Sunday, August 20, 2023

_ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్ సంఘటనపై HRf నిజ నిర్ధారణ నివేదిక_

*ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్ సంఘటనపై నిజ నిర్ధారణ నివేదిక* 

తేదీ : 20 ఆగష్టు 2023

ఆగష్టు 15 వ తారీఖు రాత్రి 11 గంటల సమయం లో   వర్ద్య లక్ష్మి (గిరిజన ఒంటరి మహిళ) అనే మీర్పేట్ నివాసి మరియు మరికొందరు ట్రాన్సజెండెర్ లను ఎల్.బి. నగర్ పోలీసులు, వాహనం లో ఎక్కించుకొని, బాధితురాలిని పోలీస్ స్టేషనులో చిత్రహింసలు పెట్టి మరుసటి రోజు వదిలిన సంగతి తెలిసినదే. ఈ వార్త, పత్రికలో, ఎలక్ట్రానిక్ మీడియా లో చాల ప్రాముఖ్యం పొందింది. దానికి స్పందిస్తూ రాచకొండ కమీషనర్ గారు, పోలీసులు చేసింది తప్పే అని విన్నపించుకుని  ఒక మహిళా పోలీసుతో సహా ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఈ విషయం పై వివిధ సంఘాలతో నిజ నిర్ధారణకు వెళ్ళిన బృందానికి ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి.

15 వ తారీఖు పోలీస్ స్టేషన్ లో లక్ష్మి మీద హింస ప్రయోగించారు, తనని పొలిసు వాహనం లో తీసుకు వెళుతున్నప్పుడు మహిళా పొలిసులు ఎవరు లేరు  అన్న విషయం మాత్రమే బాధితురాలు మరియు పొలిసు డిపార్ట్మెంట్ ఒప్పుకున్న ఒకే ఒక్క విషయం. 

జరిగిన విషయం 

లక్ష్మి , దేవరకొండ ప్రాంతం నుంచి వలస వచ్చి , మీర్పేట్ ప్రాంతంలో ఇళ్లలో పని చేస్తోంది. ఈమె ST లంబాడ వర్గానికి చెందినది.  కూతురి పెళ్ళి కోసం కొంత ఆస్తి తాకట్టు పెట్టి 3 లక్షలు అప్పు తీసుకొని, ఆ డబ్బుతో ఎల్.బి. నగర్ సమీపం నుండి ఇంటికి వెళ్తుండగా పోలీసులు కొందరు ట్రాన్సజెండర్ వ్యక్తులతో పాటు తనని తీసుకెళ్ళారని, పొలిసు స్టేషనులో తన మొబైల్ కావాలని గట్టిగ అడిగినందుకు హింసకు పాల్పడ్డారు అని, అప్పుడు హింసించిన వారు నలుగురు మగవారు అని లక్ష్మి గారు ఆసుపత్రిలో కలిసిన మా బృందంతో చెప్పారు. జరిగిన సంఘటన  మీడియా లో బాగా రావడంతో, పోలీసులు ఆవిడను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లో చికిత్సకు పంపారు. ఆ తరువాత కర్మన్‌ఘాట్ లో ఉన్న జీవన్ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ అయ్యే ఖర్చును పోలీసులు భరిస్తారని మాట ఇవ్వడం జరిగింది. 20 వ తారీఖు తెల్లవారాక ముందే ఆవిడను అక్కడి నుంచి టీచర్స్ కాలనీ లోని శ్యామ్ హాస్పిటల్ కి మార్చారు. జీవన్ హాస్పిటల్ దారిగుండా ముఖ్యమంత్రి వెళ్ళే అవకాశం ఉండడంతో, చాల ప్రాచుర్యం పొందిన ఈ సమస్య పట్ల హాస్పిటల్ ముందు రాస్తా రోకో జరిగే అవకాశం ఉందని అందుకే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళమని చెప్పారని తెలిసింది. జీవన్ హాస్పిటల్ లో బిల్లు అప్పటికి ఒక లక్ష ముప్పై వేల దాకా అయ్యింది కానీ, ఇంకా ఎవరు బిల్లు కట్టలేదని తెలిసింది. 

శ్యామ్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిన మా బృందానికి, లక్ష్మి గారికి ఎక్కడా ఎముకాలు విరగలేదని తెలిసింది. తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది అని తెలిపారు. "assault with polytrauma" కింద చికిత్స చేస్తున్నారు.

బాధితురాలు లక్ష్మి, తనని పొలిసు స్టేషన్ కి తీసుకువెళ్తున్నపుడు మహిళా పోలీసులు ఎవరు లేరని, తన మీద హింస ప్రయోగించింది నలుగురు మగ పోలీసులని తెలిపారు. తన మొబైల్ తనకి ఇమ్మని గట్టిగ అడగడం వల్లనే తనని బూతులు తిడుతూ కొట్టారని చెప్పారు. బాధితురాలుని కొట్టారు అని సస్పెండ్ చేసిన మహిళా పొలిసు గురించి అడగగా, మహిళా పోలీసు కొట్టలేదని కాకపోతే తనని కొడుతుంటే అడ్డుపడలేదని అన్నారు. పోలీసులు కొట్టడం వల్ల స్పృహ తప్పింది అని, తరువాత లేచి చూస్తే తన మూడు లక్షల రూపాయలు, చెవులకు ఉండే రెండు తులాల బంగారం, తన పర్సు తన ఫోన్ కనబడలేదని అన్నారు. ఈ విషయం ఇంత ప్రచారం పొందటం వల్ల , ఇంకో అద్దె ఇల్లు చూసుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది అని వాపోయారు. 

17 వ తారీఖున, లక్ష్మి గారి కూతురు ఎల్. బి నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యడం జరిగింది. IPC 324 (ఆయుధాలతో దాడి ), 354 (మహిళపై గౌరవ భంగం), 379 (దొంగతనం) మరియు SC /ST అట్రాసిటీస్ చట్టాలు రాశారు. IPC 166 (అధికార దుర్వినియోగం ద్వారా ఒక వ్యక్తికీ శారీరక హాని కలిగించడం) మాత్రం వాడలేదు.  పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో 3 లక్షల నగదు మరియు చెవి దుద్దులు గురించి ఉండగా, ఎఫ్.ఐ.ఆర్  లో దొంగతనం కాబడ్డ వస్తువులు గురించి పొలిసు వారు నమోదు చేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. అలాగే అనుమానితులు ఎవరు అన్న చోట  సంబంధిత పోలీసు అధికారులు అని మాత్రమే రాయడం జరిగింది కానీ పేర్లు రాయలేదు. 

పొలిసు స్టేషన్ కి వెళ్ళి విచారించగా, అక్కడ SHO మరియు ACP అందుబాటులో లేరు.  ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన S.I మరియు ఇతర సిబ్బంది మొత్తం పాము చావకుండా కర్ర విరగకుండా మాట్లాడారు. ఎల్. బి. నగర్ సర్కిల్ దగ్గర  వేశ్య  వృత్తి చేస్తూ ప్రజలకు  ఇబ్బంది కలిగిస్తున్నారు అన్న కారణం వల్ల ముగ్గురు ట్రాన్స్ మహిళలను, బాధితురాలిని తీసుకొచ్చారని , బాధితురాలు పోలీసులను బాగా తిట్టిందని, ఆవిడని కొట్టిన వారిలో మహిళా పొలిసు కూడా ఉన్నారని చెప్పారు. లక్ష్మి గారి మీద తప్ప మిగితా వారి మీద పెట్టీ కేసులు మోపడం జరిగిందని, బాధితురాలిని పొలిసు స్టేషన్ కి తీసుకు వచ్చిన విషయం జనరల్ డైరీ లో రాశాము అని, స్టేషన్లో CC టీవీ లు ఉన్నాయి, అవి పని చేస్తున్నాయని చెప్పారు. అయితే జనరల్ డైరీ, CC టీవీ ఫుటేజీ చూపించడం కుదరదు అని చెప్పారు. మూడు లక్షల సంగతి ఎఫ్.ఐ.ఆర్ లో ఎందుకు పొందు పరచలేదని అని అడిగితే అసలు ఆ డబ్బు ఉన్న విషయం తెలియదు అని మసి పూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించారు. బంగారం మరియు ఫోన్ గురించి అడుగగా, రెండు తులాల బంగారంతో అసలు చెవి దుద్దులు ఉంటాయా అని తిరిగి ప్రశ్నించి, ఫోన్ బాధితురాలి దగ్గరే ఉందని ముగించారు. 

1. బాధితురాలు చెప్పిన దానికి పొలిసులు చెప్పే కథనానికి పొంతన కుదరడం లేదు. బాధితురాలు ఆవిడను నాలుగురు మగ పోలీసులు హింసకు గురి చేసారు అని చెబుతుంటే, డిపార్ట్మెంట్ ఇద్దరు కాన్స్టేబుల్స్  ని దానిలో ఒక మహిళా పోలీసును సస్పెండ్ చేశారు. దీనిపై పారదర్శకంగా విచారణ జరపాలి, పోలీసుల తప్పుని కప్పిపుచ్చడానికి మహిళ పోలీసుని బలిపశువు చేయొద్దు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై విచారణ జరగాలి. 

2. బాధితురాలి 3 లక్షల రూపాయలు ,బంగారం మరియు ఆవిడా ఫోన్ సంగతి ఎక్కడ తేలడం లేదు. ఈ విషయాలను కూడా ఎఫ్.ఐ.ఆర్ లో పొందుపరచాలి.

3. మహిళను పొలిసు స్టేషన్ తీసుకు వస్తున్నపుడు , మహిళా పోలీసులు ఉండాలి అన్న నియమాన్ని అతిక్రమించడం జరిగింది, ఈ ప్రోటోకాల్ ని అతిక్రమించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి.

4. లక్ష్మి గారి చికిత్సకు సంబందించిన ఖర్చు మొత్తం పోలీసులే భరిస్తారన్న నమ్మకం పోలీసులు కలిపించాలి. 


ఈ నిజ నిర్దారణ బృందం లో మానవ హక్కుల వేదిక నుండి సంజీవ్, నరసింహ, వెంకట నారాయణ, రాజు నాయక్, సురేష్, రోహిత్, అమన్ వేదిక నుండి ఆర్.ఇందిర, గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ నాయకులు మంజుల, సంధ్య, మాధవి పాల్గొన్నారు.

Courtesy / Source by : HRf (మానవ హక్కుల వేదిక) హైదరాబాద్ కమిటీ 

No comments:

Post a Comment