Monday, April 17, 2023

విగ్రహం మంచిదే,విధానాల మాటేమిటి?

విగ్రహం మంచిదే,
విధానాల మాటేమిటి?
-----------------------------------------------
Courtesy by : కన్నెగంటి రవి, సామాజిక కార్యకర్త 
-----------------------------------------------

ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర సచివాలయ నూతన భవనానికి కూడా  డాక్టర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. ఈ ఘటనలు రెండూ అణగారిన వర్గాల ప్రజలకు, మొత్తంగా  శ్రామిక ప్రజలకు సంతోషాన్ని  కలిగిస్తున్నాయి. తెలంగాణా సమాజం మొత్తంగా వీటిని స్వాగతిస్తున్నది.  
భారత దేశంలో ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక న్యాయం సాధించడం , కుల నిర్మూలన సాధించడం, మను ధర్మం బోధించే తప్పుడు  విలువలను ప్రజల జీవితాల నుండీ పార దోలడం,  ప్రభుత్వాలు ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందించడం చుట్టూ సాగిన ఆయన కృషి , రచనలు అపురూపమైనవి.  
దేశంలో కుల నిర్మూలనకు , మొత్తంగా దోపిడీ, పీడనల నుండీ ప్రజల విముక్తికి సంబంధించిన రాజకీయ, సైద్ధాంతిక విషయాలలో సమాజంలో భిన్న ఆలోచనలు సహజంగానే ఉంటాయి. వాటిని ఎప్పటికైనా ఓపికగా సాగించే చర్చల ద్వారా,  ప్రజల హక్కుల కోణంలో సమిష్టి కార్యాచరణ ద్వారా  పరిష్కారం చేసుకోవాల్సిందే.  
డాక్టర్ బాబా సాహెబ్ స్పూర్తి తో ,  ప్రజా సంఘాలు, దళిత, ఆదివాసీ సంఘాలు, వెనుక బడిన వర్గాల ప్రజల సంఘాలు , మత పరమైన మైనారిటీ సంఘాలు  పరస్పరం దుమ్మెత్తి పోసుకోకుండా , ఈ సందర్భంగా అటువంటి ఆరోగ్యకరమైన చర్చకు ప్రాణం  పోస్తాయని ఆశిద్దాం. 
అమరుల స్థూపాలు, మహనీయుల విగ్రహాలు ఎప్పుడూ ప్రజలకు స్పూర్తి ఇస్తాయి. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రేరణ ఇస్తాయి. అయితే ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకోసం నెలకొల్పుతున్నారన్న ప్రశ్న మనం ఎప్పుడూ వేసుకోవాలి. 
ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమం చేస్తున్నది ప్రజలను చైతన్య పరిచే లక్ష్యంతోనా, ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే లక్ష్యం తోనా అన్నది చూడాలి. ఈ భారీ విగ్రహాన్ని నెలకొల్పుతున్న , ప్రభుత్వ భవనాలకు పేర్లు పెడుతున్న రాష్ట్ర పాలకులకు  మహనీయుడు అంబేడ్కర్  బోధించిన విలువల పట్ల  ఉన్న నిబద్ధత ఎంత అన్న ప్రశ్న  కూడా అంతే  ముఖ్యమైనది. 
ఎందుకంటే , గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణాలో పరిపాలన డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సాగడం లేదు. రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందడం లేదు. రాజ్యాంగం లో పొందు పరిచిన ప్రాధమిక హక్కులు ప్రజలకు దక్కడం లేదు . రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన ఆదేశిక సూత్రాలు ఏవీ , ప్రజలకు హక్కులుగా అందుబాటులోకి రాలేదు.
ప్రజాస్వామిక విలువల పై ఏ మాత్రమూ గౌరవం లేని నిరంకుశ పాలకులు, డాక్టర్ అంబేడ్కర్ పేరు పదే పదే పలుకుతున్నారంటే, అది ఆయా వర్గాల ప్రజలను మోసం చేయడానికి మాత్రమే . సమాజంలో బుద్ధి జీవులు, రచయితలు, కవులు, కళాకారులు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని సాధారణ ప్రజలను జాగరూకులను చేయాలి. 
తరుముకు వస్తున్న ఎన్నికల ప్రయోజనాల సాధన లక్ష్యం తోనూ, ఇచ్చిన హామీలు ఉల్లంఘించిన పాలకులపై అణగారిన ప్రజలలో నెలకొన్న ఆగ్రహాన్ని చల్లార్చే లక్ష్యంతోనూ,  విగ్రహాలు నెలకొల్పడం, భవనాలకు పేరు పెట్టడం  లాంటి ఒకటి, రెండు ఘటనలు సృష్టించే  పాలకుల నిజ స్వభావాన్ని దాచి పెడుతూ, వారిని  దళిత జనోద్ధరకులుగా కీర్తించే  పోకడలు కొంతమంది మేధావుల వైపు నుండీ వ్యక్తం కావడం అత్యంత బాధాకరం . 
తెలంగాణా రాష్ట్రంలో చాలా గ్రామాలలో ఇప్పటికీ ప్రజలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పాలని అనుకుంటే , ఆయా గ్రామాల లోని ఆధిపత్య శక్తులు అడ్డుకుంటున్నాయి. దళిత కుటుంబాలపై సమాజంలో కుల వివక్ష, అణచివేత  కొనసాగుతూనే ఉంది . 
గ్రామాభివృద్ధి కమిటీ (VDC ) ల పేరుతో ఉత్తర తెలంగాణా లో  ఇప్పటికీ ఇంకా కొన్ని ఆధిపత్య శక్తులు, దళిత కుటుంబాలకు  గ్రామ బహిష్కార శిక్ష విధిస్తూనే  ఉన్నాయి.  కులాంతర,మతాంతర వివాహాలు చేసుకుంటున్న సందర్భంలో దళిత యువకుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి.  
ఈ ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నా,  చాలా సందర్భాలలో ప్రభుత్వం వీటి పట్ల మౌనంగా ఉంటున్నది. లేదా నిందితుల పట్ల మెతకగా వ్యవహరిస్తున్నది. బాధితులకు భరోసా ఇవ్వడం లేదు. ఎస్‌సి,ఎస్‌టి లపై అత్యాచార నిరోధక చట్టం అమలు కూడా అత్యంత బలహీనంగా ఉంది. 
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే అధికార పార్టీ, ప్రస్తుత ప్రభుత్వం దళితులకు అనేక హామీలను ఇచ్చాయి. కానీ వాటి అమలులో పూర్తి వైఫల్యం చెందాయి.  
దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు కదా, భూమి లేని దళిత కుటుంబాలకు గత తొమ్మిదేళ్లలో ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన మూడెకరాల భూమి కూడా దక్కలేదు. కనీసం మూడు లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని ఈ ప్రభుత్వమే జీవో నంబర్ 1 లో చెప్పింది. కనీసం ఎకరానికి 7 లక్షల రూపాయల చొప్పున  ఖర్చు చేసి మూడు ఎకరాలు (21 లక్షలు) కొనుగోలు చేసి ఇస్తామన్న పథకాన్ని ఈ ప్రభుత్వం ఆపేసింది.  కుటుంబానికి 10 లక్షల రూపాయలతో దళిత బంధు పేరుతో జీవనోపాధి కల్పించే కొత్త పథకాన్ని తెచ్చింది. దాని అమలు కూడా పూర్తి అవినీతితో నత్తనడకన  సాగుతున్నది. 
ఎస్‌సి ,ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టం క్రింద ప్రత్యేక అభివృద్ధి నిధులను (SDF)  ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తున్నప్పటికీ, ఆచరణలో  వాటిలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులను, చట్ట స్పూర్హికి భిన్నంగా ఈ ప్రజలకు ఏ సంబంధమూ లేని రోడ్లు, , మెట్రో రైళ్లు  పేరుతో పక్కదారి పట్టిస్తున్నారు. 
తెలంగాణాలో అత్యధిక మంది దళితులు స్వంత భూమి లేని వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. లేదా కౌలు భూమి సాగు దారులుగా ఉన్నారు . వ్యవసాయేతర రంగాలలో అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారు. ఈ కుటుంబాలకు ఆదాయ బధ్రత లేక పేదరికంలో ఉన్నాయి. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఈ కుటుంబాలకు సహజ  వనరులపై హక్కులు కల్పించలేదు. కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడం లేదు. వారి వ్యవసాయానికి సహాయమూ చేయదమూ లేదు. ఈ కుటుంబాలకు రైతు బీమా లాంటి సాంఘిక బధ్రత (సోషల్ సెక్యూరిటీ) కూడా కల్పించలేదు. అసంఘటిత కార్మికులకు గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో కనీస వేతనాలు కూడా పెంచలేదు.  
తెలంగాణా లో ఇప్పటికీ  ప్రభుత్వ విద్యా సంస్థలలో దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఈ విద్యా సంస్థలను  విధ్వంసం చేసింది. ఈ సామాజిక వర్గాల పిల్లలలో విద్యా సామర్ధ్యాలు, నైపుణ్యం పెరగకుండా ఈ ప్రభుత్వమే అడ్డుపడుతున్నది. 
పెరుగుతున్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య  పెంచకుండా , రేషనలైజేషన్ పేరుతో  ఉన్న స్కూల్స్ ను కూడా మూసి వేస్తున్నది. డాక్టర్ బాబా సాహెబ్ ఆశించిన కుల నిర్మూలన వైపు అడుగులు వేసే విధంగా విద్యా రంగంలో కామన్ స్కూల్స్, హాస్టల్స్ కాకుండా , కులాల వారీగా ఈ ప్రభుత్వం ఏర్పరిచిన గురు కులాలు కూడా సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. విద్యార్ధుల వసతి గృహాలకు  కూడా మౌలిక సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది.  
దళిత యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలకు అందించాల్సిన కార్పొరేషన్ రుణాలు కూడా పూర్తిగా అందడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలలో , సంస్థలలో వేలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల, రిజర్వేషన్లు అమలు కావడం లేదు. సామాజిక న్యాయం సాధించే దిశగా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ల ప్రసక్తే ఉండడం లేదు . 
రాజ్యాంగం పరిధిలో దేశ కార్మికులకు హక్కులు కల్పించడానికి డాక్టర్ బాబా సాహెబ్ నిరంతరం కృషి చేశారు. కానీ తెలంగాణా పాలకులు , ఆయా రంగాలలో కార్మిక సంఘాల ఉనికినే ప్రశ్నిస్తున్నారు. ఆర్‌టి‌సి కార్మిక సంఘాల పట్లా, కార్మికుల సమ్మె పట్లా కే‌సి‌ఆర్ వ్యవహరించిన తీరు మన కళ్ల ముందు ఉంది. ఇప్పటికీ ఆర్‌టి‌సి లో కార్మిక సంఘాలను గుర్తించడానికి ఈ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. 
రాజ్యాంగం లో  5 వ షెడ్యూల్ ఆదివాసీల హక్కులను నిర్వచించింది. కానీ తెలంగాణా లో అడవిపై ఆదివాసీలకు వ్యక్తిగత ,సాముదాయక హక్కులు కల్పించడానికి ఈ ప్రభుత్వం ఇప్పటికీ మీన మేషాలు  లెక్క పెడుతున్నది. పైగా 1/70 చట్టానికి భిన్నంగా బయ్యారంలో ప్రైవేట్ పెట్టుబడి దారులతో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడానికి చర్చలు కొనసాగిస్తున్నది. 
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ రాష్ట్రంలో తీవ్ర ఉల్లంఘన జరుగుతున్నది. కనీసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ప్రజలు నిరసన వ్యక్తం  చేయడానికి కూడా అనేక ఆంక్షలు ఎదురవు తున్నాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా బహిరంగం గా మాట్లాడడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజరిక పోకడలతో ముఖ్యమంత్రి ,ఆయన తనయుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఆయా ప్రాంతాలలో  ప్రజా సంఘాల కార్యకర్తల ముందస్తు అరెస్టులు జరగడం ఇందుకు పరాకాష్ట . 
ఈ ప్రభుత్వ ప్రస్తుత పరిపాలనా తీరు , డాక్టర్ బాబా సాహెబ్ ఆశయాలకు,ఆలోచనలకు భిన్నమైనది. దానిని మార్చుకోకుండా, రాజ్యాంగ బద్ధంగా , రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సాగించకుండా, కేవలం బాబా సాహెబ్ విగ్రహావిష్కరణ తోనే,సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతోనే , ప్రజలను సంతృప్తి పర్చాలనుకుంటే ఆయన స్పూర్తికి  తూట్లు పొడవడమే.  
ప్రభుత్వం ప్రస్తుత తన ధోరణి నుండీ బయట పడడానికి , రాబోయే  కాలంలో డాక్టర్ బాబా సాహెబ్  విగ్రహం , సచివాలయం ఉన్న ప్రాంతాన్ని కేవలం టూరిస్ట్ ప్రాంతంగా,  పోలీస్ నిషేదాజ్ఞలు ఉండే ప్రాంతంగా మార్చకుండా , ప్రజల గొంతు ప్రభుత్వానికి వినిపించేలా, ప్రజల సమావేశాలకు, నిరసనలకు ఆ స్థలంలో అవకాశం ఇవ్వాలి . 
దేశమంతా బీసీ జనగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో చేపట్టాలి.l

No comments:

Post a Comment