Wednesday, August 2, 2023

వరదల్లో గల్లంతైన వారి వివరాలేవి?

వరదల్లో గల్లంతైన వారి వివరాలేవి?

వరదల్లో కొట్టుకుపోయినవారి ఆచూకీ గురించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. వరదల కారణంగా ఆచూకీ కనిపించనివారి కుటుంబాలకు ఎలాంటి చేయూతనిచ్చారని ప్రశ్నించింది.

 Courtesy / Source by : eenadu.net (Twitter)
Published : 02 Aug 2023 05:21 IST

ఆ కుటుంబాలకు చేయూతనిచ్చారా?
కడెం ప్రాజెక్టు కింద ఉన్నవారి సంగతేంటి?
4వ తేదీకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వరదల్లో గల్లంతైన వారి వివరాలేవి?

ఈనాడు, హైదరాబాద్‌: వరదల్లో కొట్టుకుపోయినవారి ఆచూకీ గురించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. వరదల కారణంగా ఆచూకీ కనిపించనివారి కుటుంబాలకు ఎలాంటి చేయూతనిచ్చారని ప్రశ్నించింది. బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 41 మంది మృతి చెందారంటూ ఇచ్చిన నివేదికలో భూపాలపల్లి జిల్లాలోని మృతుల వివరాలను చెప్పకపోవడాన్ని ఎత్తిచూపింది. వరదల నుంచి ప్రజలను కాపాడటానికి శాశ్వత ప్రణాళికతోపాటు ఇతర సమగ్ర వివరాలతో నివేదికను ఈ నెల 4వ తేదీకల్లా దాఖలు చేయాలని ఆదేశించి, విచారణను వాయిదా వేసింది. వరద బాధితుల కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్‌ చెరకు సుధాకర్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ వాదనలు వినిపిస్తూ... ‘‘వరద బాధితులకు మంచినీరు, మందులు అందించాం. వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు మంజూరు చేసింది’’ అని వివరించారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ... ‘‘క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ నివేదిక ఉంది. జులై 19న వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో అయిదుగురు చనిపోతే నివేదికలో వారి ప్రస్తావనే లేదు. వరదలో చిక్కుకుపోయిన 9మంది కోసం హెలికాఫ్టర్‌ను పంపాలని వేడుకున్నా స్పందించలేదు. కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రాజెక్టు పైనుంచి నీటి ప్రవాహం వెళ్లింది. (ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇప్పటికీ నీరు ప్రాజెక్టు పైనుంచే వెళుతోందా అని ప్రశ్నించగా... అవునని చెప్పారు.) ఇటీవల కేంద్ర జల సంఘం ప్రాజెక్టును సందర్శించింది. ప్రస్తుతం వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణకు ఇప్పటిదాకా శాశ్వత ప్రణాళిక రూపొందించలేదు’’ అని ఆరోపించారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ... ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్సు సిబ్బందిని 20న అందుబాటులో ఉంచామని, కేంద్రం పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రభుత్వం సమర్పించిన నివేదికలోని అంశాలను ధర్మాసనం పేర్కొంటూ... ‘‘వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకున్నారన్న విషయం ఇందులో లేదు. వరద నష్టాల నివారణకు శాశ్వత ప్రణాళిక రూపొందించండి. కలెక్టర్లు గ్రామాల వారీగా తీసుకుంటున్న సహాయక చర్యలపైనా నివేదిక ఇవ్వండి. వర్షాలతో ఆందోళనకు గురవుతున్న బాధితులకు మనోస్థైర్యం ఇవ్వాలి. అత్యవసర సేవలైన విద్యుత్తు సౌకర్యం, ఫోన్లు, ఇంటర్‌నెట్‌లను పునరుద్ధరించాలి. టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి అదృశ్యమైన వారి వివరాలను బాధిత కుటుంబాలకు అందజేయాలి. నిరాశ్రయులైన 14,216 మందికి నిరంతరాయంగా సేవలందించాలి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్సు, ఆర్మీతోపాటు రాష్ట్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. జంతు, పంట నష్టాల వివరాలతో సమగ్ర నివేదిక అందజేయండి’’ అని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

No comments:

Post a Comment