Wednesday, April 5, 2023

పద్మ అవార్డు అందుకున్న..... చినజీయర్, కీరవాణి

పద్మ అవార్డు అందుకున్న..... చినజీయర్, కీరవాణి!

దిల్లీ: గణతంత్ర దినోత్సవం  వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల  ప్రదానోత్సవం (రెండో సెషన్‌) సందడిగా జరిగింది.దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. మార్చి 22న తొలి విడతలో 50మందికి పైగా 'పద్మ' అవార్డులు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సాయంత్రం మిగిలిన వారందరికీ పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలను అందజేసి గౌరవించారు.తెలుగు రాష్ట్రాలనుంచి త్రిదండి చినజీయర్‌ స్వామి పద్మభూషణ్ అందుకోగా.. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. అలాగే, దివంగత నేత ములాయం సింగ్‌ యాదవ్‌కు కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ అందుకున్నారు. అలాగే, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. వీరితో పాటు మిగతా ప్రముఖులు 'పద్మ' పురస్కారాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్రం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్‌, 9 మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి. ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్‌ స్వామి, కమలేష్‌ డి.పటేల్‌లను పద్మభూషణ్‌ పురస్కారాలు వరించగా.. ఎం.ఎం.కీరవాణి సహా ఏపీలో ఏడుగురికి, తెలంగాణలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 22న కొందరు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకోగా.. మిగతా ప్రముఖులంతా ఈరోజు అవార్డులు స్వీకరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి కీరవాణి-రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment