Saturday, April 15, 2023

బలగం - ఒక పరిశీలన

* బలగం - ఒక పరిశీలన *.

ఈ మధ్య విడుదలైన చిత్రాలలో 'బలగం' చిత్రానికి విశేష మైన ప్రజాదరణ లభిస్తూ ఉన్నది. చాలా తెలంగాణ గ్రామాలలో గ్రామ సర్పంచ్ లే ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ప్రజల్లో ఒక రకమైన సానుకూల అభిప్రాయం ఈ చిత్రం పట్ల వ్యక్తమౌతున్నది. దీనికి కారణం సడలిన మానవ సంబంధాలకు తిరిగి జావం పోసే ప్రయత్నం చేయటమే. మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు  క్రమంగా తగ్గిపోవటం, వ్యక్తిగత అహం కారణంగా మానవ సంబంధాలు క్షీణించటాన్ని  నిజాయితీగా చిత్రించటం, పాత్రలన్నీ మన రోజువారీ జీవితంలో ఎదురయ్యేవిగా ఉండటం, ఈ చిత్ర విజయానికి కారణాలుగా  చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రం గురించి ఇంతలా చర్చించు కోవటానికి కారణం, వివిధ కారణాల వల్ల దూరమైన మనషులు ఎంత ప్రేమని కోల్పోతారో, వారి మనసులు ఎంతలా వేదన చెందుతాయో, వారంతా ఒక్కటైనప్పుడు దొరికిన ఊరట మనసుల్ని ఎంత శాంత పరుస్తుందో అన్న 'take home' అంశం . ' నిజానికి ఈ చిత్రంతో ప్రజలు Connect ' కావటానికి ఇదొక కీలకమైన అంశం. ఈ చిత్రాన్ని ప్రజలు, ఆదరిస్తున్నారంటే, వారి, మనసుల్లో సైతం దూరమౌతున్న బందాలను దగ్గర చేసుకోవాలని, శిధిలమౌతున్న మానవ సంబంధాలను పునరుజ్జీవింపచేసుకోవాలన్న ఆకాంక్ష
దాగి ఉండటమే.  
మరి ఈ చిత్రం ప్రజల ఆకాంక్షను నిజాయితీగా నెరవేర్చే ప్రత్యామ్నాయాల్ని, పరిష్కారాల్ని చూపిందా? కొమురయ్య అనే సాదా సీదా మధ్యతరగతి
వృద్ధుడి మరణంతో చిత్రం ప్రారంభం అవుతుంది. అప్పట్లో అతని కూతురు 'అల్లుడి పట్టింపు కారణంగా ఇరవై యేళ్లు పుట్టింటికి దూరం అవుతుంది. ఎట్టకేలకు తండ్రి మరణం ఆమెను పుట్టింటికి
రప్పిస్తుంది. మాట పట్టింపుల కారణంగా అల్లుడికి, కొమురయ్య కొడుకులకి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఘర్షణ ముదరటానికి మూడోదినం నాడు కొమురయ్యకు పెట్టిన పిండాన్ని "పిట్ట మట్టక పోవటం"  ఒక కారణమౌతుంది. దీన్ని కారణంగా చూపి అల్లుడు, కొమురయ్య పెద్ద కొడుకును 
నిందించటం, "ఐదొద్దుల" నాడు అల్లుడు పెట్టిన పిండాన్ని కూడా పిట్ట ముట్టక పోవటం
వారి
మధ్య ఘర్షణ    కొనసాగటానికి కారణం అవుతుంది. చివరికి కొమురయ్య మనవడికి అప్పటికే ఒప్పందం చేసుకున్న పెళ్లి సంబంధాన్ని
పరిగణించకుండా కొమరయ్య మనవరాలి(కూతురి కూతురు) తో పెళ్ళి ఖాయం చేసుకోవటంతో ఆ రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. దాంతో 'పదొద్దుల' నాడు 'పిట్ట ముట్టటం' తో చిత్రం పరిసమాప్త మౌతుంది.

ఈ చిత్రీకరణలో భావోద్వేగాల్ని స్పందింప చేసే రెండు మూడు సన్నివేశాలు ప్రజల హృదయాల్ని ద్రవింప చేసేలా ఉండటం, సినిమాతో వారు connect కావటానికి కారణం.

