Thursday, August 3, 2023

78 ఏళ్ల వయసులో.... స్కూలుకు....!

*78 ఏళ్ల వయసులో.... స్కూలుకు....!*

ఇంఫాల్‌ : వయసు అయిపోయింది. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కుటుంబ పరిస్థితులను బట్టి ఏమైనా పని చేసుకోవచ్చు. కానీ మిజోరంకి చెందిన 78 ఏళ్ల వృద్ధుడి జీవనయానం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.మిజోరంలోని చంపై జిల్లా హ్రుయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగ్‌తర (Lalringthara) 1945 లో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబభారమంతా తల్లి మీదే పడింది. ఒక్కడే సంతానం కావడంతో ఇంట్లో కష్టాలు చూడలేక.. తన తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. దాంతో అతని చదువు మధ్యలోనే ఆగిపోయింది. మాతృభాషలో చదవడం , రాయడం రావడంతో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.అయితే ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆసక్తితో పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందరి పిల్లలతో పాటు యూనిఫాంతో బ్యాగ్‌ వేసుకుని ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్నాడు.లాల్రింగ్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... ఇంగ్లీషు అప్లికేషన్లు రాయడం, టీవీలో ఆంగ్ల వార్తలను అర్థం చేసుకోవడమే ప్రధాన లక్ష్యం అని తెలిపాడు.
ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. లాల్రింగ్‌ ఇతర విద్యార్థులకు , ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు. ఈ వయసులో కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన ఆయన నిజంగా అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment