_ఎవరీ గుడ్డూ ముస్లిం..?_
*_అతీక్ సోదరుడి చివరి మాట అతడి పేరే..!_*
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_హత్యకు ఒక్క క్షణం ముందు గ్యాంగ్‌స్టర్ అతీక్ సోదరుడు అష్రాఫ్ తమ ప్రధాన బాంబ్ స్పెషలిస్టు గురించి ఏదో ప్రస్తావిస్తూ.. ‘‘అసలు విషయం ఏమిటంటే.. గుడ్డూముస్లిం’’ అని ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో అత్యంత సమీపం నుంచి హంతకులు అతీక్‌ను కాల్చేశారు. అష్రాఫ్ ఆ షాక్ నుంచి తేరుకొనేలోపే.. అతడిపై కూడా తూటాల వర్షం కురిసింది. దీంతో అతీక్ సోదరులిద్దరూ అచేతనంగా నేలపై పడిపోయారు. వారు ఏం చెప్పబోతున్నారు.. అసలా బాంబు స్పెషలిస్టు 'గుడ్డూముస్లిం ఎవరూ..?' అనే అంశంపై ఇప్పుడు చర్చజరుగుతోంది. ఉమేశ్‌పాల్ హత్య కేసు నిందితుల జాబితాలో అతడి పేరు ఉంది._*
*చిన్న కేసుల నుంచి..*
1990ల్లో గుడ్డూ ముస్లిం ప్రయాగ్‌రాజ్‌లో మెల్లగా పాపులారిటీ సంపాదించడం మొదలుపెట్టాడని 1977 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ఒకప్పటి యూపీ డీజీ బ్రిజ్‌లాల్ పేర్కొన్నారు. అతడు పాఠశాల విద్యను అభ్యసించే సమయంలో పశ్చిమబెంగాల్ వెళ్లి అక్కడ బాంబుల తయారీ, వాటి వినియోగం నేర్చుకొని వచ్చాడు. అందరూ అతడిని ‘గుడ్డూ బంబాజ్’, ‘గుడ్డూ ముస్లిం’ అని పిలిచేవారు. నాటు బాంబులు తయారీలో సిద్ధహస్తుడు. బైక్‌పై ప్రయాణిస్తూ లేదా పరిగెడుతూ కూడా అప్పటికప్పుడు నిమిషంలో నాటు బాంబు తయారు చేసి ప్రయోగించగలడు. అతడి వద్ద ఎప్పుడూ బాంబు తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉండేదని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమే అతడిని యూపీ గ్యాంగ్‌స్టర్ల సర్కిల్‌లో బాగా పాపులర్ చేసింది. ఒక్కసారి బాంబు నిపుణుడిగా పేరువచ్చాక గుడ్డూ ఈ నేరసామ్రాజ్యంలో వెనుదిరిగి చూడలేదు.
*వ్యాయామ శిక్షకుడి హత్యతో..*
వాస్తవానికి గుడ్డూ ముస్లిం నేరప్రస్థానం 1977లో మొదలైంది. ఆ ఏడాది గుడ్డూను అతడి తండ్రి లఖ్‌నవూ యూనివర్శిటీలో చేర్పించారు. లా మార్టినియర్ కాలేజీలో ఫెడ్రిక్ గోమేస్ అనే పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) శిక్షకుడిని హత్య చేశాడు. పోలీసులు ఈ కేసు నేరనిరూపణలో విఫలమయ్యారు. ఆ తర్వాత గుడ్డూ అప్పట్లో ఫైజాబాద్‌లోని సత్యేంద్ర సింగ్ అనే హిస్టరీ షీటర్ గ్యాంగ్‌లో చేరాడు. 1996లో శ్రీప్రకాశ్ శుక్లాతో జరిగిన ఓ గ్యాంగ్‌వార్‌లో సత్యేంద్ర హతమయ్యాడు. శుక్లాతో కూడా కలిసి గుడ్డూ పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్లు గోరఖ్‌పూర్‌లోని పర్వేజ్ టాడా అనే మాఫియా నాయకుడితో కలిసి పనిచేశాడు. అతడికి నాటు బాంబులను సరఫరా చేసేవాడు.
*అతీక్ అహ్మద్ గ్యాంగ్ వయా బిహార్..*
1998లో శ్రీప్రకాశ్ శుక్లా ఎన్‌కౌంటర్ తర్వాత గుడ్డూ ముస్లిం బిహార్‌కు వెళ్లిపోయాడు. అక్కడ ఉదయభాన్ అనే డాన్ గ్యాంగ్‌లో చేరాడు. నేరాలు చేయడానికి తరచూ ఉత్తరప్రదేశ్‌కు వచ్చేవాడు. 2001లో ఓ కేసులో యూపీ పోలీసులు అతడిని పట్నాలో అరెస్టు చేశారు. కానీ, ఆ కేసులో బెయిల్ దొరకడంతో యూపీలోని అతీక్ అహ్మద్ ముఠాలో చేరాడు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో గుడ్డూ కూడా నిందితుడే. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్‌పాల్ హత్య జరిగే సమయంలో గుడ్డూ ముస్లిం బైకుపై ప్రయాణిస్తూ బాంబులు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై రూ. 5 లక్షల రివార్డును ప్రకటించారు. అతీక్ అహ్మద్ గ్యాంగ్ మొత్తాన్ని ఓ రకంగా ఇతడే నడిపిస్తున్నాడు. ఈ గ్యాంగ్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదగాలన్న ఆశ కూడా అతడికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
*నాసిక్‌లో ఉన్నాడా..?*
ఉమేశ్ హత్య కేసులో కీలక నిందితుడైన గుడ్డూ కోసం పోలీసులు వేట తీవ్రతరం చేశారు. మీరట్, అజ్మీర్, ఝాన్సీ, నాసిక్‌లలో అతడి లొకేషన్‌ను ప్రత్యేక బృందాలు గుర్తించాయి. కానీ, అతడు వేగంగా తన స్థావరాలను మార్చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. నాసిక్‌లో అతడిని అరెస్టు చేసినట్లు వార్తలు కూడా గుప్పుమన్నాయి. కానీ, తాము అరెస్టు చేసిన వ్యక్తి గుడ్డూ ముస్లిం కాదని నాసిక్ పోలీసులు వివరణ ఇచ్చారు.
No comments:
Post a Comment