అయితే దర్శకుడు వేణు కథాగమనంలో చూపిన అనేక సన్నివేశాలు గ్రామీణ జీవితాన్ని యదాతథ స్థితిలో కొనసాగటానికి దోహదపడేలా ఉన్నాయే తప్ప మార్పుకు దోహదకారి గా లేవు. చనిపోయిన కొమరయ్య కాకి లో ఉన్నాడన్న
అశాస్త్రీయ అంశాన్ని, సంప్రదాయం పేరుతో అతిగా సాగదీయటం, ఒక అసంబద్ధ అంశం. అంతకన్నా ఘోరమైన మరో విషయం ఏమిటంటే 'దాని అసంతృప్తి' కారణంగానే ఊళ్ళో ఇద్దరు, ముగ్గురికి అనారోగ్యంగా ఉందని చూపటం, ఇదే కారణంతో ఊరి పెద్ద మనుషులు సైతం పదొద్దుల నాడు పిండాన్ని పిట్ట ముట్టకపోతే కొమురయ్య కుటుంబాన్ని వెలివేస్తా మనటం, వంటి అంశాలు మధ్యయుగాల సంప్రదాయాన్ని తలపించాయి. కొమురయ్యది సాదా సీదా బి సి  (కొమురయ్య దశదిన కర్మ కార్డు మీద పేర్లను బట్టి పద్మశాలి) వర్గానికి చెందిన కుటుంబంగా కనిపిస్తుంది.ఒకవేళ ఆ ఊళ్ళో ఒక ధనిక, అగ్రకుల కుటుంబంలోనే ఇలాంటి ఘర్షణ జరిగి ఉంటే, అక్కడ సైతం 'కాకి ముట్టక' పోయి ఉంటే, అదే గ్రామపెద్దలు
ఆ కుటుంబాన్ని వెలివేస్తా మని చెప్పి ఉండేవారా? అన్న సందేహం రాక మానదు.  ఇక పోతే  నిజంగానే కాకి చనిపోయిన వారి
ఆత్మ అని, వారితో మాట్లాడగలదన్న మూఢ విశ్వాసాన్ని వారంతా గాఢంగా నమ్మటం ఒక ఎత్తయితే, దానికి శాస్త్రాల ఆధారాన్ని ఓ బాపనయ్య తో చెప్పించటం  మరో విషాదం. వాస్త వాన్ని వాస్తవంగా చూపటం
ఎంత అవసరమైనా, సమాజ ప్రయాణం ఎటువైపు సాగాలో చూపాలని ఆశించటం అత్యాశ కాదు కదా? పిట్ట ముట్టటాన్ని సాగదీసిన దర్శకుడు
దానితో సమానంగా వల్లు పట్టటాన్ని కూడా చూపించి మరో మూఢ నమ్మకానికి సైతం దోహద పడ్డాడు. అశాస్త్రీయ, అహేతుక భావాలకు అతి ప్రాధాన్యతను ఇవ్వటం అటుంచినా,
సంప్రదాయికంగా కొనసాగుతున్న కుటుంబ సంబంధాలను కూడా ఎంతమాత్రం ప్రశ్నించకుండా కొనసాగించాడు  బలగం దర్శకుడు.

గ్రామీణ నేపథ్యంలో సాధారణంగా అల్లుడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న కారణంగా కినుక వహించిన అల్లుడు, కొమరయ్య కూతురు ను
తీసుకొని పోతాడు. అట్లా వెళ్ళిన కూతురు ఇరవై ఏళ్ల పాటు పుట్టింటికి రాదు. ' హూ నడువ్ ' అని భర్త హూంకరించినప్పు 
డల్లా కంట నీరుపెట్టు కుని, తలవంచుకుని భర్తవెంట వెళ్ళిపోవడమే తప్ప స్వతంత్రించి ఒక్కమాట మాట్లాడదు. భర్తకు కోపం వస్తే అతని మాట జవదాటకుండా  ముసలుకుంటుంది కొమురయ్య కూతురు. స్త్రీ పాత్రను ఇంత పేలవంగా ఈ 21 వ శతాబ్దంలో చూపటం ద్వారా చిత్రం సాధించదల్చుకున్నది ఏమిటో?
ఇకపోతే  ఇరవై ఏళ్ల పాటు దూరమైన మేనత్త  ఇంటిని చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనౌతుంది కథానాయక పాత్ర అయిన 'సాయిలు' పాత్ర. అయితే చిత్ర ప్రారంభంలోనే సాయిలుకు పెళ్ళి
కుదిరి ఉంటుంది. కొమురయ్య చనిపోయినప్పుడు ఆకుటుంబం కూడా వస్తుంది. కాని తన మేనత్త ఆస్తి పాస్తులకు ఆశపడి, అంతకు ముందే తనకు జరిగిన పెళ్ళి ఒప్పందాన్ని గూర్చిన ప్రస్తావనను ఎంతమాత్రం తేకుండానే మేనత్త కూతుర్ని  చేసుకోవాలన్న ఆశతో తన చిన్నతాత తో ఆ ప్రతిపాదన చేయిస్తాడు. ఆమోదం పొందుతాడు.
మరి తను గతంలో పెళ్ళి కుదిరిన అమ్మాయితో చేసిన ఫోను సంభాషణలన్ని, ఆత అమ్మాయికి తాను ఇచ్చిన ప్రాధాన్యాన్ని చప్పున మర్చి పోగలుగుతాడు. మరి ఆ అమ్మాయి, సాయిలు మార్చుకున్న అభిప్రాయం విషయంలో ఏమనుకుటుందో నన్న చర్చే లేదు చిత్రంలో. ఇది యువకుడు అయిన సాయిలు కు ఉన్న ఆశ అయితే ఫరవాలేదు గాని, ఇంట్లోని పెద్దవాళ్ళు సైతం ఆవిషయాన్ని ప్రసావనకు తేరు. 

స్త్రీ పాత్రలకు చిత్రంలో ఇచ్చిన " సముచిత " స్థానం ఇది. 
ఇన్ని వైరుద్ధ్యాలను పరిష్కరించకుండా, అసంబద్ధ విషయాల్ని ఏమార్చి చివరికి కుటుంబ సభ్యులందరిని ఏకం చేస్తాడు దర్శకుడు. మనుషులు అంతా ఏకం కావటానికి , మానవ సంబంధాల్ని బలోపేతం చేయటానికి ఏ ప్రయత్నమైనా చేయవచ్చు గానీ 
అది సమాజాన్ని వెనక్కి నడిపించ వద్దు కదా? మార్పును కోరుకోవటం అంటే ముందుకు సాగటమే గాని వెనక్కి కాదుకదా?
అయినా మనుషుల మధ్య మానవీయ విలువలు పతనం కావటానికి కేవలం వ్యక్తిగత అహంభావాలే కారణం అన్నట్లుగా, రాజకీయార్థిక కారణాలేవీ
లేవన్నట్లుగా చిత్ర కథనం కొనసాగుతుంది? నిరుద్యోగి అయిన కథానాయకుడు, తను నిలదొక్కుకోవటం కోసం చేసిన అప్పు, చెల్లించలేని వడ్డీ, అసలు సమస్యలు కాకుండా దర్శకుడు జాగ్రత్త పడతాడు. సరే
దర్శకుని ఉద్దేశ్యం ఆ విషయాన్ని చూపటం కాదనుకున్నా , పెళ్ళి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులతో 
అప్పు తీర్చవచ్చు నన్న ఆలోచనను కూడా సహజంగానే చూపుతాడు దర్శకుడు.

కళ్ళకు పచ్చిగా కనిపించే వైరుధ్యాలను ఎంతమాత్రం ముఖ్యమైనవి కావన్నట్లు, పనికి మాలిన అంశాల్ని, మూఢనమ్మకాల్ని అతిగా చూపి, మనుషుల్ని, కుటుంబాన్ని కలపటానికి మధ్యయుగాల సంప్రదాయాల్ని మూఢనమ్మకాలని ఆధారం చేసుకోవటం ద్వారా ఈ చిత్రం మనల్ని హతాశల్ని చేస్తుంది. నిజానికి ఇలాంటి 
అసందర్భ సన్నివేశాలతో, అశాస్త్రీయ విషయాలను ప్రోత్సహించే అనేక రకాలైన చిత్రాలు గతంలో వచ్చి ఉన్నాయి.  వాటన్నింటి గురించి మాట్లాడుకోకుండా  కేవలం ఈ బలగం చిత్రం గురించి చర్చించుకోవడానికి గల కారణం ఈ చిత్రం పట్ల ప్రజలకు ఉన్న సానుకూల అభిప్రాయమే. నిజానికి ఈ చిత్రం నుంచి నేర్చుకోదగ్గది ఏదో ఉందన్న ప్రజాభిప్రాయం దీనికి ఇంత ఆదరణ లభించడానికి కారణం అవుతూ ఉన్నది. అయితే ఈ చిత్రం చూపిన విషయాలలో ఎన్నో అశాస్త్రీయ విషయాలు ఉన్నప్పటికీ ముగింపు ప్రజలకు ఎంతో ఊరట కలిగిస్తూ ఉన్నది. దీని నుంచి ఏదో ఒక టేక్ హోమ్ అంశం ఉన్నదన్న భావన తోటే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. కేవలం ఆ కారణం వల్లనే ఈ చిత్రాన్ని సమీక్షించు కోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది.లక్ష్యం మంచిదైతే సరిపోదు కదా మార్గం కూడా మంచిది కావాలి. అయినా విడిపోయిన మనుషులు, ఎడబాటుకు గురియైన మనసులు  కలిసి పోతే లభించే  'మాధుర్యం' మాత్రం ప్రజల్ని మత్తు గొలుపుతుంది. ఏదిఏమైనా 
శాస్త్రీయ విలువలు, సమానత్వ భావనలపై నిర్మించబడే ఐక్యతే కలకాలం నిలబడుతుంది"

Courtesy by : టి .హరికృష్ణ
మానవ హక్కుల వేదిక

No comments:

Post a Comment