలు వ్యక్తంచేయడం, ప్రభుత్వమూ సాయంత్రమే వాటికి సమాధానాలు పంపడంతో ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలనుకొన్న ఆర్టీసీ విలీన బిల్లుపైనా గవర్నర్ రెండుసార్లు వివరణ కోరడంతో కార్మికులు ఆందోళన చెందారు.
*_ఏం జరిగిందంటే.._*
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఇది మనీ బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న మధ్యాహ్నం ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్ కార్యాలయం వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, మళ్లీ గవర్నర్ అదనపు సమాచారం కోరడం, మరోసారి ప్రభుత్వం తన వివరణ పంపడం... ఇదంతా రెండు రోజుల్లోనే జరిగింది.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం చలో రాజ్‌భవన్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయంపూట రెండు గంటలపాటు బస్సులను నిలిపేశారు. రాజ్‌భవన్‌కు వచ్చిన కార్మికుల తరఫున పది మంది నాయకులను పిలిచి చెన్నైలో ఉన్న గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మీ ప్రయోజనాలను పరిరక్షిస్తానని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అనంతరం గవర్నర్ లేవనెత్తిన అంశాలపై సీఎస్ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్ మరో ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరారు. వాటి వివరాలతో కూడిన లేఖను విడుదల చేసిన రాజ్‌భవన్.. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాలవాంఛను రాజ్‌భవన్ అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్ తదుపరి వివరణను కోరారని పేర్కొంది. గవర్నర్ తాజా లేఖకు శనివారం సాయంత్రమే సీఎస్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మరింత స్పష్టత కోరడంతో రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదివారం గవర్నర్‌తో సమావేశమై వివరణ ఇచ్చారు. వారి వివరణతో సంతృప్తి చెందిన తమిళిసై.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.
No comments:
Post a Comment