Sunday, August 27, 2023

ఇండియాలో చేరుతారా...కేసీఆర్ ?

*ఇండియాలో చేరుతారా...? భాజాపా కు మద్దతిస్తారా...? కేసీఆర్ స్పష్టంచేయాలి*

ముంబయి : అమీబా ' జీవి మాదిరిగానే భాజపా నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూ ఒక కచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఎద్దేవా చేశారు.ఆదివారం ఇక్కడి హింగోలీలో నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఉద్ధవ్‌ (Uddhav Thackeray) ప్రసంగించారు. భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ (KCR).. 'ఇండియా (INDIA)' కూటమికి మద్దతిస్తారా? లేదా భాజపాకా? అనేది స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. 'ఇండియా' కూటమిని 'ఘమండియా (దురహంకారి)'గా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఎన్డీయేను 'ఘమండా (ghama-NDA)' అని పిలవాలన్నారు.

'దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే జాతీయవాద పార్టీలు 'ఇండియా' కూటమిలో ఉన్నాయి. కానీ, ఎన్డీయేలోని చాలా పార్టీల్లో ద్రోహులు, ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసి భాజపాతో మిత్రపక్షంగా చేరిన వారు ఉన్నారు' అని ఠాక్రే మండిపడ్డారు. ప్రస్తుత ఎన్డీయే.. అమీబా లాంటిదని, దానికి కచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని విమర్శించారు. భాజపాను ఇండియా కూటమి ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 'ఇండియా'కు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష కూటమి అనేది.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టలేదని, దేశం కోసమే ఇదంతా అని పేర్కొన్నారు.భారాస అధినేత కేసీఆర్‌.. దేశం కోసం పోరాడాలా? లేదా భాజపాకు మద్దతివ్వలా? అనేది తేల్చుకోవాలని ఉద్ధవ్‌ అన్నారు. 'ఒకవేళ దేశంతో ఉంటే.. ఇండియా కూటమిలో చేరండి. లేదా, భాజపాతో మీ పొత్తును బహిరంగంగా ప్రకటించండి. కానీ, ఓట్లను చీల్చకండి' అని వ్యాఖ్యానించారు. భారాస తొలుత సొంత రాష్ట్రంపై దృష్టి సారించాలని, అక్కడ పార్టీ పరిస్థితులు బాగోలేవని విమర్శించారు. కొన్నాళ్లుగా మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్‌ దృష్టిసారించడాన్ని స్థానిక 'మహావికాస్‌ అఘాడీ' నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయిలో 'ఇండియా' కూటమి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment