Saturday, April 22, 2023

వేళ కాని వేళ పుష్కరస్నానాలు ఏల.?

*_ఎక్కడి గంగా పుష్కరాలు..? ఇక్కడ మంజీరలో ఆ పుష్కరాలేమిటి..? స్నానాలేమిటి..?_*
_★ గంగా పుష్కరాల మద్య_
_★గరుడగంగ పుష్కరాలట.!_
_★ వేళ కాని వేళ పుష్కరస్నానాలు ఏల.?_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు‌, 9440000009)_

*ఇది పద్దతి:*
నది అంటే విడిగా ఉండే ప్రవాహం కాదు. ఉపనదులను కలుపుకునే ప్రవహించి, అంతిమంగా సాగరంలో కలుస్తుంది. అన్ని నదులకూ ఉన్నట్టే నదులకూ పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలు వస్తాయి. ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది. ఎన్నో వందలేళ్లుగా ఆ లెక్కల ప్రకారమే పుష్కరాలు వస్తున్నాయి. పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఇది ఒక పద్ధతి.

*_ఇదో విడ్డూరం_*
గోదావరి కూడా అంతే.! దాని ఉపనదులకు వేరేగా, ప్రధాన నదికి వేరేగా పుష్కరాలు ఉండవు. ఉండకూడదు. అది శాస్త్ర సమ్మతం కాదు. సో, గోదావరికి పుష్కరాలు వచ్చినప్పుడే దాని ఉపనది మంజీరాకు కూడా వచ్చాయి, వస్తాయి. నో, నో, ఎప్పుడు వీలయితే అప్పుడు, ఏదో పురాణం చెప్పేసి, ఉపనదికి విడిగా, ప్రధాన నదికి విడిగా… ఏదో పేరు పెట్టేసి పుష్కరాలు చేయిస్తామంటే.. డబ్బులు, హడావుడి కోణంలో వోకే.!

*_కానీ పుష్కరుడు అంగీకరించడు…_* అంగీకరించకపోవడానికి ఆయనెవరు..? నువ్వు 'మంజీర' అనే ఉపనదికి 'ఎప్పుడు వస్తావో మాకు తెలుసా..? నీకు తెలుసా' అని దబాయించే సెక్షన్ వచ్చేసింది. నిజానికి వాళ్లు చెప్పినట్టు వినడం తప్ప పుష్కరుడికి కూడా వేరే చాయిస్ ఏముంది..? మంజీర కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో ప్రవహించే ఓ అంతర్రాష్ట్ర ఉపనది. సింపుల్‌గా చెప్పాలంటే గోదావరిలో కలిసిపోయే ఓ పాయ.

*_గరుడగంగ పుష్కరాలట..🤦🏻‍♂️_*
ఇప్పుడు హఠాత్తుగా మంజీరకు గరుడగంగ పుష్కరాలు నిర్వహిస్తారట.! మెదక్ జిల్లా, 2011లో కేసీయార్ ఈ ఆనవాయితీకి శ్రీకారం చుట్టాడట.! ఆయనదేముంది…? రాజ్యాంగాన్నే మార్చేయాలంటాడు, ఆఫ్టరాల్ పుష్కరాల విధివిధానాలను మార్చిపారేయలేడా..? కానీ ఒక వ్యక్తి చెబితే యావత్ పండితలోకం తలవంచుకుని, తలదాల్చడమే ఒక వింత.! ఇదో ఖర్మ.! అవసరమైతే తననే ఓ పుష్కర పురుషుడిగా భావించి జేజేలు కొడతారు. (మారండి...)

*_అబ్బో... ఓ యబ్బో.._*
తొలిరోజు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుష్కరఘాట్‌కు పూజలు చేస్తే, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పుష్కర స్నానాలు ఆచరించారట.! మంజీర పునీతం అయిపోయి ఉంటుంది. సేమ్ ఇలాగే గత ఏడాది గోదావరి మరో ఉపనది ప్రాణహితకూ పుష్కరాలు చేయించినట్టు గుర్తు.

*_గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి_*
నిజానికి ప్రస్తుతం గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గంగ అంటే గంగే… ఈ హిమానీనదం అనేక ఉపనదులను కలుపుకుని ప్రవహిస్తూ, ఈ దేశ ఆర్థిక, ఉద్వేగ, ఆధ్యాత్మిక, వ్యవసాయిక, పర్యావరణ, సామాజిక అంశాలన్నింటితోనూ అనుసంధానమై ఉన్నది.

*_వేళ కాని వేళ పుష్కరస్నానాలు ఏల.?_*
దాదాపు 5 వేల కిలోమీటర్ల ప్రవాహం… ప్రపంచంలోని 8.5 శాతం ప్రజలకు నివాసస్థలి ఈ గంగ-యమున పరీవాహకం… దాని పవిత్రత వేరు, దాని విశిష్టత వేరు… ఎక్కడో గంగ… కానీ ఇక్కడ తెలంగాణలో గరుడగంగ పేరుతో ఓ పుష్కర విన్యాసం… ప్రజల బుర్రలకు గంతలు కట్టడం దేనికి..? ఎంచక్కా గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడే మంజీరలోనూ మునకలు వేయొచ్చు కదా…! వేళ కాని వేళ పుష్కరస్నానాలు దేనికి..?

*_బానిస నిశ్శబ్ధం.._*
మెదక్‌ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల పేరూరు శివారులో ఉన్న గురుడగంగ సరస్వతీ ఆలయ ఆదరణ కోసం ఈ ప్రయాస… ఇది సరస్వతీ ఆలయం… కానీ నాగదేవతగా భక్తులు కొలుస్తారట… నదీస్నానాలు మంచివే… ఎవరూ కాదనరు… ఆలయ సందర్శనం కూడా మంచిదే… ఎవరూ వ్యతిరేకించరు… కానీ ప్రధాన నదికి భిన్నంగా, ఎక్కడో ఉన్న గంగ పేరు జెప్పి ఈ పుష్కరుడిని లాక్కొచ్చి 12 రోజులపాటు ఇక్కడ కట్టేయడం దేనికి..? తెలంగాణలోని పండితోత్తములకు ఇవన్నీ పట్టవు… కేసీయార్‌కు కోపమొచ్చే ప్రమాదముంది కదా… నిశ్శబ్ధం…

*_రాజు తలుచుకుంటే..._*
జగిత్యాల, మంథని, ధర్మపురి తదితర ప్రాంతాల వాళ్లకు గోదావరే గంగ… గంగ అనే పిలుస్తారు… అంతెందుకు మా ఊరి పక్కన పారే ఒర్రెను మేం కూడా గంగ అనే పిలుస్తాం… పిలుస్తున్నాం కాబట్టి గంగ అయిపోదు… ఎప్పుడో వీలు చూసుకుని మేమూ పుష్కరాలు స్టార్ట్ చేస్తామంటే కుదరదు… పుష్కరుడేమీ తరలిరాడు… అది సత్యం… ఐనా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో తరతరాలుగా పండితులదే ప్రథమస్థానం… ఇప్పుడు ఈ విషయాల్లో కూడా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయారు… హతవిధీ…

No comments:

Post a Comment