Monday, April 3, 2023

125 అడుగుల అంబేద్కర్ లోహమూర్తి

*అంబరమంత..... అంబేడ్కర్....!*

*125 అడుగుల లోహమూర్తి*
*ఆయన విగ్రహాల్లో* *దేశంలోనే ఎత్తయినది*
*ఈ నెల 14న* *ప్రారంభానికి సన్నాహాలు*

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల్లో దేశంలోనే అతి పెద్దది హైదరాబాద్‌లో సిద్ధమవుతోంది.ఆయన 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన 125 అడుగుల భారీ లోహమూర్తి అంతెత్తున ఠీవిగా నిలిచింది. అంబేడ్కర్‌ జయంతి వేళ.. ఈ నెల 14వ తేదీన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన 11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు అనేక విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంటోంది. 2016లోనే ఈ ఆలోచన పురుడు పోసుకున్నా.. కార్యరూపంలోకి రావటానికి సుమారు ఏడేళ్లు పట్టింది. ఇంత భారీ విగ్రహ నిర్మాణ సామర్థ్యం దేశీయంగా ఉందా? లేదా? అన్న మీమాంసతో అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం చైనాలో పర్యటించి వివిధ విగ్రహ తయారీ సంస్థలను సందర్శించింది. తర్వాత కరోనాతోపాటు చైనాతో నెలకొన్న సంబంధాల నేపథ్యంలో విగ్రహాన్ని దేశీయంగానే తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నమూనా రూపకల్పన, నిర్మాణ వ్యవహారాల కోసం టెండర్లు ఆహ్వానించింది. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌లు కలిసి విగ్రహ నమూనాలు సిద్ధం చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి తయారీ బాధ్యతను వారికి అప్పగించింది. విగ్రహ భాగాలను దిల్లీలో పోత పోసి హైదరాబాద్‌కు తరలించి ప్రతిష్ఠించారు. ప్రముఖ గుత్తేదారు సంస్థ కేపీసీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నిర్మాణ బాధ్యతను చేపట్టింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment